ఉద్యోగులకు స్థానచలనం
ABN, Publish Date - May 21 , 2025 | 12:41 AM
ఉద్యోగుల్లో బదిలీల ఫీవర్ అలముకుంది. బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా సడలించడంతో ఉమ్మడి పశ్చిమలో ఎవరికివారు బదిలీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
బదిలీలపై నిషేధం సడలింపు
ఒకేచోట రెండేళ్లు పనిచేస్తే బదిలీకి అర్హులే..
ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తే బదిలీ తప్పనిసరి
నేటి నుంచి.. 24లోగా దరఖాస్తు చేసుకోవాలి
సిఫార్సుల కోసం నేతల వద్దకు పలువురు క్యూ
ఉద్యోగుల్లో బదిలీల ఫీవర్ అలముకుంది. బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా సడలించడంతో ఉమ్మడి పశ్చిమలో ఎవరికివారు బదిలీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మండల స్థాయిలో సిబ్బంది అత్యధికంగా బదిలీల వైపు మొగ్గుచూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ఇంకొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీస్‌శాఖలో కిందస్థాయి బదిలీలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
బదిలీలపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి నా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. బదిలీ విధి విధానాలు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రత్యేకంగా రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీకి అర్హులు. ఒకవేళ ఐదేళ్ల పైబడి ఒకే ప్రాంతంలో కొనసాగితే కచ్చితంగా బదిలీ చేస్తారు. ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్‌కు 9 నుంచి 10 ఏళ్లకు ఒకేచోట పనిచేయడానికి ఈసారి వెసులుబాటు కల్పించారు. చాలా శాఖల్లో సిబ్బంది కొరత ఉండగా, మరికొన్ని శాఖల్లో సర్‌ప్లస్ కనిపిస్తోంది. కొన్నిశాఖల్లో నాలుగో తరగతి ఉద్యోగులు అవస రం కాగా, ఇంకొన్ని చోట్ల సంఖ్యకు మించి సిబ్బంది ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పలు శాఖల్లో సిబ్బంది కొరత ఉంది. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడంతో రోజువారీ వ్యవహారాలకు ఉపయోగపడుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీ వో కార్యాలయాల్లో చాలాచోట్ల సిబ్బంది కొరతే. మారుమూల మండలాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాలకు అత్యం త దగ్గరగా ఉన్న మండలాల్లో మాత్రం పోటీ పడుతున్నారు. ఏలూరు జిల్లా కేంద్రం కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఐదు మండలాల్లోను ఈ తరహా పరిస్థితి ఉంది.
2వేల మందికిపైగానే..
ఈ సారి జరగబోతున్న సాధారణ బదిలీల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 2వేల పైగానే ఉండవచ్చని భావిస్తున్నారు. కొన్నిచోట్ల రిక్వస్ట్ బదిలీలకు అవకాశం ఉండటంతో ఆ దిశగా కదులుతు న్నారు. ఉపాధ్యాయ బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్ యాజమాన్యాల పరిధిలో గ్రేడ్–2 హెచ్‌ఎంల బదిలీకి ఆమోదం తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వార్డు, సచివాలయ సిబ్బందిని మార్పు, చేర్పులు చేసేందుకు ఇప్పుడు అవకాశం లేదు. పోలీస్‌శాఖలో ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఇటీవల బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్ణణ ప్రాంతాల్లో పనిచేసే వారిని రూరల్ ప్రాంతాలకు, అక్కడ పనిచేసిన వారిని పట్టణ ప్రాంతాలకు బదిలీ చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ..
సాధారణ బదిలీల్లో కావాల్సిన స్థానాలకు వెళ్లడానికి వీలుగా కొందరు సిఫార్సులతో ప్రయత్నిస్తున్నారు. సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియకే ప్రాధాన్యం. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా కొందరు ఎమ్మెల్యే సిఫార్సుల కోసం ప్రయత్నాలు ఆరంభించారు. వారంతా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి ఆశీస్సుల కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నారు.
బదిలీలకు మార్గదర్శకాలు
ఈనెల 31వ తేదీ నాటికి ఒకేచోట కచ్చితంగా ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగిని బదిలీ చేస్తారు.
సొంత అభ్యర్థనపై బదిలీ కోరుకునే ఉద్యోగులు బదిలీలకు అర్హులు.
పదవీ విరమణకు దగ్గర ఉన్న వారికి సాధారణంగా బదిలీలు ఉండవు.
ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వున్న ఉద్యోగులకు బదిలీలల్లో ప్రాధాన్యత ఉంటుంది.
దృష్టి లోపం, వినికిడి లోపం, శారీరకంగా చలన పరిమితులున్న ఉద్యోగులకు వారు కోరుకున్నచోటుకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు.
వైద్య పరమైన కారణాలను పరిగణలోకి తీసుకుంటారు.
మహిళా ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు భర్త పనిచేసే చోటుకు బదిలీ చేస్తారు.
ఒంటరి మహిళ స్వస్థలానికి కాని, కోరుకొన్న ప్రాంతానికి కాని బదిలీ చేసే అవకాశం ఉంది.
40 శాతం అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని బట్టి బదిలీలు ఉంటాయి.
వచ్చే నెల రెండో తేదీ నాటికి బదిలీలు పూర్తి చేయాలి. మూడో తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం వుంటుంది.
స్థాయిని బట్టి బదిలీలకు కౌన్సిలింగ్ తేదీలను ఇస్తారు. ఈ నెల 24లోపు బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత తర్వాత బదిలీల ప్రక్రియ వేగవంతం అవుతుంది.
Updated Date - May 21 , 2025 | 12:41 AM