MRI Accident : పేస్‌మేకర్ రోగికి.. ఎంఆర్‌ఐ
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:44 AM
ఆమెకు గుండె జబ్బు ఉంది.. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులు పేస్ మేకర్ కూడా అమర్చారు.
మిషన్‌లోనే గిలగిల్లాడుతూ ప్రాణాలు విడిచిన మహిళ
పరికరం ఉందన్నా స్కానింగ్‌కు పంపిన వైద్యులు
వివరాలేమీ అడగకుండా స్కానింగ్ చేసిన సిబ్బంది
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆమెకు గుండె జబ్బు ఉంది.. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులు పేస్ మేకర్ కూడా అమర్చారు. ఇలాంటి రోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయకూడదు. కానీ.. ఈ వివరాలేమీ పట్టించుకోకుండా ఆమెకు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. అంతే.. స్కాన్ తీస్తుండగా ఆమె ఆ మిషన్లోనే గిలగిలా కొట్టుకుంటూ భర్త కళ్లెదుటే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఏలూరు సుస్మిత డయాగ్నస్టిక్ సెంటర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రత్తికోళ్ళలంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసి (60)కి గతంలో పేస్‌మేకర్ అమర్చారు. అయితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు 2 నెలల నుంచి ఏలూరులోని ఒక ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. తనకు పేస్‌మేకర్ అమర్చిన విషయాన్ని అక్కడి వైద్యులకు తెలియజేశారు. తలనొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు సుస్మిత డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఎంఆర్‌ఐ స్కాన్ తీయించుకురావాలని సూచించారు. మంగళవారం ఉదయం రామతులసి, ఆమె భర్త కోటేశ్వరరావు డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఏమైనా ఆపరేషన్లు జరిగాయా, ఐరన్ రాడ్లు ఉన్నాయా, ఎలర్జీలు ఉన్నాయా వంటి వివరాలు తెలుసుకుని ఆపై స్కానింగ్ చేయాలి. అవేమీ లేకుండా వెంటనే స్కానింగ్ మిషన్‌లోకి పంపించారు. అక్కడ ఆమె భర్తను ఉంచారు. మిషన్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే ఆమె కాళ్లు కొట్టుకుంటూ విలవిల్లాడింది.
నిర్వాహకులకు తెలిపినా.. ఏమీ కాదు కాళ్లు కదలకుండా పట్టుకోవాలని సూచించారు తప్ప ఒక్కరు కూడా మిషన్ వద్దకు రాలేదు. దీంతో భర్త కళ్లెదుటే ఆమె ప్రాణాలు విడిచింది. అయినప్పటికీ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆమె బతికే ఉందని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అంబులెన్సు ఏర్పాటు చేశారు. అప్పటికే ఆమె మృతి చెందిన విషయం గ్రహించిన బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాన్ సెంటర్ నిర్వాహకులపై కేసునమోదు చేశారు. కాగా, స్కానింగ్ తీసే సమయంలో అర్హత కలిగిన టెక్నీషియన్ లేరని, రేడియోలజీ వైద్యులు కూడా ఆస్పత్రికి రాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారిణి నాగరత్నం అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె సుస్మిత స్కాన్ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 04:44 AM