కదిలారు.. కదిలించారు..
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:31 AM
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పోటాపోటీగా ప్రజల ముందుకు వెళ్లారు.
టీడీపీ తొలి అడుగులో ఉంగుటూరు నియోజకవర్గం ప్రథమం
క్షేత్రస్థాయిలో విస్తృతంగా కదిలిన టీడీపీ
చేసిన పనులు ప్రజలకు చేరవేశారు
ఎమ్మెల్యేలు, స్థానిక కేడర్ ఒకటై సాగారు
ప్రజల సమస్యలు నమోదు చేసుకున్నారు
జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోను పట్టుబిగించారు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పోటాపోటీగా ప్రజల ముందుకు వెళ్లారు. నెల రోజులుగా ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటివరకు తొలి అడుగులో జిల్లా వ్యాప్తంగా ఉంగుటూరు నియోజకవర్గం తొలిస్థానంలో నిలవగా, పోలవరం ఆఖరి స్థానంలో ఉంది. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు ఒకింత పట్టుదలతోనే తొలి అడుగు వేస్తున్నాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఈ నెల 2న శ్రీకారం చుట్టారు. పార్టీశ్రేణులు పరస్పర సమన్వయంతో ప్రజ లకు అన్ని వివరాలను అందించాలని అధిష్ఠానం నిర్దేశించంది. సంక్షేమం, అభివృద్ధికి పార్టీ, ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉన్నది వివరించడంతో పాటు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తు న్నారో తెలుసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నియోజక వర్గాల్లో క్లస్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే లేదా, కన్వీనర్ వరకు పూర్తి బాధ్యత వహించాలని కూడా సూచించారు. ఈ నెల మొదటి వారం నుంచే అందరూ క్షేత్రస్థాయిలో కదిలారు. ఇంటింటికీ ఏడాది విజయాలను వివరిస్తూనే వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు సాగిన విధ్వంసాన్ని గుర్తుచేస్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెలేలున్న నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసినందుకు కేడర్ కూడా ఉత్సాహంగా కదలింది. జిల్లాలో మంత్రులు కొలుసు పార్థసారధి, ఎండీ ఫరూఖ్, కొల్లు రవీంద్ర, అనిత, సవిత వంటి ముఖ్యులంతా నియోజకవర్గాలకు కదలివచ్చారు. స్థానిక నేతలను వెంటబెట్టుకుని ఊరూ వాడా తిరిగారు. దీనితో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం అలముకుంది. దీనికి తోడు స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక క్రమపద్ధతిలో దూసుకుపోవడానికి ప్రయత్నించారు. ఈ లోపు కొన్ని నామినేటేడ్ పదవులు భర్తీ కావడంతో పాటు తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో తొలి అడు గుకు మరింత ఊపు తెచ్చాయి. దీనితో పాటు పార్టీ నియోజక వర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్‌చంద్ర శేషు వంటి వారు సైతం ఎక్కడా తగ్గకుండా తొలిఅడుగులో పాలు పంచుకున్నారు.
ఉంగుటూరు టాప్..
జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగు టూరు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు తొలిఅడుగులో సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో 68,124 కుటుంబాలతో తెలుగుదేశం శ్రేణులు మమేకమయ్యారు. టీడీపీ జిల్లా అధ్య క్షుడు గన్ని వీరాంజనేయులు, నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా అడుగు ముందుకేశారు. కార్యక్రమం ముగిసేందుకు కొద్దిరోజులే మిగిలి ఉండగా మారుమూల ఉన్న నివాస గృహాలను సైతం సందర్శించడంతో నూరు శాతం మించి అడుగు వేయగలిగారు. రోజూవారీ కార్యక్రమంను విశ్లేషిస్తున్న వారంతా అధికారికంగా పార్టీ కార్యాలయానికి సమాచారం అందించారు.
తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు రెండోస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 80,348 నివాస గృహాలుండగా వీటిలో 95.80 శాతం నేరుగా సందర్శించారు. కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఏడాది కాలంగా పార్టీచేసిన మంచి పనులను విడమరిచి చెప్పడంలో మంత్రితో పాటు అక్కడి కేడర్ కూడా విజయవంతమైంది. ఏలూరు నియోజకవర్గంలో తొలి అడుగులో ఎమ్మెల్యే చంటితో పాటు క్యాడర్ పరుగులు పెట్టింది. ఇప్పటిదాకా 88.75శాతం నివాస గృహాలకు వెళ్లి టీడీపీ ప్రభుత్వ విజయాలను వివరించగలిగారు. సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ నిర్విరామంగా పనిచేసింది. ప్రతీ ఊరిలో పండుగ వాతావరణం తలపించేలా చింతమనేని యాత్ర సాగింది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో 74.75 శాతం నివాస గృహాలను టచ్ చేయ గలిగారు. చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌తో పాటు మిగతా కేడర్ 46.88, కైకలూరులో 47.95, పోలవరంలో 32.02 శాతం నివాస గృహాలను ఆయా కుటుంబాలను స్ధానిక నేతలు కలుసుకోగలిగారు. పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తుండగా జిల్లాలో విస్తీర్ణంలో అతి పెద్దదైన ఈ నియోజకవర్గంలో ఆయా కుటుంబాలను కలుసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నించింది. కైకలూరులో బీజెపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గంలో కూడా టీడీపీ వెనుకంజ వేయకుండా ఆయా గ్రామాల్లో కుటుంబాలను టచ్ చేస్తూనే వచ్చింది. మొత్తం మీద తొలి అడుగులో ఏలూరు జిల్లావ్యాప్తంగా ప్రజలతో మమేకం కావడంలో టీడీపీ ఒకింత విజయం సాధించినట్లే కనిపిస్తోంది.
Updated Date - Jul 30 , 2025 | 12:31 AM