ఆక్రమణలు.. అడ్డంకులు
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:57 PM
కొల్లేరు సరస్సు నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి సాఫీగా వెళ్లేందుకు అడ్డుగా ఆక్రమణలు, ఉప్పుటేరుపై రైల్వే వంతెన పెద్ద సమస్యగా మారాయి.
వంతెనల వద్ద పూడుకుపోయిన కానాలు
తూడు, గుర్రపుడెక్క, కిక్కిసతో సమస్య
దిగువకు నీటి ప్రవాహానికి అవరోధం
ప్రక్షాళన లేకపోతే తప్పని ముంపు
కొల్లేరు సరస్సు నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి సాఫీగా వెళ్లేందుకు అడ్డుగా ఆక్రమణలు, ఉప్పుటేరుపై రైల్వే వంతెన పెద్ద సమస్యగా మారాయి. వీటితో పాటు గుర్రపుడెక్క, తూడు, కిక్కిస నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. గతంలో 247 మీటర్ల వెడల్పున ఉన్న ఉప్పుటేరు ప్రస్తుతం 80 మీటర్లకు కుచించుకుపోవడంతో ముంపు సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం ఉప్పుటేరు ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, లేదంటే ఏటా వరదల బారిన పడక తప్పదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కైకలూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): కొల్లేరు సరస్సులో ఏటా వర్షాకాలం వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఈ నీరు సముద్రంలోకి వెళ్లేందుకు ఏకైక మార్గం ఉప్పు టేరు పరివాహాక ప్రాంతం. సుమారు 43 కిలోమీటర్ల పొడవున 80 మీటర్ల వెడల్పున ఉప్పుటేరు విస్తరించి ఉంది. ఉప్పుటేరు కొల్లేరు గర్భంలో ప్రారంభమై కైక లూరు, ఆకివీడు, కాళ్ళ, కలిదిండి, కృత్తివెన్ను, బంటు మిల్లి మండలాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అయితే ఉప్పుటేరుకు ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వరదలు వస్తే నెలల తరబడి గ్రామాలకు గ్రామాలే నీటిలో నానుతుంటాయి. ఆక్రమణలు తొలగించడంలో అధికారులు ఉదాసీనత వైఖరితో ముంపునకు గురవుతు న్నాయి. ఉమ్మడి కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాలోని రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు వంటి మేజర్ డ్రెయిన్లతో కలిపి 66 మేజర్, మైనర్ డ్రెయిన్లు, కాల్వల నుంచి వేల క్యూసెక్కుల నీరు కొల్లేరు సరస్సులోకి చేరుతుంది. గతంలో కొల్లేరు సరస్సులో 10 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుందని అఽధికారులు అంచ నా వేసేవారు. అప్పట్లో ఉప్పుటేరు 247 మీటర్ల వెడ ల్పున ఉండడంతో నీరు నేరుగా సముద్రంలోకి వెళ్లేది. రానురాను ఉప్పుటేరు ఇరువైపులా ఆక్రమణలకు గురై ప్రస్తుతం 80 మీటర్లకు కుచించుకుపోయింది. ఉప్పు టేరుకు ఇరువైపులా చేపల, రొయ్యల చెరువులను తవ్వకాలు చేసి ఆక్రమణలకు పాల్పడడంతో నీటి ప్రవాహానికి అవరోధంగా మారింది.
రైల్వే అధికారుల అవగాహన లోపం..
ఉప్పుటేరుపై రైల్వేడబ్లింగ్ నిర్మాణ పనుల్లో రెండో వంతెనను నూతనంగా నిర్మాణం చేశారు. రైల్వే అధికారుల అవగాహన లోపమో, నిర్లక్ష్యమో తెలి యదు గానీ అడ్డదిడ్డంగా ఉప్పుటేరు లో బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణంతో నీటి ప్రవాహానికి పెద్దముప్పే ఏర్పడింది. భారీ కాలమ్స్ నిర్మాణం చేశారు. ఒక్కొక్క కాలమ్ 10 మీటర్ల వెడ ల్పున 8 పిల్లర్లను నిర్మించారు. వీటి మధ్యన 10 గజాలు దూరం కూడా లేకపోవడంతో నీటి ప్రవాహానికి అవ రోధంగా మారింది. ఈ పిల్లర్ల వద్ద దట్టంగా గుర్రపు డెక్క, కిక్కిస, తూడు అలుముకోవడంతో వంతెన దిగువ భాగానికి నీరు ప్రవహించడం లేదు. దీంతో ఎగువన ఉన్న కొల్లేరు గ్రామాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నా యి. గతంలో ఉప్పుటేరుపై నిర్మాణం చేసిన రైల్వే వంతెనకు పిల్లర్‌కు పిల్లర్‌కు మధ్యన 30 గజాలు వెడల్పు ఉండడంతో నీరు కిందకి పారుదల అయ్యేది. నూతనంగా నిర్మాణం చేసిన వంతెనలో భారీ పైపులను రైల్వే అధికారులు వదిలివేశారు. వీటి వల్ల కూడా గుర్రపుడెక్క, తూడు కిందకి వెళ్లకుండా నీటిప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. వంతెన ఎగువ భాగాన ఉప్పుటేరు ను పూర్తిగా గుర్రపుడెక్క, కిక్కిస కమ్మేసింది.
పేరుకుపోయిన మట్టి, కిక్కిస
కైకలూరు–ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో పెద్ద, చిన్నఎడ్లగాడి వంతెనల వద్ద కొల్లేరు సరస్సులో వంతెన కానాల నుంచి సరస్సు దిగువకు నీరు పారుదల అవుతుంది. ఈ వంతెనల వద్ద 10 అడుగుల ఎత్తున ఖాళీగా ఉండేది. నీటి ప్రవాహంతో వంతెన దిగువ భాగాన దట్టంగా మట్టి చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రస్తుతం మూడు నుంచి నాలుగు అడుగులు ఖాళీ మాత్రమే ఉంది. దీంతో నీరు దిగువకు పారుదల అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. చిన్నఎడ్లగాడి వంతెనకు దిగువ భాగాన కిక్కిసకర్ర దట్టంగా అలుముకు పోయింది. పెద్దఎడ్లగాడి వంతెన ఎగువ భాగాన గుర్రపు డెక్క, తూడు దట్టంగా పేరుకుపోయింది. కొల్లేరుకు వరద వస్తే ఎగువన ఉన్న మండవల్లి మండలంలోని పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, మణుగులూరు తదితర గ్రామాలకు ముంపునకు గురవుతాయి.
విజయవాడకు ముంపే..
ఉప్పుటేరు ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించకపోతే ఏటా బుడమేరు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అవరోధం కలుగుతుంది. దీంతో ఎగువన ఉన్న విజయ వాడతో పాటు పలు గ్రామాలు సైతం జలదిగ్బంధానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో విజయవాడ పరిసర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడిన సంగతి తెలిసిందే. బుడమేరుకు ప్రధాన మార్గమైన కొల్లేరు, ఉప్పుటేరు ఆక్రమణలను చెత్తాచెదారాలను తొలగించకపోతే మరలా విజయవాడ ముంపునకు గురయ్యే పరిస్థితులు పునరావృతం అవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
Updated Date - Jul 27 , 2025 | 11:57 PM