చిన వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN, Publish Date - May 01 , 2025 | 12:03 AM
అక్షయ తృతీయ పర్వదినం కావడంతో చిన్న వెంకన్న క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయ పర్వదినం కావడంతో చిన్న వెంకన్న క్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. మంచిరోజు స్వామిని దర్శిస్తే అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో పలువురు భక్తులు ఆలయానికి వచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తుల తో కళకళలాడాయి. దర్శనానంతరం యాత్రికులు శ్రీవారి తీర్దప్రసాదాలను, ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దాదాపు 96 జంటలు స్వామివారి నిత్య ఆర్జిత కల్యాణంలో పాల్గొన్నారు.
వైశాఖం.. పెళ్లి భజంత్రీల మోత
వైశాఖ మాస ప్రారంభంలో మంచి ముహూర్తం కావడంతో బుధవారం క్షేత్రంలో జోరుగా వివాహాలు జరిగాయి. మంచి ముహూ ర్తం, అక్షయ తృతీయ కలిసి రావడంతో పలు వివాహాలకు శ్రీవారి క్షేత్రం వేదికైంది. ఈక్రమంలో ఆలయ అనివేటి మండప ప్రాంతంలోను, అలాగే పాత కల్యాణమండప ప్రాంతం, ప్రైవేటు కల్యాణమండపాల్లో వివాహాలు జరిపారు. ఉదయం 7.23, 10.15, రాత్రి 7.45, 10.59 గంటలకు పలు జంటలు మాంగల్యబంధంతో ఒక్కటయ్యారు. వివాహం ఘట్టం అనంతరం నూతన వధూవరులు, వారి బంధువులు, పెళ్లిజనాలు ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు.
Updated Date - May 01 , 2025 | 12:03 AM