యనమదుర్రు వంతెన పనుల్లో జాప్యం
ABN, Publish Date - May 02 , 2025 | 12:23 AM
వంతెన మర మ్మతులకు గురైంది. ఎట్టకేలకు రాకపోకలు నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఎప్పటిలాగే నిర్లక్ష్యం, అలసత్వం వాహనదారులకు శాపంగా మారింది.
రాకపోకలు నిలిపివేసినా ముందుకు సాగని పనులు
వాహనదారులకు తప్పని తిప్పలు
పాలకోడేరు, మే 1 (ఆంధ్రజ్యోతి): వంతెన మర మ్మతులకు గురైంది. ఎట్టకేలకు రాకపోకలు నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఎప్పటిలాగే నిర్లక్ష్యం, అలసత్వం వాహనదారులకు శాపంగా మారింది. అసంపూర్తి పనులతో ఉన్న వంతెనపై ఇనప ఊచల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. పాలకోడేరు – గొల్లలకోడేరు మధ్య యనమదుర్రుపై సుమారు 30 ఏళ్ల క్రితం వంతెన నిర్మించారు. భీమవరం నుంచి గొల్లలకోడేరు మీదుగా పాలకోడేరు, తణుకు, నవుడూరు తదితర గ్రామాలకు ఈ బ్రిడ్జే ప్రధాన మార్గం. గోతులు పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారడంతో ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు రాకపోకలు నిలిపివేశారు. పనులు జాప్యం కావడంతో గతంలోనే ‘తవ్వేశారు.. వదిలేశారు.. శీర్షికన ‘ఆంధ్రజ్యో తి’లో కథనం ప్రచురితమైంది. దీనితో మళ్లీ పనులు మొదలుపెట్టారు. ఏప్రిల్ నెలాఖరుకు రాకపోకలు పునరుద్ధరించాలి. ఈ దశలో ఐరన్ ఊచలు కట్టే పనులను రెండు రోజులుగా నిలిపివేశారు. శ్లాబ్ ఎప్పుడు వేస్తారు...? ప్రయాణాలకు ఎప్పుడు మార్గాన్ని సుగమం చేస్తారంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ తిరిగి రాలేక బ్రిడ్జిపై ఇనుప ఊచల మీద నుంచే ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలి.
Updated Date - May 02 , 2025 | 12:23 AM