అడవి ఆక్రందన!
ABN, Publish Date - May 14 , 2025 | 01:04 AM
దట్టమైన ఆకుపచ్చని తివాచీల పరుచుకున్న అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని చూస్తే ఒకప్పుడు ఆనందం వెల్లివిరిసేది. ఒకప్పటి వంద ఏళ్లనాటి వృక్షాలు పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల అడుగులు చప్పుడు వినిపించేది. స్వచ్ఛమైన గాలి వీచేది. కానీ ఇప్పుడు భయానకమైన పరిస్థి తులు ఎదురవుతున్నాయి.
వింజరం ఫారెస్ట్ బీట్‌లో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం నరికివేత
క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా స్క్వాడ్ డీఎఫ్‌వో
సర్వే జరుపుతున్నాం : ఎఫ్‌ఆర్వో
కుక్కునూరు, మే 13 (ఆంధ్రజ్యోతి) : దట్టమైన ఆకుపచ్చని తివాచీల పరుచుకున్న అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని చూస్తే ఒకప్పుడు ఆనందం వెల్లివిరిసేది. ఒకప్పటి వంద ఏళ్లనాటి వృక్షాలు పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల అడుగులు చప్పుడు వినిపించేది. స్వచ్ఛమైన గాలి వీచేది. కానీ ఇప్పుడు భయానకమైన పరిస్థి తులు ఎదురవుతున్నాయి. మను షుల అత్యాశ, స్వార్థం అడవి తల్లి గుండెను చీల్చుతోంది. వందలాది ఎకరాల్లో పచ్చని సంపద కళ్ల ముందే నాశనం అవుతోంది. వందల ఏళ్ల నాటి మహావృక్షాలు ఇప్పుడు మొండి దుంగలుగా మిగిలిపోతున్నాయి. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే అమరవరం అటవీరేంజ్ అడవి కేవలం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.
కుక్కునూరు మండలం అటవీ రేంజ్ పరిధిలో వింజరం బీట్‌లో ఎకరం కాదు రెండేకరాలు కాదు వందలాది ఎకరాల అడవిని యథేచ్ఛగా నరికేస్తున్నారు. అడవు లను కాపాడడానికి ఓ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఉన్నప్పటికి మమ్మల్ని అడిగేది ఎవరూ.. ఆపేదెవరు అనే ధైర్యంతో చెట్లు నరికివేస్తూ పోడు సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. ఆపై మంటపెట్టి ఆ చెట్లను కాల్చివేస్తున్నారు. వలస ఆదివాసీలతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో అడవి ధ్వంసమైంది. ఇప్పుడు స్థానిక గిరిజన, గిరిజనేతరుల చూపు అడవిపై పడింది. రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని కూడా అధికారులు కాపాడలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇంత భారీఎత్తున అడవులు విధ్వంసం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది అడ్డుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడవి అంతా నాశనం అయ్యాక అధికారులు వచ్చి విచారణ చేపడితే ఏం ప్రయోజనమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే సర్వేలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని వింజరం, భువనగిరి, అల్లిగూడెం తదితర ప్రాంతాల్లో అటవీప్రాంతాన్ని ఆక్రమించి నర్సరీలు ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకుంటేనే అటవీ విధ్వంసం ఆగుతుందన్న అభిప్రాయాన్ని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు.
వింజరంలో జరిగిన వందలాది ఎకరాల్లో అటవీ విధ్వంసంపై జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ క్రమంలో స్క్వాడ్ డీఎఫ్‌వో శ్రీనివాసరావు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిం చారు. కాగా వింజరం బీట్‌లో అడవుల నరికివేతపై అమరవరం అటవీరేంజ్ అధికారిణి సత్యపద్మజ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టామన్నారు. ఎన్ని ఎకరాల్లో అడవి నరికివేత జరిగిందో సర్వే చేసి తెలుసుకుంటామన్నారు. అడవి నరికిన వారిని, ఆ భూములు సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - May 14 , 2025 | 01:04 AM