‘తల్లికి వందనం’.. ప్రై‘వేటు’
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:41 AM
జిల్లాలో 1261 మంది పేద విద్యార్థులకు ఆర్డీఈలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు.
ఆర్టీఈ ప్రవేశం పథకానికి అనర్హత!
కార్పొరేట్ పాఠశాలలకు పేద విద్యార్థులు ఎంపిక
చేర్చుకోడానికి యాజమాన్యాలు వెనుకంజ
మరి కొందరు విద్యార్థుల నిరాసక్తత
అయినప్పటికీ ఆర్టీఈ జాబితాలో విద్యార్థులు
తల్లుల ఖాతాలో జమ కాని వందనం సొమ్ము
స్పష్టత ఇవ్వలేకపోతున్న అధికారులు
తాడేపల్లిగూడెంలో డి.రుషికేశ్ ఒకటో తరగతిలో చేరాడు. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద రుషికేశ్ దరఖాస్తు చేయకున్నా ప్రైవేటు పాఠశాలలో సీటు కేటాయించారు. ఫలితంగా తల్లికి వందనం పథకాన్ని హోల్డ్‌లో పెట్టారు. రుషికేశ్ తల్లి స్వాతి సచివాలయం, మునిసిపల్ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేదు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రుషికేశ్ అన్న తనూష్‌కు మాత్రం తల్లికి వందనం సొమ్ము రూ.13వేలు స్వాతి ఖాతాలో పడింది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ఆర్టీఈ పేరుతో సొమ్ములు పడలేదు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో 1261 మంది పేద విద్యార్థులకు ఆర్డీఈలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. సీట్లు మంజూ రైనా చేర్చుకోవడానికి కొన్ని పాఠశాలలు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం ట్యూషన్ ఫీజు తక్కువగా చెల్లిస్తుందన్న ఉద్దేశంతో యాజమాన్యాలు ఏదొక కారణం చూపుతూ విద్యార్థులను చే ర్చుకోవడం లేదు. కిలో మీటరు పరిధిలో లేరంటూ తాడేపల్లి గూడెంలో ఒక ప్రైవేటు పాఠశాల ఆర్టీఈలో సీటు లభించిన విద్యార్థిని చేర్చుకోవడానికి నిరాకరించింది. భీమవరంలో ఫీజు లు అధికం కావడంతో కార్పొరేట్ పాఠశాలలు ససేమిరా అంటు న్నాయి. అక్కడ సీటు లభించినాసరే విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపడం లేదు. పుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు అధికంగా ఉండడంతో విద్యార్థులు ఆర్టీఈలో సీటు లభించినా చేరడం లేదు. విద్యార్థి చేరినా చేరకున్నా ఆర్టీఈలో పేరు ఉండడంతో తల్లికి వందనం సొమ్ము అందడం లేదు.
ఆర్టీఈతోనే తంటా
ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు కూడా రెండో విడత లో సొమ్ములు జమ అయ్యాయి. ఆర్టీఈ జాబితాలో అత్యధిక మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వం కేటాయించిన సీట్లకంటే జిల్లాలో ఎక్కువగానే ఆర్టీఈ జాబితాలో ఉన్నట్టు పిల్లల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు, సచివాలయ ఉద్యో గుల్లో స్పష్టత కొరవడింది. ఆర్టీఈలో ఉన్న వారికి తల్లికి వంద నం పడితే రూ.8,500 పాఠశాల యాజమాన్యాలకు చెల్లించాలి. లేదంటే ప్రభుత్వమే పాఠశాలలకు రూ.8,500 మినహాయించి మిగిలిన సొమ్ము జమ చేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణ యం తీసుకుంటుందనేది జిల్లా అధికారులకు స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆర్టీఈపై తల్లిదండ్రుల్లో చర్చ సాగుతోంది.
రెండో విడత సొమ్ము జమ
తల్లికి వందనం పథకంలో తల్లుల ఖాతాలో రెండో విడత సొమ్ములు జమ అయ్యాయి. జిల్లాలో తొలి విడత 1,76,574 మందికి రూ.13వేలు వంతున తల్లుల ఖాతాలో సొమ్ము జమ కాగా 41,703 మంది గతంలో అనర్హుల జాబితాలో ఉన్నారు. విద్యుత్ బిల్లు, సొంత స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తదితర కారణాలతో 41,703 మందికి అనర్హుల జాబితాలో ఉంచారు. జిల్లాలో 20,139 మంది అ భ్యంతరాలు నమోదు చేయడంతో 11,416 మంది విద్యార్థు లకు రెండో విడతలో సొమ్ములు జమ చేశారు. మరో 4,262 అభ్యంతరాలు పరిశీలనలో ఉండగా వాటి నుంచి అత్యధికం గా అర్హుల జాబితాలో చేరనున్నాయి. వారికి కూడా రూ.13 వేల వంతున ప్రభుత్వం జమ చేయనుంది. నాలుగు చక్రాల వాహనాలు, భూములు, ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యో గుల జాబితాలోకి 1,558 మంది విద్యార్థులు చేరారు. వారికి తల్లికి వందనం సొమ్ములు జమయ్యే అవకాశం లేదు. విద్యుత్ బిల్లు అధికంగా ఉన్న కుటుంబాలకు సంబం ధించి మరో 2,036 మంది విద్యార్థులకు కూడా రెండో విడతలో తల్లికి వందనం వర్తించలేదు. మరో 290 మంది విద్యార్థులకు అర్హత ఉన్నా వారి డేటా వెబ్‌సైట్‌లో కానరావడం లేదు. అనర్హులుగా గతంలో ప్రకటించిన విద్యార్థుల నుంచి మళ్లీ అభ్యంతరాలను స్వీకరించి ఇలా రెండో విడతలో అత్యధిక మంది విద్యార్థులకు తల్లికి వందనం సొమ్ము జమ చేశారు.
Updated Date - Jul 24 , 2025 | 12:41 AM