సారా రహిత జిల్లాగా పశ్చిమ
ABN, Publish Date - May 17 , 2025 | 12:33 AM
పశ్చిమ గోదావరిని సారా రహిత జిల్లాగా ప్రకటించడం సంతోషంగా ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ప్రత్యామ్నాయ ఉపాధికి రూ.13 లక్షల చెక్కు అందజేత
భీమవరం క్రైం, మే 16(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరిని సారా రహిత జిల్లాగా ప్రకటించడం సంతోషంగా ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవోదయం 2.0 కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో సారా తయారీని పూర్తిగా నిర్మూలించినట్లు తెలిపారు. తయా రీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థద్వారా స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సమకూర్చినట్టు తెలిపారు. జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సారా తయారీ, విక్రయాలను పూర్తిగా నిర్మూలించే దిశగా 13 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశామన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సారా తయారీ, రవాణా, విక్రయాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, తొలుత తహశీల్దార్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేస్తామని తర్వాత ఏడాదిపాటు బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ నమోదు అవుతుందన్నారు. ఎక్కడైనా నాటు సారా తయారీ, రవాణా, నిల్వ చేసినా, అమ్మకాలు జరిపినా 14405 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సారా వృత్తిలో ఉన్న వారిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎక్సైజ్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ కుమరేశ్వరన్, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఉపేక్షించం
భీమవరం రూరల్, మే 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్, ఏఆర్టీ అండ్ సరోగసీ యాక్ట్ అమలుపై సమీక్షించారు. గత ఏడాదికంటే కాళ్ళ, పెనుమంట్ర మండలాల్లో సెక్స్‌రేషియో తగ్గడంపై సమీక్ష నిర్వహించాలని డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. జిల్లాలోని 159 స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అకారణ అబార్షన్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎంహెచ్ డాక్టర్ జి.గీతాబాయి, ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:33 AM