నిధుల్లేవ్!
ABN, Publish Date - Aug 03 , 2025 | 11:54 PM
ప్రపంచ వ్యాప్తంగా ఆది వాసీలు జరుపుకునే ఏకైక పండుగ ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’. అయితే ఈ ఏడాది కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో ఈ వేడుక జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు ఆదివాసీలందరిలో నెలకొన్నా యి.
ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై నీలినీడలు
చేతులెత్తేస్తున్న ఐటీడీఏ అధికారులు
నిర్వహించాల్సిందేనంటూ ఆదివాసీ సంఘాల పట్టు
బుట్టాయగూడెం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ఆది వాసీలు జరుపుకునే ఏకైక పండుగ ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’. అయితే ఈ ఏడాది కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో ఈ వేడుక జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు ఆదివాసీలందరిలో నెలకొన్నా యి. పండుగను ఘనంగా నిర్వహించా లని ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పట్టుపడుతుండగా అందుకు తగ్గ నిధులు లేవంటూ అధికారులు చేతులేత్తేస్తున్నారు. ఏటా ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు జరుపుకుంటారు. గతంలో ఈ పండు గను ఆదివాసీలంతా ఏకమై నిధులు సమీకరించి ఘనంగా చేసుకునే వారు. 2014 నుంచి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పండుగను అధికారంగా జరపడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలే పండుగను అధికారంగా నిర్వహిస్తున్నాయి. ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు పండుగ నిర్వహణకు ఏటా ఎంత ఖర్చు అవుతుందో గిరిజన ప్రజా ప్రతినిధులకు, నాయకులకు అధికారులు చెప్పలేదు. ఈ ఏడాదే ఖర్చుల విషయాన్ని ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
రూ.ఏడు లక్షల బకాయిలు పెండింగ్
ఇప్పటికే కేఆర్‌పురం ఐటీడీఏలో పీవో కె.రాములు నాయక్ అధ్యక్షతన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాసులు ఏజెన్సీలోని అన్ని ఆదివాసీ సంఘాల నాయకులతో రెండు పర్యాయాలు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పీవో మాట్లాడుతూ గతేడాది పండుగ నిర్వహణకు రూ.13 లక్షలు ఖర్చు అయినట్టు ప్రక టించడంతో ఆదివాసీ నేతలంతా ఆశ్చర్యపోయారు. రూ.13 లక్షలు ఖర్చు చేస్తే రూ.ఆరు లక్షలు మాత్రమే అందాయని ఇంకా రూ.ఏడు లక్షలు నిధులు రావాల్సి ఉందని, ఈ నేపథ్యలో ఈ ఏడాది పండుగను ఎలా చేయాలో అర్థం కావడం లేదని పీవో నాయకులకు చెప్పారు. అంత మొత్తంలో దేనికి ఖర్చు చేశారని సంఘాల నేతలు మొడియం శ్రీనివాసరావు, కాకి మధు, చోడెం రాజు, కుర్సం దుర్గారావు, సోదెం ముక్కయ్య మరికొందరు అధికారులను ప్రశ్నించారు. వేడుకలు నిర్వహిం చిన ఏడాది తర్వాత బకాయిలు రావాల్సి ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాగా ఖర్చుల విషయంలో అధైర్య పడవద్దని పండుగను ఘనంగా జరపాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులకు స్పష్టం చేశారు. గతంలోను పండుగ నిర్వహణకు ఎమ్మెల్యే రూ.లక్ష, ట్రైకార్ చైర్మన్ రూ.50 వేలను ఇచ్చారు. పండుగ జరపడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిధులు విడుదలైతే ఘనంగా పండుగను చేయడానికి, నిధులు రాకుంటే ఎలా జరిపించాలన్న విషయమై అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఆదివాసీ సంఘాలు, నాయకులు మాత్రం పండుగను ఘనంగా జరపాలని అవసరమైతే అన్ని శాఖల్లో టీఎస్‌పీ (ట్రైబల్ సబ్ ప్లాన్) నిధులను సమీకరించి జరపాలని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది వేడుకల నిర్వహణకు రూ. 13 లక్షల ఖర్చుపై జిల్లా అధికారులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
Updated Date - Aug 03 , 2025 | 11:54 PM