చోటెవరికి..?
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:07 AM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుకోసం కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్య క్షుడిగా పీవీ మాధవ్‌ను నియమించారు.
మార్పులు, చేర్పులకే అవకాశం
ఇప్పుడున్న కొందరికి ప్రమోషన్
మరికొందరికి స్థానచలనం
కమలనాథుల్లో హైటెన్షన్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుకోసం కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్య క్షుడిగా పీవీ మాధవ్‌ను నియమించారు. జిల్లాల వారీగా ఇప్పటికే పాత కార్యవర్గం లో వివిధ హోదాల్లో ఉన్న సీనియర్లూ ఉన్నారు. ఈసారి వారందరిని యథా విధిగా కొనసాగిస్తారా, లేదా మార్పులు, చేర్పులకు దిగుతారా అనేది ఇప్పుడా పార్టీలో ఉత్కంఠగా మారింది. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో పాత,కొత్త కలయికలోనే ఈ కూర్పు ఉంటుందా, లేదా అనేది ఇంకో సందేహం.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జిల్లాలో ఇప్పటికే నూతన నాయకత్వం అందించిన బీజేపీ ఇప్పుడు మరోమారు రాష్ట్రస్థాయి విభాగం లోనూ సామాజిక వర్గాల వారీగా పట్టున్న నేతలను చేర్చుకోవాలని భావిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో పట్టుసడలకుండా మరింత బలపడేలా అడుగులు వేస్తోంది. నర్సాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, కైకలూరు ఎమ్మెల్యేగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇప్పటికే కొనసాగుతు న్నారు. గత ఎన్నికల్లోనూ సామాజికంగా పట్టు కోస మే బీజేపీ వ్యూహాత్మకంగా వీరిద్దరిని ఆయా స్థానాల నుంచి పోటీకి నిలిపింది. రెండు చోట్ల భారీ మెజార్టీతో ఆయా సీట్లను కైవసం చేసుకోగలిగింది.
ఉమ్మడి పశ్చిమలో నర్సాపురం ఎంపీ స్థానం ఆది నుంచి బీజేపీకి గట్టి పట్టున్న కేంద్రంగానే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నరసాపురం కోసం అప్పట్లో గట్టి పట్టు పట్టింది. బీజేపీలో వివిధ వర్గాలను కలు పుకునిపోవడం ద్వారా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మ వైపే ఆనాడు బీజెపీ మొగ్గు చూపింది. ఇప్పుడు కేంద్రమంత్రిగా ఆయన పైకెదిగారు. రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే ఉన్న వర్మను తాజాగా పీవీ మాధవ్ అధ్యక్షతన కార్యవర్గంలోకి తీసుకుంటారా, లేదా అనేది పార్టీలో చర్చకు దారి తీస్తోంది. పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న కేంద్రమంత్రి వర్మ ఢిల్లీ స్థాయిలోను ఇప్పుడు గట్టి పట్టు సాధించా రు. ఏపీ రాజకీయ వ్యవహారాల్లోనూ ఆయన కీలకం గా మారారు. ఎలాగూ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇప్పటికే బీజేపీలో కేంద్రమంత్రి వర్మ పెద్దదిక్కుగా మారారు. ఒకవైపు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉమ్మడి తూర్పుగోదావరిలో అప్పట్లో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మారుతున్న పరిణామాల క్రమంలో రాష్ట్రకార్యవర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారన్న విషయంలో బీజేపీలో అంతర్గత దుమారం చెలరేగుతోంది. కేంద్రమంత్రిగా వర్మ ఎదిగారు కాబట్టి ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా.. లేదంటే పార్టీ ఉపాధ్యక్ష స్థానానికి ప్రమోషన్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది.
మిగతావారి సంగతేంటి
జిల్లాలో సీనియర్ నేతగా, బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణను యఽథావిధిగా కొనసాగిస్తారా, లేదా అనేది మరో ప్రశ్న. వాస్తవానికి నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని భీమవరం కేంద్రంగా పాకా క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. వివాదాలకు తావులేకుండా పార్టీకి అణుకువగా ఉన్నారు. ఈ క్రమంలోనే నర్సాపురం లోకసభ స్థానం నుంచి శ్రీనివాసవర్మను కేంద్ర మం త్రి వర్గంలోకి తీసుకున్నా, అదే నియోజ కవర్గ పరిధిలో ఉన్న పాకాను ఈ మధ్యనే రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ నిర్ణయం వెనుక సామాజిక సమతుల్యం, పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారికే ప్రమోషన్లు ఉంటాయని బీజేపీ చెప్పకనే చెప్పింది. పార్టీలో ఒకనాడు ఉమ్మడి పశ్చిమ అధ్యక్షుడిగా పనిచేసిన పాకా అంచెలంచెలుగా రాష్ట్ర కమిటీ లో క్రమశిక్షణా సంఘం చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఇదంతా పార్టీ ఆచితూచి తీసుకున్న నిర్ణయం. ఇలాంటి సందర్భంలోనే పీవీ మాధవ్ అధ్యక్షతన పార్టీ మరింత దూసుకెళ్లాలంటే సీనియర్లతో పాటు మరికొంతమంది చురుకైన వారికి అవకాశం కల్పించే దిశగానే కసరత్తు జరుగుతుందా, లేదా అనే సందే హాలు పార్టీలో వినిపిస్తు న్నాయి. బీజెపీ ఆది నుంచి పార్టీ రాష్ట్రకార్యవర్గంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యత కల్పిస్తూనే వచ్చింది. పదిమంది రాష్ట్ర కార్యదర్శుల్లో ఇంతకుముందు ప్రస్తుత కేంద్రమంత్రి వర్మ కొనసాగారు. ఐదుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో ఏలూరుకు చెందిన తపన చౌదరి ఒకరుగా ఉన్నారు.
ఈసారి ఏలూరుకు ప్రాధాన్యం
రాష్ట్రకార్య వర్గంలో ఈసారి ఏలూరు జిల్లాకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి పట్టు దొరికేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో గారపాటి తపన చౌదరి చెమటోడ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానాన్ని ఆయన ఆశించారు. చివరి క్షణం వరకు ఆయన అభ్యర్థిత్వం పరిశీలనలోనే ఉంది. ఏళ్ల తరబడి ఇదే లోక్‌సభ స్థానంలో వ్యయా నికి లెక్క చేయకుండా మారుమూల గ్రామాల్లోను బీజెపీకి సభ్యత్వం సమకూర్చేలా చేశారు. ఒకదశలో బీజేపీయేతర పక్షాల్లోని సీనియర్లు సైతం తపన చౌదరికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇదంతా బీజెపీ అగ్రనాయ కత్వం గుర్తించినా అనూహ్యంగా అప్పట్లో ఆయనను అదృష్టం వరించలేదు. అయినా ఇంకోవైపు తపన చౌదరిని ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా నియమించారు. ఆఖరికి కేంద్ర స్థాయిలో గుర్తింపు పొందిన నామినేటెడ్ స్థానమైన చౌదరికి కల్పిస్తారని ఆయన అనుకూలురు ఊహించినా అదీ జరగలేదు. పార్టీలో పుల్‌టైమర్‌గా పనిచేసిన చౌదరిని పార్టీ పదవులతోనే సరిపెట్టారని ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మార్పు, చేర్పుల్లో భాగంగా తపన చౌదరికి మరింత ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. రాష్ట్రకార్యవర్గంలో ఈ ప్రాధాన్యత ఉండబోతుందని ఆ పార్టీలో వినిపిస్తోంది. అలాగే బీజేపీ మోర్చా అధ్యక్షురాలిగా నిర్మలా కిశోర్ ఇప్పటివరకు వ్యవహరించారు. పోలవరం నియోజకవర్గానికి చెందిన ఆమెను అన్ని విధాలా ఆలోచించి గతంలో రాష్ట్రస్థాయి మోర్చాకు ఎంపిక చేశారు. ఇప్పుడామె స్థానంలో వేరొకరికి అవకాశం లభించబోతుందని చెబుతున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:07 AM