రియల్ డౌన్
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:40 AM
ఏప్రిల్‌లో రిజిస్ర్టేషన్‌లు పూర్తిగా మందగించాయి. ప్రతి నెల సగటున రూ.10 కోట్ల మేర భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఆదాయం రావాలి. ఇప్పటి వరకు రూ.2 కోట్లు రావడం కష్టమైంది.
ఏప్రిల్‌లో రిజిస్ర్టేషన్‌లు పూర్తిగా మందగించాయి. ప్రతి నెల సగటున రూ.10 కోట్ల మేర భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఆదాయం రావాలి. ఇప్పటి వరకు రూ.2 కోట్లు రావడం కష్టమైంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఇంకా కోలుకోలేదు. ఆ ప్రభావం జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఉంది. పట్టణాల్లో స్తంభించిన నిర్మాణ రంగం
కొత్త ప్లాన్‌ల నమోదుకు వెనుకంజ
పెన్‌డౌన్ చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్‌లు
తాజా నిబంధనలపై ఆందోళన
భారీగా పతనమైన రిజిస్ర్టేషన్ ఆదాయం
భీమవరంలో ఏప్రిల్‌లో రావాల్సింది రూ.10 కోట్లు.. ఇప్పటికి వచ్చింది రూ.2 కోట్లు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పట్టణాల్లో లైసెన్స్‌డ్ సర్వేయర్లు పెన్‌డౌన్‌తో ప్లాన్‌లు తయారు కావడం లేదు. ఫలితంగా పట్టణాల్లో రియల్ అమ్మకాలు, కొనుగోళ్లు, నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. నిర్మాణ రంగంలో జోష్ నింపేందుకు మున్సిపల్ శాఖ నిబంధనలను సరళతరం చేసింది. ప్లాన్ కోసం పట్టణ ప్రణాళిక అధికారుల చుట్టూ తిరగకుండా ఉండేలా వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్‌లో ప్లాన్‌లు నమోదు చేసి, మున్సిపాలిటీకి సొమ్ము చెల్లిస్తే అప్రూవల్ వస్తుంది. ఆపై నిర్మాణదారుడు వెంటనే ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభించవచ్చు. అయితే ఏ కొద్దిపాటి అతిక్రమణ జరిగినా ఎల్‌టీపీలపై వేటు పడుతుంది. ఆరు నెలలపాటు వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. పదే పదే ఇటువంటివి పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేస్తారు. దీనిపై ఎల్‌టీపీలు పెన్‌డౌన్‌కు ఉపక్రమించారు. తమపైనే వేటు పడే నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఉన్న ప్లాన్‌లలోనే కాస్త నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త ప్లాన్‌లు రావడం లేదు. ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపట్టినా గతంలో పది శాతం వరకు అతిక్రమించుకునే వెసులుబాటు కల్పించారు. తదుపరి రోజుల్లో మున్సిపాలిటీకి జరిమానా చెల్లించి క్రమబద్ధీకరించుకునే వారు. దీనిపై న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. నిబంధనలను అతిక్రమించి నిర్మించే భవనాలను ఎలా క్రమబద్ధీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. మరోవైపు అతిక్రమణలు లేకుండా షరతులు విధించింది. ఇదే ఇప్పుడు ఎల్‌టీపీలను ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే యజమానులపై చర్యలు ఉండాలి. అలా కాకుండా ఆన్‌లైన్‌లో ప్లాన్‌లు నమోదు చేసే తమపైనే చర్యలు ఉంటాయంటూ మునిసిపల్ శాఖ జారీ చేసిన నిబంఽధనలను వ్యతిరేకిస్తున్నారు. నెలన్నరగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు పట్టణాల్లో ప్లాన్‌లు నమోదు కావడం లేదు.
రిజిస్ర్టేషన్‌లు అంతంతే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ ఏర్పడుతుందని అంతా ఆశించారు. ఇప్పటి వరకు ఈ రంగంలో ఎలాంటి కదలిక లేదు. నిర్మాణదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన్‌లు జరగడం లేదు. ప్రభుత్వం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు లక్ష్యాలను ఇస్తున్నా అనుకున్న ఆదాయం రావడం లేదు. కొత్తగా లే అవుట్‌లు వేయడం లేదు. స్థలాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భీమవరం వంటి జిల్లా కేంద్రంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తిగా నిలిచి పోయింది. భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో గత ఏడాది రూ.123 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించారు. అందులో రూ.100 కోట్లు సాధించడం కష్టమైంది. మార్చిలో ఒత్తిడి పెంచి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంది.
Updated Date - Apr 20 , 2025 | 12:40 AM