‘దారి’ చూపండి
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:33 AM
జిల్లాలో లోసరి నుంచి భీమవరం మీదుగా పిప్పర వరకు రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది.
లోసరి – పిప్పర రహదారికి పరిపాలన అనుమతి కోసం ఎదురుచూపు
కేంద్ర నిధులు రూ.100 కోట్లు కేటాయింపు
భీమవరం వద్ద రహదారి నాలుగు లైన్ల విస్తరణ
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్
జిల్లాలో లోసరి నుంచి భీమవరం మీదుగా పిప్పర వరకు రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేయకపోవడంతో పనులకు టెండర్లు పిలవలేదు. జిల్లా అధికారులు పంపిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి నిధులు కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతో రహదారులు అభివృద్ధి చేశారు. అప్పటి బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క బిల్లు పరిష్కరిస్తూ వస్తోంది. బకాయి భారం తర్వాత లోసరి–పిప్పర రహదారి అభివృద్ధి చేయనున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో లోసరి నుంచి భీమవరం మీదుగా పిప్పర వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషితో నిధులు మంజూరయ్యాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇతర పనులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లిస్తూ వస్తోంది. బకాయి భారం తగ్గిన తర్వాత లోసరి – పిప్పర రహదారి అభివృద్ధి పనులపై సారించనున్నట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
జిల్లా కేంద్రానికి మహర్దశ
రహదారి అభివృద్ధితో జిల్లా కేంద్రం భీమవరంలో రవాణా సౌకర్యం మెరుగవుతుంది. భీమవరం బైపాస్‌ను నాలుగు లైన్‌ల రహదారిగా అభివృద్ధి అవుతుంది. బీవీ.రాజు సర్కిల్ నుంచి విష్ణు ఇంజనీరింగ్ కళాశాల వరకు నాలుగు లైన్‌లను ఇప్పటికే విస్తరించారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాల నుంచి గరగపర్రు వరకు నాలుగు లైన్‌ల రహదారి విస్తరణకు నివేదిక సిద్ధం చేశారు. బీవీ.రాజు మార్గ్ నుంచి ఉండి వైపు బైపాస్ రహ దారిని నాలుగు లైన్‌లుగా నిర్మించనున్నారు. మరోవైపు భీమ వరం రూరల్ మండలం గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం కానుంది. భీమవరం పట్టణానికి సరైన రహదారిలేక రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు జాతీయ రహదారి, మరో వైపు బైపాస్ నాలుగు లైన్‌ల రహదారిగా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భీమవరం పట్టణానికి విశాలమైన రహదారులు ఏర్పడనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే రహదారుల విస్తరణ ఏకైక మార్గం. కేంద్రం కేటాయించిన రూ.100 కోట్లు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తే భీమవరం–తాడేపల్లిగూడెం మధ్య రాకపోకలు వేగవంతం కానున్నాయి.
Updated Date - Jul 22 , 2025 | 12:33 AM