బదిలీ హడావుడి నడుమ గురువులకు శిక్షణ
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:23 AM
బదిలీల హడావుడిలో ఉన్న ఉపాధ్యాయుల్లో కొందరు శిక్షణ కార్యక్రమాలతో సతమతం అవుతున్నారు. దీనితో శిక్షణ కార్యక్రమాలు ఆశించిన లక్ష్యం నెరవేరే దిశగా సాగడం లేదు.
వెబ్ ఆప్షన్లతో టీచర్ల కుస్తీ
డీఆర్పీలకు రేపటి వరకు శిక్షణ
8 నుంచి స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలకు
నెరవేరని లక్ష్యం
ఏలూరు అర్బన్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): బదిలీల హడావుడిలో ఉన్న ఉపాధ్యాయుల్లో కొందరు శిక్షణ కార్యక్రమాలతో సతమతం అవుతున్నారు. దీనితో శిక్షణ కార్యక్రమాలు ఆశించిన లక్ష్యం నెరవేరే దిశగా సాగడం లేదు. సెకండరీ విద్యలో ప్రారంభించనున్న టీచర్ హ్యాండ్‌బుక్, స్టూడెంట్ అసెస్‌మెంట్ బుక్, కరికులం, తదితర అంశాలపై డీఆర్పీలకు ప్రస్తుతం నిర్వహి స్తోన్న మూడు రోజుల శిక్షణ తరగతులు ఆశించిన లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. సాధారణ బదిలీలు జరుగుతున్న వేళ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరయ్యే స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయుల్లో బదిలీలు, వెబ్ ఆప్షన్లు నమోదు, తదితర అంశాలవైపే మొగ్గు కనబడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వ హించాలని ఇంతకుముందే నిర్ణయించారు. మండలా ల్లో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చేందుకు ముందుగా ఆయా సబ్జెక్టుల్లో ఎంపికచేసిన డీఆర్పీలకు స్టేట్ రిసో ర్స్ పర్సన్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏలూరు సుబ్బమ్మ దేవి మునిసిపల్ హైస్కూలులో మూడురోజులపాటు నిర్వహించే డీఆర్పీల శిక్షణ తరగతులు గురువారంతో ముగుస్తాయి. డీఆర్పీలంతా జిల్లావ్యాప్తంగావున్న 3250 మంది స్కూల్ అసిస్టెంట్లు, పదుల సంఖ్యలో ప్రధానో పాధ్యాయులకు నిర్ణీత అంశాలపై ఈ నెల 8, 9, 10 తేదీల్లో డివిజన్లలో శిక్షణనిచ్చేలా షెడ్యూలు ఖరారు చేశారు. కార్యక్రమం ఉద్దేశ్యం మంచిదేనైనా ప్రస్తుతం టీచర్ల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో శిక్షణపై ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు ఆయా ఖాళీలకు వెబ్ ఆప్షన్లను ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం తుది గడువు కావడం, అంతకుముందే సబ్జెక్టువారీగా సీని యార్టీ జాబితా విడుదలచేయడం, తదితర ప్రక్రియల నేపథ్యంలో డీఆర్పీల శిక్షణకు హాజరైన స్కూల్ అసి స్టెంట్లలో అత్యధికులు బదిలీలవైపే ఆసక్తి కనబరి చారు. ముఖ్యంగా తప్పనిసరి బదిలీ టీచర్లు, వయస్సు లో పెద్దవారు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి సమయం పడుతుండడంతో ఆ దిశగానే అభ్యర్థించి పర్మిషన్‌పై ముందుగానే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.
వీరిదో విచిత్ర సమస్య..!
కొద్దిరోజుల క్రితమే అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్‌ఎం పదోన్నతులు ఇచ్చారు. ఈ క్రమం లోనే కొత్తగా ఏర్పాటవుతోన్న మోడల్ ప్రైమరీ స్కూళ ్లకు హెచ్‌ఎంలుగా ఆసక్తికనబరిచిన స్కూల్ అసిస్టెం ట్లను కౌన్సెలింగ్‌పై నియమించారు. ఇలా స్థానచలనం పొందినవారిలో పలువురు తాజాగా నిర్వహిస్తోన్న డీఆర్పీల శిక్షణకు నియమితులయ్యారు. ఇపుడు వీరం దిరిదీ వింత పరిస్థితి. గ్రేడ్–2 హెచ్‌ఎం కేడర్/పీఎస్ హెచ్‌ఎం ఖాళీలు ఖాయమైన స్కూల్ అసిస్టెంట్లు భవిష్యత్‌లో ఎస్సీఈఆర్టీ శిక్షణకు ఎలా ఉపకరిస్తారనే చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ బదిలీల కు ముందు లేదా బదిలీ ప్రక్రియ ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత నూతన సంస్కరణలపై శిక్షణ ఇస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కో టీచరుపై శిక్షణ ఖర్చు రూ.700
డీఆర్పీల శిక్షణకు హాజరయ్యే స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలకు మూడు రోజులకు స్టేషనరీ, వర్కింగ్ లంచ్, స్నాక్స్, టీ, టీఏ, డీఏల నిమిత్తం ఒకొక్కరిపై రూ.700 ఖర్చు చేస్తున్నారు. డివిజన్లలో 3,250 మంది స్కూల్ అసిస్టెంట్లకు, హెచ్‌ఎంలకు ఇదేరీతిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఏలూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలకు సుమారు రూ.25 లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు సు మారు రూ.6.50 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుంది. వీటికితోడు శిక్షణకు హాజరైనవారందరికీ ఆర్జీత సెల వులు ఇవ్వాలి. ఇంత పెద్దమొత్తం ఖర్చు చేసినా తాజా బదిలీల్లో పలువురికి స్థానచలనం వల్ల శిక్షణ ఎంత వరకు ఉపయోగకరమని చెబుతున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:23 AM