భూసేకరణలో రైతుల అభ్యంతరాలపై విచారణ
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:32 AM
జాతీయ రహదారి–165 నిర్మాణంలో పాలకోడేరు మండలం విస్సా కోడేరు, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై గురువారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.
అధికారులు, రైతులతో జేసీ సమావేశం
భీమవరం టౌన్, జూలై 17(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి–165 నిర్మాణంలో పాలకోడేరు మండలం విస్సా కోడేరు, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై గురువారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు. భూసేకరణపై గత నెల 14న అభ్యంతరాలు గడువు ముగియడంతో, పాలకోడేరు మండలం విస్సకోడేరు, పెన్నాడా అగ్రహారం, శృంగవృక్షం గ్రామ రైతులు లేవనెత్తిన ఆరు అభ్యంతరాలపై ఈరోజు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు అలైన్‌మెంట్, తమ భూమికి లభించే నష్టపరిహారం చెల్లింపు తదితర విషయాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలైన్‌మెంట్ మార్పు తమ పరిధిలోనిది కాదని జేసీ తెలిపారు. నష్టపరిహారం విషయంలో సర్వే నంబర్ ప్రకారం సమీప ప్రాంతాలలో గత మూడేళ్లుగా జరిగిన లావాదేవీలను చూసి సరాసరిన ప్రభుత్వ నిబం ధన ప్రకారం రైతులకు చెల్లించడం జరుగుతుందని జేసీ వివరించారు. తమ భూములను ప్రభుత్వానికి అప్పగించ డానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని కాకపోతే తాము నష్టపోకుండా హెచ్చు మొత్తంలో న్యాయమైన పరిహారం ఆశిస్తున్నామి. సాధ్యమైనంత త్వరగా పరిహారం సొమ్ము ఇప్పించాలని జాయింట్ కలెక్టరును రైతులు కోరారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..
అలైన్‌మెంట్ ఏ సర్వే నెంబర్ నుంచి వెళుతుందని రైతులు అడగడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అందజేస్తామని తెలిపారు. గొరగనమూడి గ్రామం నుంచి రైతులు అభ్యంతరాలు లేవనెత్తలేదు. విచారణలో ఎన్‌హెచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్ అండ్ బి ఎన్ శ్రీనివాసరావు, పాలకోడేరు తహసీల్దార్ ఎన్‌బి.విజయలక్ష్మి, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సీహెచ్. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 12:32 AM