క్లీన్ తాడేపల్లిగూడెం
ABN, Publish Date - May 27 , 2025 | 12:19 AM
తాడేపల్లిగూడెం పట్టణానికి డ్రెయినేజీ వ్యవస్థ శాపంగా పరిణమించింది. సమస్య పరిష్కారానికి భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్ట్ రూపొందించారు.
భూగర్భ డ్రెయినేజీకి రూ.80 కోట్లు
అవాంతరాలు అధిగమించి ముందడుగు
సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదిక
తాడేపల్లిగూడెం పట్టణానికి డ్రెయినేజీ వ్యవస్థ శాపంగా పరిణమించింది. సమస్య పరిష్కారానికి భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్ట్ రూపొందించారు. గత పాలకుల తొందరపాటు చర్య ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి భూగర్భ డ్రెయినేజీ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఎన్నో అవాంతరాలు దాటి గత ప్రభుత్వ హయాంలో ఒక కొలిక్కి వచ్చినా పాలకుల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రూ 80 కోట్లు మంజూరు చేసింది.
తాడేపల్లిగూడెం అర్బన్, మే 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0లో నిధులు కేటాయించారు. సమగ్ర ప్రాజక్టు నివేదికను సిద్ధం చేయను న్నారు. రెండో పట్టణ పరిధిలో పైప్‌లైన్లు పూర్తి చేయడంతో పాటు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈసారైనా ప్రాజెక్టు పూర్తి కావాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
నాడు కమీషన్ల కక్కుర్తి
తాడేపల్లిగూడెం పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ ఏర్పాటుకోసం 2008లో బీజం పడింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు మంజూరు చేయాల్సి ఉంది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్లినా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. కేంద్ర అనుమతి లేకుండానే పట్టణంలో పనులు ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. అప్పటి నాయకులు కమీషన్ల కోసమే ప్రాజెక్టును ప్రారంభించారన్న విమ ర్శలు వెల్లువెత్తాయి. డ్రెయినేజీ పనుల పేరుతో రహదారులను తవ్వి పైప్ లైన్లు వేశారు. కాని సీపేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) ఏర్పాటు చేయలేకపోవడంతో భూగర్భ డ్రెయినేజీ మరుగున పడిపోయింది. కేంద్రం నుండి నిధులు కూడా మంజూరు కాలేదు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వా లు కొత్త నిధులు మంజూరు చేశాయి. తొలిదశ అమృత ప్రాజెక్టులో భూగర్భ డ్రెయినేజీ నిర్మించాలని భావించినా ఆచరణ సాధ్యం కాలేదు. గత వైసీపీ హయాంలో ఒకటో పట్టణ పరిధిలో 2 ఎస్‌టీపీల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు తప్ప పూర్తిస్థాయి ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ గర్భ డ్రెయినేజీపై దృష్టి కేంద్రీకరించి నిర్మాణానికి రూ.80 కోట్లు కేటా యించారు. రెండో పట్టణంలో ఎస్‌టీపీలు సిద్ద కానున్నాయి. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను రూపొందించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నివేదిక ఆమోదం పొందిన తరువాత టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా భూగర్భ డ్రెయినేజీ పూర్తి కావాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
Updated Date - May 27 , 2025 | 12:19 AM