ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?
ABN, Publish Date - May 25 , 2025 | 12:18 AM
నరసా పురం పురపాలక సంఘంలో ఇప్పటికే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టింగ్ ఇచ్చినా.. ఎవరూ వచ్చేందుకు మక్కువ చూపడం లేదు.
నరసాపురం మునిసిపాలిటీలో బదిలీలకు పలువురు ఉద్యోగుల ప్రయత్నాలు
ఇంజనీరింగ్ సెక్షన్‌లోనే అత్యధికం.. ఇక్కడ పనిచేసేందుకు అనాసక్తి
నరసాపురం, మే 24(ఆంధ్రజ్యోతి):నరసా పురం పురపాలక సంఘంలో ఇప్పటికే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టింగ్ ఇచ్చినా.. ఎవరూ వచ్చేందుకు మక్కువ చూపడం లేదు. దీంతో అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. తాజాగా బదిలీలకు ప్రభుత్వం గేట్లు తెరవడం తో చాలా మంది ఉద్యోగులు మరో పురపాలక సంఘంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిలో గత ఏడాది బదిలీలపై వచ్చిన వారే ఉన్నారు. ఎక్కువ ఇంజనీర్ సెక్షన్‌లో పని చేసే సిబ్బందే ఉన్నారు. పురపాలకలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓ అధికారి పనితీరు, రాజకీయ ఒత్తిళ్లు, విజిలెన్స్ విచారణ జరుగుతుండటంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. వచ్చే ఏడా ది పుష్కరాల పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడే విజిలెన్స్ విచారణలు మొదలైతే రాను న్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో చాలామంది పక్క పురపాలకంవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు అక్కడ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకు న్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో..
పర్యావరణ శాఖ ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన మణి భీమవరం వెళ్లిపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్ పోస్టు లేదు. గత ఏడాది బదిలీపై ఇద్దరు ఏఈలు వచ్చారు. ఒక ఏఈ సతీమణి రాజమండ్రిలో పనిచేస్తున్నారు. దీంతో ఆయన సమీపంలోని నిడదవోలుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏఈ భీమవరం, లేదా తాడేపల్లిగూడెం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ఏఈకి అక్కడ ప్రజా ప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఈ కూడా ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య నిమిత్తం దీర్ఘకాలక సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరు ముగ్గురు బదిలీలపై వెళ్లిపోతే ఈ పురపాలక సంఘానికి ఎవరూ రారన్న వాదనలు ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే వీరిని ఇక్కడే ఉండాలని కొందరు ప్రజా ప్రతినిధులు కొరినప్పటికీ ఆసక్తి చూపించడం లేదు. బదిలీ కౌన్సెలింగ్ పూర్తయితే ఎంత మంది మిగులుతారన్నది సస్పెన్స్‌గా మారింది.
Updated Date - May 25 , 2025 | 12:18 AM