అన్నీ పాత భవనాలే..
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:24 AM
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి పురాతన భవనాల్లోనే మగ్గుతున్నాయి. వర్షం కురిస్తే రికార్డుల గదుల్లోకి వర్షపు నీరు చేరుకునే దుస్థితి ఏర్పడుతోంది.
శిథిల భవనాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి పురాతన భవనాల్లోనే మగ్గుతున్నాయి. వర్షం కురిస్తే రికార్డుల గదుల్లోకి వర్షపు నీరు చేరుకునే దుస్థితి ఏర్పడుతోంది. మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం లేదు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు అడపాదడపా నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రయోగాలకు రిజిస్ర్టేషన్ శాఖ బలైపో యింది. సచివాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు చేస్తామంటూ గడిచిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌లు చేపట్టింది. జిల్లాలో దాదాపు 45 సచివాలయాలను ఎంపిక చేసింది. అక్కడ రిజిస్ర్టేషన్ చేసే బాధ్యతను సబ్‌రిజిస్ర్టార్‌లకు అప్పగించింది. టార్గెట్‌లను నిర్దేశించింది. ఇలా ఎన్నో ప్రయోగాలతో సిబ్బంది విసిగిపోయారు. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లోని సమస్యలపై ఆంధ్రజ్యోతి ఫోకస్ పెట్టింది. సిబ్బంది ఇబ్బందులు అనేకం వెలుగులోకి వచ్చాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
నరసాపురంలో వర్షం వస్తే లీకేజీలు
నరసాపురం : జిల్లాలో అతి పురాతనమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నరసాపురం ఒకటి. 1860లో నిర్మించిన కార్యాల యంలో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి పరిస్థితి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా.. వర్షం వస్తే లీకేజీలు తప్పవు, భవనం పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం వెంటాడుతోంది. రికార్డు రూమ్‌కు భద్రత లేదు. కార్యాలయానికి సరైన రక్షణ గోడ లేదు, సీసీ కెమెరాలు లేవు. రాత్రి వాచ్‌మెన్ లేడు, పట్టణ, మండలానికి సంబంధించిన రికార్డు అంతా ఈ రూమ్‌లోనే ఉంటుంది. సిబ్బందికి సరైన వసతులు లేవు. మరుగుదొడ్లు, వాష్ రూమ్‌లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సిబ్బంది కొరత వెంటాడుతోంది.
తణుకులో దెబ్బతిన్న కార్యాలయం
తణుకు : తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం భవనం శిథిలా వస్థకు చేరింది. సు మారు 150 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మిం చారు. ప్రభుత్వాలు మారుతున్నా తణుకు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి మంచి రోజులు రాలేదు. భవనం రూపు రేఖలు మారలేదు. ప్రస్తుత కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. వరా ్షకాలంలో భవనం పైకప్పునుంచి లీకేజీలు అధికంగా ఉంటున్నాయి. వర్షపు నీరు కార్యాలయంలో కారుతుంటుంది. కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేవు. సిబ్బంది ఇబ్బందులు గురవుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని వదిలివేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అద్దె భవనంలోకి వెళ్లాలని ప్రతిపాదనలు చేశారు. ఆచరణలో సాధ్యం కాలేదు.
తాడేపల్లిగూడెంలో సమస్యల తిష్ఠ
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమస్యలతో సతమతమవుతోంది. కార్యాలయం పూర్వకాలం నిర్మించిన భవనంలో ఉండడం వల్ల వర్షం వస్తే అంతా చెమ్మ చేరిపోతోంది. రికార్డ్స్‌కు సరైన భద్రత కరువైంది. ఆ రికార్డ్సు భద్రపరిచే ప్రాంతం సీలింగ్ అంతటా వర్షపు నీరు లీకేజీ అవుతోంది. గతంలో వర్షం కురిస్తే రికార్డుల గదిలోకి వర్షపు నీరు చేరిపోయింది. ఇటీవల మరమ్మతులు చేశారు. రికార్డులను కింద ఉంచకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ సీలింగ్ నుంచి నీరు లీకేజీ అవుతోంది. రిజిస్ర్టేషన్‌కు వచ్చే వారి కోసం మరుగుదొడ్ల సదుపాయం లేదు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడే లేఖరులు ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇటీవల దానిని కూడా వివాదాస్పదం చేశారు, అక్కడ చిన్నపాటి షెడ్డులను నిర్మించుకోవడానికి చర్యలు తీసుకుంటే ఇతర శాఖల అధికారులు అడ్డుకున్నారు.
భీమవరంలో ఇరుకు గదులు
భీమవరంటౌన్ : భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే రిజిస్ట్రేషన్‌దారులు ఎండ తీవ్రతకు అల్లాడిపోయారు. కూర్చునేందుకు షెడ్‌లుల లేవు, కనీసం బెంచీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మంచినీటి సౌకర్యం లేదు. కార్యాలయంలోనూ సరైన వసతులు లేవు. ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం పాడుబడ్డ భవనాన్ని తలపిస్తోంది. సిబ్బంది కొరత వెంటాడుతోంది.
ఇరవై ఏళ్లు పైబడి అద్దె భవనంలోనే
ఆకివీడు : ఆకివీడు సబ్–రిజస్ట్రార్ కార్యాలయం ఇరవై ఏళ్ల పైబడి అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారికి అనుకుని ఉంది. పార్కింగ్ కోసం రిజిస్ర్టేషన్‌కు వచ్చిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు పెట్టుకునే స్థలం లేదు. రిజిస్ర్టేషన్ సమయంలో కనీసం డాక్యుమెంట్‌లను రాసుకునే సౌకర్యాలు కూడా సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద లేవు. నూతన కార్యాలయం కోసం స్థలం ఇస్తామంటూ ఓ దాత ముందుకొచ్చారు. ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు ముందుకొస్తేనే ఆకివీడులో సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి సొంత భవనం కల సాకారమవుతుంది.
పాలకొల్లులో పార్కింగ్ సమస్య
పాలకొల్లు టౌన్ : పాలకొల్లు పట్టణంలోని సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయం సుమారు 90 ఏళ్ల క్రితం నిర్మించినది. నూతన భవనం నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ కోసం నిత్యం వచ్చే కక్షిదారులు ఎండ, వానల్లోనే సిమెంట్ బెంచీలపై కూర్చుంటారు. ఇక కక్షి దారుల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుమీదనే వాహనాలు నిలిపి ఉంచుతారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడకు వచ్చే వారికి టాయ్‌లెట్ సౌకర్యం లేకపోవడంతో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే కార్యాలయం ఆవరణ అంతా మునిగిపోతుంది, వర్షపు నీటిని ప్రత్యేకంగా మోటార్లు పెట్టి బైటకు తోడించాల్సి వస్తోంది.
Updated Date - Apr 17 , 2025 | 12:27 AM