సార్వా.. జోరు
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:46 AM
సార్వా సాగుకు అనుకూల వాతావరణం ఉంది. నారుమడులు వేయడంలో రైతన్నలు వేగం పెంచారు.
అనుకూలించిన వాతావరణం
నారుమడులు వేస్తున్న రైతన్న
జిల్లాలో 10 వేల ఎకరాల్లో నారుమడులు అంచనా
3500 ఎకరాల్లో పూర్తి
2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు
సార్వా సాగుకు అనుకూల వాతావరణం ఉంది. నారుమడులు వేయడంలో రైతన్నలు వేగం పెంచారు. ఏటా జూలైలో నారుమడులు వేసేవారు. గడిచిన పది రోజుల నుంచి నారుమడుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వర్షాలు ముందుగా పడడంతో సమయానికి నారుమడి వేయగలిగారు. అనుకూల వాతావరణంతో జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం పెరగనుంది.
భీమవరం రూరల్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు చేస్తారు. ప్రస్తుత అనుకూల వాతావరణంలో 2.15 లక్షలకు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగుకు 10 వేల ఎకరాల్లో నారుమడులు వేయాలి. ఇప్పటికే వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 3,500 ఎకరాల్లో నారుమడులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నారుమడులు ముమ్మరంగా వేయడంతో మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో నారుమడులు వేసేస్తారు. వచ్చే నెలాఖరుకు నాట్లు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
1318, స్వర్ణ సంపతి రకాలు
సార్వా సాగులో విత్తన ఎంపికలో రైతులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. తుఫాన్‌లను తట్టుకుని తెగుళ్లు తక్కువ వచ్చే సాగు రకాన్ని ఎంచుకున్నారు. 1318 రకాన్ని 50 శాతం, మిగిలిన విస్తీర్ణంలో స్వర్ణ సంపతి, స్వర్ణరకం సాగు చేస్తున్నారు.
సార్వా సాగులో జింక్ లోపం రాకుండా వ్యవసాయ శాఖ ముందస్తుగా చర్యలు తీసుకుంది. 2024, 2025లో నమూనాలు పరిశీలించి జింక్ లోపం ఉన్న భూమి రైతులకు జింక్ సల్ఫేట్ ఉచితంగా అందించడానికి చర్యలు చేపట్టారు.
Updated Date - Jun 25 , 2025 | 12:46 AM