రైతులకు.. ‘పగాకు’
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:12 AM
వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరతో వణుకు వస్తోంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పొగాకు సాగు చేసిన రైతులు నష్టాల భయంతో గగ్గోలు పెడుతున్నారు.
పొగాకు బేళ్లు వెనక్కి ..
వర్జీనియా రైతుల గగ్గోలు
ఎకరాకు రూ.3 లక్షల ఖర్చు
పెట్టుబడి దక్కదని ఆందోళన
ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్
వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరతో వణుకు వస్తోంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పొగాకు సాగు చేసిన రైతులు నష్టాల భయంతో గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి బాగున్నా ధరలు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
జంగారెడ్డిగూడెం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పొగాకు వేలం కేంద్రాలకు రైతులు పొగాకు తీసుకువచ్చినా ధర లభించక 50 శాతం బేళ్లు వెనక్కి వెళ్లిపోతు న్నాయని చెబుతున్నారు. దాదాపు ఐదు సార్లు తన బేళ్లు వెనక్కి వెళ్లిపోతున్నాయని కొయ్యలగూడెం మండలం రామానుజపురానికి చెందిన ఏసులంక నాగార్జున వాపోయాడు. ప్రతీ రోజు వందల్లో బేళ్లు వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో రైతులకు అదనంగా రవాణా ఖర్చు చేయాల్సి వస్తుంది.
గత ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో పొగాకు సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు కేంద్రం (18) పరిధిలో 12.64 మిలియన్ల పొగాకు పండించాలని రైతులకు పొగాకు బోర్డు నిర్దేశించింది. 2500 మంది రైతులు 6275 హెక్టార్లలో 18 మిలియన్ల పొగాకు పండిం చారు. జంగారెడ్డిగూడెం పొగాకు కేంద్రం (32) పరిధి లో 13.15 మిలియన్ కిలోల పొగాకు పంట లక్ష్యం. 2826 మంది రైతులు 6868.47 హెక్టార్లలో దాదాపు 19.5 మిలియన్ కిలోల పొగాకు పండించారు. రెండు వేలం కేంద్రాల పరిధిలో లక్ష్యానికి మించి దాదాపు 12 మిలియన్ల కిలోల పొగాకు అదనంగా పండిం చారు. వేలం కేంద్రం 18 పరిధిలో గత ఏడాది సరాసరి ధర 323.40 కాగా గరిష్ఠ ధర రూ.410, కనిష్ఠ ధర రూ.100 పలికింది. వేలం కేంద్రం 32 పరిధిలో గత ఏడాది సరాసరి ధర రూ.323.44 కాగా గరిష్ఠ ధర రూ.411, కనిష్ఠ ధర రూ.100 పలికింది.
ప్రస్తుతం కిలో పొగాకుకు సరాసరి ధర రూ.275 ఉండగా గరిష్ఠ ధర రూ.290, కనిష్ఠ ధర 220 ఉంది. ఈ ధరలు ఇలానే కొనసాగితే రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశముంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే బోర్డు ఇచ్చిన కోటా కంటే ఎక్కువగా పండించి న పొగాకుకు బోర్డు అధికారులు పెనాల్టీ వేస్తే రైతు లు మరింత నష్టపోతారు. ప్రభుత్వం పొగాకు ధరల పై దృష్టిపెట్టి గిట్టుబాటు ధర వచ్చేలా సహకరించక పోతే పొగాకు రైతులు తీవ్రంగా నష్ట పోతారు.
నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు
పొగాకు కొనుగోళ్లు మార్చి 24న ప్రారంభం కాగా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు జంగారెడ్డి గూడెం పొగాకు వేలం కేంద్రం–1లో 4.36 మిలియన్ల పొగాకు, వేలం కేంద్రం–2లో 3.82 మిలియన్ల పొగాకు ను బయ్యర్లు కొనుగోలు చేసినట్లు వేలం కేంద్ర అధికారులు బి.శ్రీహరి, జె.సురేంద్ర తెలిపారు. నాణ్య మైన పొగాకు అమ్ముకోవాలని సూచిస్తున్నారు. పొగా కు గ్రేడింగ్ చేసి హీట్ సక్రమంగా పెట్టుకోవాలని తెలిపారు. డ్యామేజి లేని నాణ్యమైన పొగాకుకు గరిష్ఠంగా రూ.290 ధర వస్తుందని తెలిపారు.
ఎకరాకు రూ.3 లక్షల ఖర్చు
ఎకరాకు సుమారు రూ.3లక్షల వరకు ఖర్చులయ్యాయి. ప్రస్తుత ధరతో రైతులు ఎకరాకు రూ.లక్ష నష్టపోతారు. కిలో పొగాకు సరాసరి ధర రూ.330 రావాలి. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో వర్జీనియా పొగాకు రైతు నాయకు లంతా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని కోరతాం.
సత్రం వెంకట్రావు, రైతు సంఘ అధ్యక్షుడు
నష్టానికే అమ్మాను
పొగాకును నష్టంతోనే అమ్మాను. సరాసరి ధర రూ.230 మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు 200 క్వింటాళ్ల పొగాకు అమ్మాను. మరో 400 క్వింటాళ్ల పొగాకు అమ్మాల్సి ఉంది. ఇవే ధరలు కొనసాగితే పూర్తిగా నష్టపోతాను. ధరలు పెరగక పోతే నష్టాల ఊబిలో కూరుకుపోతాను. ప్రభుత్వం, పొగాకు కంపెనీలతో సంప్రదించి రైతులకు గిట్టుబాటుధరలు వచ్చేలా చూడాలి.
పొన్నగంటి అనిల్, రైతు, తాడువాయి
Updated Date - Jun 16 , 2025 | 12:12 AM