మడపై ఫోకస్
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:24 AM
ర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మడ అడవుల్లోనూ ఫిషింగ్ క్యాట్‌లు వున్నట్టు వన్యప్రాణి పరిరక్షణ సంస్థలు గుర్తించాయి.
రెవెన్యూ శాఖ నుంచి అటవీ శాఖకు బదిలీ.. అధికారుల కసరత్తు..
జీవ వైవిధ్యానికి కేంద్రం పెద్ద పీట
ఫిషింగ్ క్యాట్, పక్షులు వంటి జీవులకు ఆలవాలం
నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మడ అడవుల్లోనూ ఫిషింగ్ క్యాట్‌లు వున్నట్టు వన్యప్రాణి పరిరక్షణ సంస్థలు గుర్తించాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అఽధికారులపై ఉంది. అటవీ శాఖకు మడ అడవులు అప్పగిస్తే అక్కడ వృక్ష సంపద, జీవ వైవిధ్యం, విస్తీర్ణం పెంపు వంటి అంశాలతో డాక్యుమెంట్‌ను రూపొందించే అవకాశం ఉంటుంది. కాకినాడ జిల్లా కోరంగి వద్ద ఎప్పటికప్పుడు డాక్యుమెంట్‌లను తయారు చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో జిల్లా అధికారులు అడుగులు వేస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో విస్తరించి ఉన్న మడ అడవుల సంరక్షణ బాధ్యతను అటవీ శాఖకు అప్పగిం చనున్నారు. ప్రస్తుతం వీటిని రెవెన్యూ శాఖ సంరక్షిస్తోంది. నరసాపురం, మొగల్తూరు మండలాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ అడవులు విస్తరించాయి. జిల్లాలో అడవులు లేనప్పటికి భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆ శాఖను ఏర్పాటు చేశారు. ఇటీవల నర్సరీలను పెంచే పనిని ఈ శాఖకు అప్పగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దాదాపు 4.50 లక్షల మొక్కలను అటవీ శాఖ పెంచింది. జిల్లా డ్వామా ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, పంచా యతీలు, ఇతర శాఖలకు మొక్కలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది 11 లక్షల మొక్కలను పెంచేలా డ్వామా కసరత్తు చేస్తోంది. అందు లోనూ ప్రత్యేకంగా అటవీ శాఖకు కొన్ని మొక్కలను పెంచే బాధ్యతను అప్పగించను న్నారు. అంతవరకే జిల్లా అటవీ శాఖ పరిమిత మవుతోంది. జిల్లా అటవీ అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. సముద్ర తాబేళ్ల హ్యాచరీని మొదటిసారిగా చేపట్టారు. మొగల్తూరు మండలంలో గత ఏడాది 15 వేల సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి హ్యాచరీల్లో పెట్టారు. అవి పిల్లలైన తర్వాత సముద్రంలో విడిచి పెట్టారు. ఈ ఏడాది కూడా హ్యాచరీ నిర్వహించేందుకు
ప్రణాళిక చేస్తున్నారు. వీటితోపాటు మడ అడవులను సంరక్షించే బాధ్యతను అప్పగించాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదించారు. దీనిపై ఆ శాఖ సానుకూలంగా ఉంది.
సహజ సిద్ధమైన అడవులు
జిల్లాలో సహజ సిద్ధంగానే మడ అడవులు పెరుగుతున్నాయి. సముద్రం అటుపోట్లకు వేళ్లతో కూడిన మొక్కలు కాలువల్లోకి విస్తరిస్తున్నాయి. ప్రధానంగా సముద్రపాయల్లో ఇవి పెరుగుతుంటాయి. దాదాపు ఐదు రకాల వృక్షాలు మడ అడవుల్లో కనిపిస్తుంటాయి. పువ్వులు పూస్తాయి. అక్కడే మొలకెత్తి వేరు వరకు పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉంటుంది. కొద్దిపాటి వేరు పెరిగిన తర్వాత పువ్వు తొడిమ నుంచి మొక్క వేరుపడి కింద పడిపోతుంది. నేలను తాకి చెట్టుగా ఎదుగుతుంది. ఒక్కోసారి ఆటు పోట్లకు వేరేచోటకు వేళ్లతో కూడిన మొక్క పయనిస్తుంది. అక్కడ ఏపుగా పెరుగుతుంది. జిల్లాలో ఇటువంటి సహజ సిద్ధంగా పెరిగే స్వభావం వున్న మడ అడవులు వున్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు నరసాపురం మండలంలోని మడ అడవులను వీక్షించారు. వీటిని సంరక్షించి పెంపుదల చేయాలనే ఆలోచనతో అధికారులు ముందడుగు వేస్తున్నారు.
మడ అడవుల్లో వివిధ రకాల జీవరాశులు మనుగడ సాగిస్తుం టాయి. చేపలు వేటాడే పిల్లి (ఫిషింగ్ క్యాట్) అందులో ప్రధానమైంది. మడ అడవుల్లోని చెట్లపైనే ఇవి జీవనం సాగిస్తాయి. జనావాసాల్లో ఉండే పిల్లులు కంటే పెద్దవిగా ఉంటాయి. చిరుతల తరహా పెద్ద ఆకారంలోనే ఉంటా యి. పెద్ద పిల్లుల మాదిరి ఉండి చేపల వేట సాగించి పొట్ట నింపుకుంటాయి. సముద్ర తీరంలో ఉండే మడ అడవులే వీటి ఆవాసం. అంతరించిపోతున్న వీటిని సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మడ అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని మడ అడవుల్లో మాంగ్రూవ్స్ కోబ్రా, పీతలు, నత్తలు, బురద చేపలు, పక్షులు నివసిస్తున్నాయి. ఇలాంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షిం చాలంటే మడ అడవులను సంరక్షించుకోవాలి. ఆ బాధ్యతను అటవీ శాఖకు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది.
మడ అడవులతో ప్రయోజనాలెన్నో..
మడ అడవులను పరిరక్షించుకుంటే ప్రయోజనాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. సముద్రంలోని మడ అడవుల్లో ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలు పెరుగుతాయి. పర్యావ రణానికి, జలచరాలకు జీవ స్థలాలు. సముద్రం కోతను అరికట్టడానికి ఇవి దోహదపడతాయి. మడల వద్ద సముద్రం ఆటు పోట్లు మెల్లగా ఉంటాయి. నిదానంగా సముద్రపు నీరు పైకి, లోపలకి వెళుతుంది. అక్కడ ఇసుక కంటే బురద ఉంటుంది. ఈ కారణంగా ఉప్పెన వచ్చినా మడ అడవులు రక్షణ కల్పిస్తాయి.
Updated Date - Jul 26 , 2025 | 12:24 AM