బెట్టింగ్ భూతం
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:58 AM
క్రీడాభిమానులకు క్రికెట్ ఒక పండగ. వన్డే.. టెస్ట్ మ్యాచ్.. టీ20 ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ జరిగితే మైదానం హోరెత్తిపోతుంది. దేశవ్యాప్తంగా టీవీలు, సెల్‌ఫోన్లు మోతెక్కిపోతాయి.
సొమ్ము పోగొట్టుకుంటున్న యువత
అర చేతిలో బెట్టింగ్ యాప్‌లు
ఐపీఎల్‌కు ఊతమిస్తున్న దాబాలు
క్షణాల్లో చేతులు మారుతున్న లక్షలు
క్రీడాభిమానులకు క్రికెట్ ఒక పండగ. వన్డే.. టెస్ట్ మ్యాచ్.. టీ20 ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ జరిగితే మైదానం హోరెత్తిపోతుంది. దేశవ్యాప్తంగా టీవీలు, సెల్‌ఫోన్లు మోతెక్కిపోతాయి. మరోవైపు జాదం కమ్మేస్తుంది. కాసుల గలగల ఏమాత్రం వినిపించకుండా బెట్టింగ్ భూతం కుమ్మేస్తుంది. వేసవి ఎండకు మించి ఐపీఎల్ వేడి యువతకు సెగలు పుట్టిస్తోంది. బెట్టింగ్ యాప్‌లలో పందేలు కాసి జేబులు, వళ్లు గుల్ల చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు రోజుకు రూ.10 కోట్లు పైనే యాప్‌ల ద్వారా పందేలు కాస్తున్నట్లు అనధికారిక అంచనా. ఒకసారి సొమ్ము పొందినా.. పోగొట్టుకున్నా మరింతగా బెట్టింగ్ మాయలో పడి అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాడేపల్లిగూడెంలోని ఓ చిరుద్యోగి సరదాగా ఫేస్‌బుక్ రీల్స్ చూస్తున్నాడు. మధ్యలో ఐపీఎల్‌లో లక్షలు సంపాదించే మార్గం చెబుతా నా ఛానల్‌లో చేరండి.. మీ డబ్బులకు నాది గ్యారంటీ.. ఓ వ్యక్తి తన ఛానల్ ప్రమోషన్‌లో చెప్పడం ఆకర్షించింది. ఒకసారి చూద్దామని అతగాడు పెట్టిన లింక్ క్లిక్ చేశాడు. వెంటనే బుకీ ఏర్పాటుచేసిన ఛానల్‌కు వెళ్లిపోయాడు. నాలుగు రోజులు ఆ ఛానల్ పరిశీలించి బాగానే గెలిచే జట్లను చెబుతున్నాడని ఫాలో అయ్యాడు. పది రోజులు సొమ్ములు బాగానే వచ్చాయి. అప్పటి వరకూ వందల్లో కాసిన పందేలు వేలల్లోకి చేరుకుంది. ఐదు రోజులకు రూ.2 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అప్పుల వాళ్లు వెంటబడడంతో భార్య తాళి తాకట్టుపెట్టాడు.
జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సరదాగా తోటి స్నేహితులతో ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ అక్కడ టీవీ స్ర్కీన్‌పై ఐపీఎల్ చూస్తూ సరదాగా స్నేహితులతో మా కోహ్లి ఈ రోజు సెంచరీ చేస్తాడని అరిచాడు. మరొకడు బెట్ ఎంతరా అన్నాడు. ఇద్దరూ పందెం కాసుకున్నారు. అలా మొదలైన బెట్టింగ్ ఆనక ఆ విద్యార్థి తన పాకెట్ మనీ పోగొట్టుకోగా స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ పందేలు కట్టాడు. చివరికి అప్పులు తీర్చడానికి కాలేజి మానేసి బయట పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
భీమవరం క్రైం/తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రి ల్ 22 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ భూతం భయ పెడుతోంది. సాధారణంగా పందేలు కాసే నైజం ఉన్న గోదారి కురోళ్లను ఐపీఎల్ పట్టిపీడిస్తోంది. క్షణానికో లక్ష చేతులు మారేంతగా బెట్టింగ్ విస్తృతమవుతోంది. లక్షలను పైసల్లో లెక్కేస్తూ బెట్టింగ్ ప్రక్రియ సాగుతోంది. టాస్ నుంచి ఆఖ రి బాల్ వరకూ బంతి బంతికీ పందేలు, జట్ల జయాపజయాలు, అధిక స్కోర్లపై బెట్టింగ్ జరు గుతోంది. అదే పనిగా యువత బెట్టింగ్‌తో జేబు గుల్ల చేసుకుంటున్నారు. దీంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
కొన్ని రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ (20–20) మ్యాచ్‌లతో యువత ఎక్కువగా టీవీలకు అతుక్కుపోయి బెట్టింగ్ కాస్తున్నా రు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు తదితర పట్టణాల్లో బెట్టింగ్ జోరు కొనసాగుతున్నట్లు సమాచారం. సాయంత్రమైతే టీవీల వద్ద కూర్చుని బెట్టింగ్‌లో మునిగి తేలుతున్నారు. యువత స్మార్ట్ ఫోన్‌లో పలు బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని పందేలు కాస్తున్నారు. యాప్‌లలో పందేలు వచ్చిన సొమ్ము అలాగే ఉంచి రెండో రోజు పందెం వేసే వెసులుబాటుతో యువత చిక్కుకు పోతున్నారు. అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ పందేలు కాయడం సర్వసాధారణంగా మారింది.
బెట్టింగ్ రకరకాలు!
క్రికెట్ బెట్టింగ్‌లలో పలు రకాలుగా నిర్వహిస్తుంటారు. మ్యాచ్ మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమ్‌ను ప్లేయింగ్ అని, రెండో బ్యాటింగ్ తీసుకున్న టీమ్‌ను ఈటింగ్ అని ఉదహరిస్తారు. సమానంగా పందెం కాసేటప్పుడు బోర్డు 90గా ఉదహరిస్తారు. బోర్డు 60, బోర్డు 70 అంటే పందెం కాసిన టీమ్ గెలిస్తే రూ.700, ఓడిపోతే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌కు ఇన్ని పరుగులు కొడతారంటూ కాసే పందేన్ని ఫ్యాన్సీ పందేలుగా ఉదహరిస్తారు. ఆటలో మొదటి ఆరు ఓవర్లకు, 10 ఓవర్లకు, 20 ఓవర్లకు ఎన్ని పరుగులు సాధిస్తారనే పందెం కూడా వేస్తారు.
వందల్లో యాప్‌లు
బెట్టింగ్ యాప్‌లతో పందేల జోరు పెరిగింది. రకరకాల యాప్‌లు వందల్లో స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రావడంతో వాటిని అనుసరిస్తున్నారు. ఏ యాప్‌లో పందెం కాస్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా పరిశీలించి మరీ పందేలు కాయడం సర్వసాధారణమైంది. పందేలు కాసే ముందు వారి ఖాతాలో సరిపడినంత సొమ్మును ముందుగా జమ చేయాలి. సొమ్ము ఖాళీ అయితే మళ్లీ జమ చేయాల్సిందే. పందెం గెలిస్తే సంబంధిత ఖాతాలో జమ అవుతాయి. యాప్‌లతో బెట్టింగ్ సులభతరం కావడంతో పందేలు జోరుగా సాగుతున్నాయి.
బెట్టింగ్ అడ్డా.. దాబా..
బార్లు, రెస్టారెంట్‌లకు తోడు తాజాగా దాబా ల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై ఐపీఎల్ మ్యాచ్ మందు బాబులకు జోష్ నింపుతోంది. దాబాల్లో మందేసి చిందేసి అక్కడే బెట్టింగ్ కాసి ఎంజాయ్ చేస్తు న్నారు. ఆన్‌లైన్‌లోనే కాదు స్నేహితులతో కూడా పందేలు కడుతున్నారు. దాబాల్లో పోలీసు నియంత్రణ కొరవడిందని ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేక దృష్టి పెట్టాం
బెట్టింగ్‌లు యాప్‌ల ద్వారా పందేలు కాసే వారిపై దృష్టి పెట్టాం. కొంత మందిని అరెస్ట్ చేశాం. యాప్‌లు అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్లు పందేలకు కీలకంగా మారాయి. యువత చెడు దారుల్లో పడకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. చాలా మంది బెట్టింగ్‌లో సొమ్ము పోగొట్టుకుని రోడ్డునపడ్డవారు ఉన్నారు. అలాంటి వారిని చూసి మారితే బాగుంటుంది.
– ఆర్‌జి.జయసూర్య, డీఎస్పీ, భీమవరం
బెట్టింగ్‌పై నిఘా
ఎక్కడ బెట్టింగ్‌లు జరుగుతుందనే సమాచారంతో నిఘా ఉంచుతున్నాం. బెట్టింగ్ నిర్వహణ యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. పోలీసు సిబ్బంది కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా పందేల జోలికి వెళితే నష్టంతోపాటు కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎక్కడైనా దాబాల్లో స్ర్కీన్‌లు వేసి పందాల నిర్వహణ చేస్తున్నారనే దానిపై దృష్టి సారించాం. వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం.
– ఎ.సుబ్రహ్మణ్యం, సీఐ, తాడేపల్లిగూడెం
Updated Date - Apr 23 , 2025 | 12:58 AM