టీడీఆర్ ట్విస్ట్
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:21 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన టీడీఆర్ బాండ్‌ల విలువను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
బాండ్ విలువ తగ్గించిన ప్రభుత్వం
అక్రమార్కులకు ఝలక్
గజం ధర రూ.20 వేల నుంచి రూ. 1100కు తగ్గింపు
నిబంధనల మేరకు నాలుగు రెట్ల విలువతో రూ.4400 బాండ్‌ల జారీ
గతంలో బాండ్‌ల విలువ రూ.800 కోట్లు
సవరణతో ప్రస్తుత విలువ రూ.43 కోట్లు
ఆన్‌లైన్‌లో బదిలీ చేసిన మునిసిపాలిటీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన టీడీఆర్ బాండ్‌ల విలువను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అక్రమ పద్ధతిలో అధిక విలువతో బాండ్‌లు పొందిన వారికి దిమ్మదిరిగే నిర్ణయం తీసుకుంది. తణుకు మునిసిపాలిటీ పరిధిలో గజం స్థలానికి రూ.20వేలు వంతున లెక్కకట్టి బాండ్‌లు జారీ చేయడం ద్వారా 18 ఎకరాల భూమిని సేకరించారు. కూటమి ప్రభుత్వం గజం ధర రూ.1100 నిర్ధారిస్తూ నాలుగు రెట్లు అధికంగా రూ.4400 ధరతో బాండ్ల విలువ నిర్ధారించింది. ఈ చర్యతో దళారుల కళ్లు బైర్లు కమ్మాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తణుకు మునిసిపాలిటీ పరిధిలో కంపోస్ట్ యార్డు విస్తర ణకు కొంత భూమి, మాస్టర్ ప్లాన్‌లో గ్రీన్ ఫీల్డ్ ఉందని ఇంకొంత భూమి, పేదల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలకు రహదారి అంటూ మరికొంత భూమిని సేకరించారు. దానికి టీడీఆర్ బాండ్‌లు జారీ చేశారు. పట్టణంలోని స్థలాలతో సమానంగా గజం విలువ రూ.20 వేల నుంచి రూ.22వేల వరకు నిర్ధారించారు. అందుకు నాలుగు రెట్లు అంటే 20 ఎకరాలకు దాదాపు రూ.800 కోట్లు విలువైన బాండ్‌లు జారీ చేసేశారు. పశ్చిమలో అతి పెద్ద కుంభకోణంగా విమర్శలు రావడంతో అప్పటి నామమాత్రపు చర్యలు తీసుకుంది. మొక్కుబడి దర్యాప్తులతో సరిపెట్టి టీడీఆర్ బాండ్‌లకు కార కులైన వారిని పట్టించుకోలేదు. బాండ్‌ల జారీలో కీలకమైన వైసీపీ నేతలను వెనకేసుకొచ్చింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వం సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు గత బాండ్‌లను రద్దు చేస్తూ వ్యవసా య భూములను ప్రామాణికంగా తీసుకుని బాండ్‌లు జారీ చేయాలని సూచించింది.
దళారులకు చెక్ పెట్టిన ప్రభుత్వం
టీడీఆర్ బాండ్‌లు పొందిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును దళారులు అవకాశంగా తీసుకున్నా రు. వ్యవసాయ భూమి ఆధారంగా బాండ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అది కూడా అనుకూలంగా మలచుకోవాలని దళారులు ప్రయత్నించారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో డోర్ నెంబర్, ఎల్‌పి నెంబర్ మార్చుకుని అధిక ధర ఉండేలా చూసుకున్నారు. గజం విలువ రూ.20వేలు ఉన్నట్లు లెక్కలు వేసి మునిసిపాలిటీకి సమర్పించే ప్రయత్నం చేశారు. అందుకు నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు జారీచేయించుకునేలా పావులు కదిపా రు. బాండ్‌లు గజాల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. దానిని అడ్డం పెట్టుకుని మళ్లీ లాబీయింగ్‌కు దళారులు ప్రయత్నం చేశారు. ఈ భాగోతాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీఆర్ బాండ్‌ల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తా వించడంతో ప్రభుత్వం, మునిసిపాలిటీ అప్రమత్తమైంది. కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కంపోస్ట్ యార్డు, గ్రీన్ ఫీల్డ్, కొత్త రహదారి కోసం ప్రభుత్వం సేకరించిన 18 ఎకరాల భూమి ధరను రూ.55 లక్షలుగా నిర్ధారించారు. గజం విలువ దాదాపు రూ.1100గా నిర్ణయించారు. అందుకు నాలుగు రెట్లు అంటే గజానికి రూ.4400 విలువైన బాండ్‌లు మాత్రమే ఇచ్చారు. బాండ్‌ల యజమానులతో సంబంధం లేకుండా గతంలో జారీ చేసిన వాటి ధరలను మార్చేశారు. ఇప్పుడు వాటి విలువ రూ.4400 కావడంతో దళారుల కళ్లు బైర్లుకమ్మాయి. బాండ్‌లు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పాత ధర మార్పు చేశారు. ఎవరికైనా బాండ్‌లు విక్రయించుకుంటే గజానికి రూ. 4400 మాత్రమే లెక్క చూపుతుంది. గతంలో అడ్డదారిలో అధిక ధరలకు మంజూ రైన బాండ్‌లపై కూటమి ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది.
Updated Date - Jun 07 , 2025 | 12:21 AM