గ్రీన్ టాక్స్ తగ్గింపు
ABN, Publish Date - May 27 , 2025 | 12:22 AM
రవాణా రంగాన్ని దారుణంగా దెబ్బతీసిన గ్రీన్ ట్యాక్స్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రూ.15వేలు వంతున గ్రీన్ ట్యాక్స్ విధించడంతో వాహన యజమానులు నష్టాలను చవిచూశారు.
రవాణా రంగానికి ప్రభుత్వం ఊతం
పన్ను మొత్తం తగ్గిస్తూ మంత్రి మండలి ఆమోదం
జిల్లాలో 22 వేల వాహనదారులకు ఉపశమనం
ప్రభుత్వానికి రూ.18 కోట్లు ఆదాయం తగ్గుదల
రవాణా రంగాన్ని దారుణంగా దెబ్బతీసిన గ్రీన్ ట్యాక్స్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రూ.15వేలు వంతున గ్రీన్ ట్యాక్స్ విధించడంతో వాహన యజమానులు నష్టాలను చవిచూశారు. ఏటా రూ.15 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. వాస్తవానికి రవాణా వాహనాలకు ఏడేళ్ల నుంచి కాలపరిమితి దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం పన్ను మొత్తం భారీగా పెంచింది. రవాణా వాహనాల పన్నులో భాగంగా ట్రాక్టర్‌కు గ్రీన్ ట్యాక్స్ విధించారు. ట్రాక్టర్ ట్రక్కుకు కూడా పన్ను విధించడంతో ప్రభుత్వం నవ్వుల పాలైంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కాల పరిమితి దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధించడంలో గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించింది. ట్రాక్టర్‌తో పాటు ట్రక్కుకు కూడా పన్ను విధించారు. ఇంజన్ ఒక కాలపరిమితి దాటితే కాలుష్యం వెదజల్లుతుందని భావించినా వెనక ఉండే ట్రక్కుపై పన్ను విధించడంతో గత ప్రభుత్వం అభాసుపాలైంది. రవాణా వాహన యజమానులు, దానిపై పడ్డ ఆధారపడ్డ కార్మికుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఎన్నికల సమయంలో గ్రీన్ టాక్స్ తొలగిస్తామని తెలుగుదేశం పార్టీ, కూటమి నేతలు హామీ ఇచ్చారు. అంతకు ముందు ఉండే విధానాన్నే అమలులోకి తెచ్చేలా ఇటీవల మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
ప్రభుత్వానికి నష్టమైనా..
గ్రీన్ ట్యాక్స్ ద్వారా జిల్లాలో ఏటా రూ.18 కోట్లు ఆదాయం వచ్చేది. రవాణా వాహనాలకు ఏడేళ్ల కాలపరిమితి దాటితే గ్రీన్ ట్యాక్స్ అమలు చేస్తారు. గత ప్రభుత్వం ఒకేసారి రూ.15 వేలకు పెంచేసింది. ఆ మొత్తా న్ని కుదిస్తూ ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి మండలిలో ఆమోదం తెలపడంతో రూ.3 వేలకు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో 65 వేల రవాణా వాహనాలు ఉండగా 22 వేల వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వర్తిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహన యజమానులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఆదాయమే లక్ష్యంగా గత ప్రభుత్వం రవాణా శాఖలో అన్ని విధాల రుసుములను పెంచేశారు. ప్రతి రవాణా శాఖ అధికారికి నెలవా రీ లక్ష్యాలను ఇవ్వడం తప్ప రవాణా రంగ సమస్యలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కొక్కొటిగా నెరవేరుస్తున్నారు. తాజాగా గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై రవాణా వాహన యజమానుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
Updated Date - May 27 , 2025 | 12:22 AM