పల్లె పండుగ.. బిల్లులెక్కడ?
ABN, Publish Date - May 05 , 2025 | 12:32 AM
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, రైతులకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారం వారం బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, శరవేగంగా పనులు చేపట్టారు. పనులు చేసి నెలలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు.
పనుల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం
నెలలు గడుస్తున్నా అందని సొమ్ములు
కాంట్రాక్టర్లు లబోదిబో.. కొన్నిచోట్ల ఆగిన పనులు
ఏలూరు రూరల్, మే 4 (ఆంధ్రజ్యోతి) : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, రైతులకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారం వారం బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, శరవేగంగా పనులు చేపట్టారు. పనులు చేసి నెలలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొన్ని పనులు బిల్లులు కాక ముందుకు సాగడం లేదు. ప్రతీ శుక్రవారం బిల్లులు అవుతాయని చెప్పినా వారాలు మారుతున్నా యే గాని బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పంచాయతీలకు ప్రభుత్వం గతేడాది అక్టోబరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టేందుకు మొత్తం 38 పనులకు సుమారు రూ.4 కోట్లు నిధులను ఉపాధి పథకంలో కింద మంజూరు చేసింది. నవంబరులో వేసిన రోడ్లకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. పనులు చేసిన వారు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. తాము పనులు చేసిన వెంటనే క్వాలిటీ అధికారులు బృందం వచ్చి తనిఖీలు చేసిందని, అయినా బిల్లులు రావడం వాపోతున్నారు.
పాడి రైతులకు 17 గోకులం షెడ్లు మంజూరు కాగా, కొందరు రైతులు పెట్టుబడులు పెట్టి పూర్తిశాతం పనులు చేశారు. వాటికి ఇంతవరకు బిల్లులు రాలేదు. ప్రధానంగా జిల్లాలో 212.75 కిలోమీటర్ల మేర 990 సీసీ రోడ్లు పనులు చేపట్టారు. రూ.29 లక్షలతో మూడు చోట్ల కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు, పశువులు, గొర్రెలు, మేకల షెడ్లకు సంబంధించి 842 పనులను చేపట్టారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో చాలా గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. జిల్లాలో పల్లె పండుగ పనులకు ప్రభుత్వం సుమారు రూ.120 కోట్లు కేటాయించింది. ఇంకా కాంట్రాక్టర్లకు సుమారు రూ.60 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉండడం తో పనులు ముందుకు సాగడం లేదు. బకాయిలు చెల్లిస్తే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
Updated Date - May 05 , 2025 | 12:32 AM