ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:32 AM
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆర్‌వోబీ (రైల్వే ఓవర్‌బ్రిడ్జి), ఆర్‌యూబీ (రైల్వే అండర్‌బ్రిడ్జి)ల నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతించారు.
మొత్తం నాలుగు బ్రిడ్జిల నిర్మాణం
రైల్వే శాఖ అనుమతి మంజూరు
గ్రామాలకు రవాణా సులభతరం
నియోజకవర్గ అభివృద్ధికి సోపానం
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆర్‌వోబీ (రైల్వే ఓవర్‌బ్రిడ్జి), ఆర్‌యూబీ (రైల్వే అండర్‌బ్రిడ్జి)ల నిర్మాణానికి రైల్వే అధికారులు అనుమతించారు. బ్రిడ్జిలు నిర్మించాల్సిన ప్రాంతాలపై ఉన్నతాధికారుల బృందం నివేదికలు తయారు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారుల చర్చించి అనుమతి మంజూరు చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ రైల్వే అధికారులను సమన్వయం చేసి బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి సాధించారు.
తాడేపల్లిగూడెం, జూలై 20(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2 ఆర్‌వోబీలు, 2 ఆర్‌యూ బీల నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పట్టణంలో 2 ఆర్‌వోబీలు ఉండగా ఆర్‌యూ బీలు లేవు. నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు ప్రాజె క్టులకు అనుమతి లభించడంతో ప్రజలు, వ్యాపార వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాడేపల్లిగూడెం పట్టణం రావాలంటే వాహనదారులు ఇబ్బందులు పడేవారు. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను నియంత్రణపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి మార్గ సుగమైంది. నిర్మాణానికి నిధులు పూర్తిగా రైల్వే శాఖ కేటాయించనుంది. ఆర్‌అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేయనున్నారు.
ఆర్‌వోబీల నిర్మాణం ఇక్కడ
మండలంలోని నవాబ్‌పాలెం వద్ద ఒక ఆర్‌వోబీ, ఆరుళ్ల నుంచి జగన్నాధపురం రోడ్డులో మరో ఆర్‌వోబీ నిర్మాణం చేపట్టనున్నారు. దీనితో తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలకు ప్రయాణం సులభతరం కానుం ది. నవాబ్‌పాలెం వద్ద రైల్వేగేట్ వేస్తే వందల సంఖ్యలో లారీలు, మోటారు సైకిళ్లు నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతాల నుంచే ఎర్ర కంకర జిల్లా వ్యాప్తంగా రవాణా అవుతోంది. గేట్ వేసిన ప్రతిసారి వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎంతో కాలంగా ఈ ప్రాంత వాసులు ఆర్‌వోబీ ఏర్పాటు చేయాలని మొరపెట్టుకున్నారు. ఆరుళ్ల నుంచి జగన్నాధపురం రోడ్డులో మరో ఆర్‌వోబీ నిర్మించనున్నారు. దీనితో నిడదవోలు, తణుకు మండ లాల నుంచి తాడేపల్లిగూడెం మండలంతో పాటు నల్లజర్ల, దేవరపల్లి మండలాలకు వెళ్లేవారి ప్రయాణం సులభతవరం అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు.
ఆర్‌యూబీలు ఇక్కడ
పట్టణంలోని జువ్వలపాలెం ఫుట్‌పాత్ బ్రిడ్జి పక్కగా కుంచనపల్లి మార్గంలో ఆర్‌యూబీ నిర్మాణానికి రైల్వే అధికారులు ప్రతిపాదించారు. నిత్య రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఆర్‌యూబీ నిర్మాణంతో అభివృద్ధి పథంలో సాగనుంది. ఇక్కడ అసలు ఆర్‌వోబీ ఏర్పాటు చేయా లని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పట్టుబట్టారు. ఆర్‌వో బీ నిర్మాణంతో వాహనాలు పట్టణానికి రాకుండా కుంచనపల్లి మీదుగా హైవేకి మార్గం కల్పించాలని ఆయన ప్రతిపాదించారు. వాహనాల తాకిడి, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్‌వోబీ నిర్మాణం చేపడతారు. కాలువ కూడా రైల్వే ట్రాక్‌కు దగ్గరగా ఉండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌వోబీకి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆర్‌యూబీ నిర్మా ణానికి రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇక మరో ఆర్‌యూబీ మారంపల్లిలో నిర్మించనున్నారు. మారం పల్లి నుంచి పొలాల్లోకి వెళ్లే మార్గంలో ఆర్‌యూబీ ఏర్పాటు చేస్తున్నారు. దీనితో ఆరుళ్ల, మారంపల్లి, జగన్నాథపురం, నందమూరు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
రియల్ జోష్
ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణాలకు అనుమతి లభించడంతో రియల్ ఎస్టేట్ మంచి ఊపు అందు కుంది. ప్లాట్లు, పొలాల ధరలకు రెక్కలొచ్చాయి. విక్రయానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు, పొలాల సమా చారం సేకరించి కొంత మంది రియల్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రధానంగా జువ్వలపాలెం, కుం చనపల్లి మధ్య ఇటీవలి ప్లాట్లు జోరుగా అమ్ముడు పోతున్నాయి. జువ్వలపాలెం నుంచి కుంచనపల్లి మీదుగా హైవేకు 60 అడుగుల రోడ్డు ప్లాన్‌లో ఉండడంతో దీన్ని మరింత విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే చుట్టుపక్కల పొలాలకు, ప్లాట్లకు మరింత డిమాండ్ పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. మరిన్ని లేఅవుట్లు ఏర్పాటుకు రియల్టర్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలో యాగర్లపల్లి నుంచి హౌసింగ్‌బోర్డుకు బ్రిడ్జి, రోడ్లు నిర్మాణంతో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పట్ట ణానికి చేరువలో ఉన్న జువ్వలపాలెం వద్ద ఆర్ యూబీ నిర్మాణంతో ధరలు అమాంతం పెరుగు తాయని రియల్టర్లు ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గం మరింత అభివృద్ధి
ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణంతో నియోజకవర్గం మరింత అభివృద్థిపథంలో నడుస్తుంది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సహకారం మరువలేనిది. ఆయన కృషితో రైల్వే బ్రిడ్జిల ఏర్పాటు సాధ్యమైంది. అన్ని రంగాల్లో ముందున్న తాడేపల్లిగూడెం ప్రాంతానికి ఈ బ్రిడ్జిలతో రావడంతో భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధ్యం.
బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
రైల్వే శాఖ స్పందన బాగుంది
నియోజకవర్గ పరిధిలో నాలుగు ప్రాజెక్టులు ఇవ్వడం శుభపరిణామం. తాడేపల్లిగూడెం పట్టణం విస్తరిస్తున్న దృష్ట్యా ఇలాంటి నిర్మాణాల ఆవశ్యకత ఎంతో ఉంది. రైల్వే స్టేషన్‌ను మరింత విస్తరించే దిశగా రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిరంతం శ్రమిస్తున్నారు.
రవి అగర్వాల్, జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు
Updated Date - Jul 21 , 2025 | 12:32 AM