ఇసుక నిల్వలు
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:28 AM
వేసవిలో వర్షాలు కురిశాయి. ఇక వానాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
వర్షాకాలంలో కొరత లేనట్టే
నిల్వ చేసుకుంటున్న నిర్మాణదారులు
స్టాక్ పాయింట్‌లలో నిల్వ చేస్తున్న ప్రభుత్వం
ప్రస్తుతం ఆరు యూనిట్‌లు రూ. 9వేలు
త్వరలోనే ఓపెన్ ర్యాంప్‌లు మూత
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వేసవిలో వర్షాలు కురిశాయి. ఇక వానాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వర్షాలు ప్రారంభమైతే ఇసుక కొరత రానుంది. ఓపెన్ ఇసుక ర్యాంప్‌లను మూసి వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగానే ఇసుక నిల్వలు సిద్ధం చేయడంతో కొరతను అధిగమించవచ్చు. జిల్లాకు తూర్పు గోదావరి పరిధిలోని తీపర్రు. పందలపర్రు ర్యాంప్‌లను కేటాయిం చారు. ఔరంగా బాద్ రీచ్‌ను కేటాయించారు. అక్కడ గోదావరిలో ఇసుకను తవ్వి ఒడ్డుకు చేరుస్తున్నారు. వానాకాలంలో ఔరంగా బాద్ నుంచే ఇసుక సరఫరా అవుతుంది. నాలుగు నెలలపాటు మూడు నెలలపాటు ర్యాంప్‌లు మూతపడనున్నాయి. దాంతో నిర్మాణదారులు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇసుక ధరలు పెరిగిపోనున్నాయని అంచనా వేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ప్రాజెక్ట్‌ల కోసం ముందుగానే నిల్వలు చేసుకుంటు న్నారు. ప్రస్తుతం రూ. 9వేలకే ఆరు యూనిట్‌ల ఇసుక లభ్య మవుతోంది. గత ప్రభుత్వంలో ఐదు యూనిట్‌లు రూ. 14వేలకు విక్రయించారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమలులోకి తెచ్చారు. సీనరేజీ, జీఎస్‌టీ ఎత్తివేశారు. ర్యాంప్‌ల వద్ద అదనంగా కాస్త సొమ్ములు వసూలు చేస్తున్నా సరే ఆ మొత్తానికి అదనంగా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఫలితంగా నిర్మాణదారులకు ఇసుక లభ్యత సునాయసమైంది. ఉచిత ఫలితం చూస్తున్నామంటూ నిర్మాణదారులు చెప్పుకొనే పరిస్థితి నెలకొంది. వానా కాలంలో ఇసుక లభ్యత తగ్గుతుంది. వరదల సమయంలో గోదావరిలో ఇసుక తవ్వకాలు నిలచిపోనున్నాయి. వానా కాలంలో గోదావరి ప్రవాహం సాధారణంగా ఉన్నప్పుడే నీటిలో ఇసుకను వెలికి తీసి ఒడ్డుకు చేరుస్తారు. అదికూడా రెండు రీచ్‌ల్లోనూ అధికమొత్తంలో తవ్వకాలు ఉంటాయి. మిగిలిన ర్యాంప్‌లు, రీచ్ లు మూతపడతాయి. దాంతో ఇసుక సరఫరా గణనీయంగా తగ్గిపోతుంది. దాంతో డిమాండ్ ఏర్పడుతుంది. ధరలు పెరగ నున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణదారులు ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నారు. మూడు నెలలకు సరిపడా ఇసుక భద్ర పరుస్తున్నారు.
స్టాక్ పాయింట్‌లలో నిల్వ
వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా జిల్లా అధికారులు చర్య లు తీసుకున్నారు. స్టాక్ పాయింట్‌లలో ఇసుక నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, ఉండి, నరసాపురం పరిధిలో స్టాక్ పాయిం ట్‌లను గుర్తించారు. నిల్వ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటిదాకా విరివిగా ఇసుక లభ్యమైంది. డిమాండ్ లేనట్టయితే నష్టాలు చవిచూస్తామని కాంట్రాక్టర్లు స్టాక్ పాయింట్‌లలో నిల్వకు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం స్టాక్ పాయింట్‌ల వద్ద ధరను నిర్ణయించనుంది. ఆ మేరకు కాంట్రాక్టర్లు ఇసుక సరఫరా చేయాలి. ధర ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో నిర్మాణదారులు తమ సొంత స్థలాల్లో నిల్వ చేసుకుంటున్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:28 AM