ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధానికి మేము సైతం

ABN, Publish Date - May 08 , 2025 | 12:34 AM

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌పై ప్రతీకారం కోసం భారతావనిలో ప్రతీ పౌరుడి రక్తం మరుగుతోంది.

ఏలూరులో మాక్‌ డ్రిల్‌

ముందుకొస్తామంటున్న మిలటరీ మాధవరం మాజీ సైనికులు

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌పై ప్రతీకారం కోసం భారతావనిలో ప్రతీ పౌరుడి రక్తం మరుగుతోంది. మంగళవారం రాత్రి భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌ ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడిచేసి ముష్కరులను మట్టుపెట్టిన ఘటన అందరి మన్ననలు అందుకుంది. భారత రక్షణలో నిత్యం పునీతమయ్యే మిలటరీ మాధవరంలో మాజీ సైనికులు పాక్‌పై యుద్ధం కోసం తహతహలా డుతున్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశంపై దొంగ దెబ్బ తీస్తూ పైశాచికానందం పొందుతున్న శత్రుదేశంపై యుద్ధానికి తాము సైతం అంటున్నారు. పహల్గామ్‌ దాడితో భారత్‌పై ఆధిపత్యం చెలాయించామని అనుకునేలోపే మనదేశం ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపుదాడి చేసిందని, భారత సైన్య పరాక్రమాలు గతంలో తాము చేసినప్పటి కంటే మెరుగ్గా ఉన్నాయని పాక్‌పై యుద్ధమే సరైన చర్య అని మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. యుద్ధం వస్తే ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తుగా నిర్వహించే మాక్‌ డ్రిల్‌లో ప్రభుత్వం ఆదేశిస్తే భాగస్వాముల వుతామని, మిలటరీ మాధవరంలోని కొంతమంది మాజీ సైనికోద్యోగులు తమ అభిప్రాయాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.

యుద్ధమే సరైన నిర్ణయం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై యుద్దమే సరైన నిర్ణయం. అదేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. త్రివిధ వర్గాల సైనికాధికారులతో సమాలోచనలు నిర్వహించిన ప్రభుత్వ చర్యలు బాగున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌కు మనదెబ్బ ఏంటో చూపించారు. నేను ఇండియన్‌ ఆర్మీలో చేసినప్పుడు శ్రీలంక ఆర్మీలో పనిచేశా. ఆ సమయంలో మిలిటెంట్స్‌తో పోరాడాం. అదేవిధంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదిని పట్టుకోవడం నా సర్వీస్‌లో చెప్పుకోదగ్గ ఘట్టం. దానికి భారత ప్రభుత్వం కమాండ్‌ కార్డు అదించారు. దానిలో భాగంగానే హానర్‌ కెప్టెన్‌ హోదా కల్పించారు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతోపాటు సైనికులను అప్రమత్తం చేయడం, శత్రుదేశాన్ని డిఫెన్స్‌లో పడేయడం మన ప్రభుత్వ విధానాలకు నిదర్శనం.

– బొల్లం వీరయ్య, విశ్రాంత హానర్‌ కెప్టెన్‌, మాధవరం

పర్యాటక రంగాన్ని దెబ్బ తీయాలనే దాడి

మన దేశం మొదటి నుంచి సంయమనంతోనే ముందుకు వెళ్తోంది. గతంలో ప్రభుత్వం చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ మన బలాన్ని శత్రుదేశానికి రుచి చూపించినా పాక్‌ మన దేశంపై దాడి చేయాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే అక్కసుతోనే పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. గతనెల 22న జరిగిన ఘటనకు దేశం సంయమనం పాటించి మంగళవారం రాత్రి పాక్‌ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముష్కరుల స్థావరాలపై మిసైల్స్‌తో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్రవాదులను దాడి చేయడం యావత్‌ భారతీయులను తలెత్తుకునే విధంగా చేసింది.

– ప్రత్తి రామకృష్ణ, రిటైర్డ్‌ సుబేదార్‌ మేజర్‌

నేటి సైనిక శక్తి అద్భుతం

నేను భారత సైన్యంలో పనిచేశానని చెప్పుకోవడానికే గర్వపడుతున్నా. అప్పటి సైనిక శక్తికి.. నేటి సైనిక శక్తికి చాలాతేడా ఉంది. మేం ఆర్మీలో చేసినప్పుడు పాక్‌పై దాడిచేయాలంటే మన భూభాగం దాటి ముందుకు వెళ్లి దాడి చేయాల్సిన పరిస్థితి. లేదంటే మన భూభాగంలోకి వచ్చిన వారిని హతమార్చే వ్యూహం ఉండేది. కానీ ప్రస్తుతం మన దేశం చేపట్టిన దాడులు మన సైనిక బలానికి నిదర్శనం. మన దేశం నుంచే పాక్‌ ఉగ్ర స్థావరాలు గుర్తించి వాటిని మట్టుబెట్టడం అద్భుతం

– కలగాని ప్రభాకర్‌, రిటైర్డ్‌ హవల్దార్‌, తాడేపల్లిగూడెం

దేశ రక్షణకు ముందుంటాం

నేను ఆర్మీలో రాష్ట్ర రైఫిల్స్‌లో కీలకంగా పనిచేశా. అస్సాం గూర్కా రైఫిల్స్‌లో మిలిటెంట్స్‌పై చేసిన యుద్ధంలో వారిపై ఆదిపత్యం సాధించి మెడల్‌ సాధించడం నా కెరీలో అది ఒక తీపి గుర్తు. ప్రస్తుతం పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి ఆపరేషన్‌ సింధూర్‌ ఒక గుణపాఠం. యుద్ధం అనివార్యమైతే మా వంతు దేశ రక్షణకు ముందుంటాం.

– దిరుసుమిల్లి అయ్యప్పవిశ్రాంత హవల్దార్‌ మాఽధవరం

ఏలూరులో మాక్‌ డ్రిల్‌

యుద్ధ వాతావరణాన్ని చూపించిన పోలీసులు

ఏలూరు క్రైం/భీమవరం క్రైం : సైరన్‌ మోగుతూ వాహనాలు రయ్‌ రయ్‌మని వెళ్లిపోయాయి. రోడ్లుపై ఉన్న వారు ఎక్కడివారక్కడ నిశబ్దం అయిపోయారు. తమ వాహనాలను ఇంజన్‌ ఆఫ్‌చేసి వెంటనే దిగారు. మరో సైరన్‌ రాగానే కిందకూర్చుని చెవులు మూసుకుని నెమ్మదిగా పాకుంటూ సమీపంలోని షాపుల్లోకి వెళ్లిపోయారు. అంతలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. క్షతగాత్రులు కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసు వాహనాలు అక్కడికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఏమై నా బాంబులు ఉన్నాయే మోనని అనుమానంతో రాక్సీ అనే పోలీస్‌ జాగిలా న్ని రంగంలోకి తనిఖీలు చేశారు. ఈవిధంగా ఏలూరు నగరలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. మరోవైపు భీమవరంలో ఆపరేషన్‌ సిందూర్‌ అలర్ట్‌ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలో బాంబు స్క్వాడ్‌ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

తీరంలో పటిష్ఠ రక్షణ చర్యలు : ఐజీ అశోక్‌ కుమార్‌

ఏలూరు క్రైం, మే 7 (ఆంధ్రజ్యోతి) : భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ముందస్తుగా రక్షణ చర్యలు చేపడుతున్నామని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఏలూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పహల్గామ్‌ దాడి, ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో ఏలూరు రేంజ్‌ పరిధిలోని నాలుగు జిల్లాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయని ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు. మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పోస్టుగార్డులు సమన్వయంతో సముద్రంపై గస్తీ నిర్వహించడంతో పాటు ఎవరైనా కొత్త వ్యక్తులు, కొత్త వస్తువులు కాని, పడవలు, ఓడలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు సూచించామని, వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. ఓఎన్‌జీసీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనడానికి పోలీసు బలగాలను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చట్టవిరుద్దమైన, అభ్యంతరకరమైన పోస్టులను సోషల్‌ మీడియాలో పెడితే సంబంధిత వ్యక్తితో పాటు గ్రూపు అడ్మిన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. యుద్దం జరిగితే ప్రజలు ఏ రకంగా రక్షణ చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు అన్ని జిల్లాల్లోని పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తారన్నారు.

సైబర్‌ నేరాల్లో సత్వర దర్యాప్తు..

సైబర్‌ నేరాల్లో ఎలాంటి జాప్యం లేకుండా వారం రోజుల్లోనే కేసు పురోగతిని సాధించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఉదయం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన కేసులను గుర్తించి స్పీడ్‌ ట్రయల్‌ ద్వారా బాధితులకు న్యాయం, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, క్రికెట్‌ బెట్టింగులపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో 22 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు జిల్లాలో ఐదు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, జంగారెడ్డిగూడెంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, త్రి టౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్‌ఐలు రాంబాబు, పలువురు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:40 AM