టీచర్ల బదిలీకి అవరోధాలు
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:35 AM
ఉపాధ్యాయ బదిలీల్లో సాంకేతిక సమస్యలు ఒకదానివెంట మరొకటి తలెత్తుతుండటం, వాటిని పరిష్కరించేలోపే వేరొక అడ్డంకులతో వాయిదా వేశారు.
సాంకేతిక సమస్యలతో కౌన్సెలింగ్‌లో జాప్యం
రాత్రి అర్థాంతరంగా నిలిచిపోయిన ప్రక్రియ
నేటికి వాయిదా వేస్తూ అధికారుల నిర్ణయం
ఏలూరు అర్బన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల్లో సాంకేతిక సమస్యలు ఒకదానివెంట మరొకటి తలెత్తుతుండటం, వాటిని పరిష్కరించేలోపే వేరొక అడ్డంకులతో వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ కేడర్ ఉపా ధ్యాయుల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ స్థానే మంగళవారం నుంచి మాన్యువల్ కౌన్సెలింగ్ రాత్రి 8.30 గంటల తర్వాత ప్రారంభమైంది. అంతలోనే సాంకేతిక అవరోధాలతో రాత్రి 10.25 గంటలకు కౌన్సెలింగ్‌ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డీఈవో వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఏలూరు కార్పొరేషన్ ఎస్జీటీలకు, 11 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల టీచర్లకు కౌన్సెలింగ్ చేపడతారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మంగళవారం 264మంది మునిసిపల్ టీచర్లకు, 169 మంది కార్పొరేషన్ టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. వీరిలో కేవలం ఆరుగురు టీచర్లకు పూర్తయిన తర్వాత రాత్రి 9గంటల సమయంలో నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల టీచర్లంతా కౌన్సెలింగ్ కోసం ఏలూరు జడ్పీ ప్రాంగణంలోనే వేచిఉన్నారు.
పాస్‌వర్డ్‌తో ప్రతిష్టంభన
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కాగా ప్రస్తుతం ఎస్జీటీలకు నిర్వహిస్తోన్న మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఖాళీలకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చిన లింక్‌ను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్‌ను భీమవరం కేంద్రంగా వున్న పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయిం చడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏలూరు కేంద్రంగా జరుగుతున్న ఉమ్మడిజిల్లా టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించడానికి సమస్యలు తలెత్తాయి. విద్యాశాఖ ఐటి సెల్ ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేసరికే రాత్రి 8గంటలు దాటింది. వెంటనే మునిసిపల్ ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించినా తొలి ఆరుగురు టీచర్లు ఐచ్ఛికాలను ఇచ్చిన వెంటనే ప్రిఫరెన్షియల్ కేటగిరీ స్థానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి సమస్యను ఐటి సెల్‌కు తెలియజేశారు.
విద్యాశాఖ సిబ్బందిపై ఒత్తిడి
దాదాపు 21 రోజులుగా టీచర్ల సాధారణ బదిలీల ప్రక్రియలో నిమగ్నమైన డీఈవో కార్యాలయ సిబ్బందిపై మాన్యువల్ కౌన్సెలింగ్ మరింత భారాన్ని మోపిందని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా డీఈవో కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులను రాజమండ్రి, భీమవరం కేంద్రాలకు విభజించిన విషయం విదితమే. ప్రస్తుత బదిలీల నిర్వహణను ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులకు వర్తింపజేసి ఏలూరు డీఈవో కార్యాలయానికి బాధ్యతలను అప్పగించడంతో ఆఫీసు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి రెండు గంటలు దాటుతోందని, మళ్లీ మరుసటి రోజు ఉదయం 7గంటలకే కార్యాలయానికి వస్తున్నామని, మూడు వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యాశాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేపటిలోగా పూర్తిచేస్తాం : వెంకటలక్ష్మమ్మ, డీఈవో
పలు జిల్లాల్లో మాన్యువల్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక అవరోధాలు ఎదురవుతు న్నట్టు సమాచారం అందుతోంది. ఏలూరు కార్పొరేషన్ టీచర్లకు, 6 పురపాలక సంఘాల టీచర్లకు బుదవారం ఉదయం 8గంటల నుంచే ప్రారంబిస్తాం. ఆ వెంటనే జడ్పీ, ఎంపీపీ యాజమాన్య పాఠశాలల ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తాం. ఉమ్మడి జిల్లాలో మునిసిపల్ టీచర్లు 264 మంది, ఏలూరు నగరపాలక సంస్థ ఎస్జీటీలు 169 మంది, జడ్పీ, ఎంపీపీ యాజమాన్య ఎస్జీటీలు 2239 మందికి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఎస్జీటీలందరికీ ఈ నెల 12న ఎంత ఆలస్యమైనా బదిలీలు పూర్తి చేస్తాం.
Updated Date - Jun 11 , 2025 | 12:35 AM