పెన్షన్ కావాలంటే.. రూ.55 వేలు లంచమివ్వు
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:21 AM
రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ సర్టిఫై చేసేందుకు కైకలూరు సబ్ ట్రెజరీ ఉద్యోగి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
కైకలూరు, జూలై 19(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ సర్టిఫై చేసేందుకు కైకలూరు సబ్ ట్రెజరీ ఉద్యోగి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలి పిన వివరాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయాల్లో అటెం డర్‌గా పనిచేసి తొమ్మిదేళ్ల క్రితం కైకలూరుకు చెందిన షేక్ అబ్దుల్ సుబానీ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి కొన్ని సమస్యల వల్ల పెన్షన్ ఫిక్స్ కాలేదు. వాటిని అధిగమించి గత మార్చి నెల నుంచి కైకలూరు సబ్‌ట్రెజరీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కె.హనుమంతరావు (ఆంజనేయులు) గ్రాట్యుటీ అమౌంటు రూ.6 లక్షలు, 9 సంవత్సరాల నుంచి పెన్షన్ కలిపి రూ.33 లక్షలు వస్తుందని 2 శాతం చొప్పున రూ.66 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని సుబానీ చెప్పడంతో చివరకు రూ.55 వేలు ఇవ్వాలంటూ తేల్చిచెప్పాడు. దీంతో ముందుగా రూ.10 వేలు చెల్లించగా ఇటీవల పెన్షన్ ఫిక్స్ చేశాడు. గ్రాట్యుటీ సొమ్ము ఇప్పించాలని కోరగా ఇస్తానన్న సొమ్ములో కేవలం రూ. పది వేలే చెల్లించావు.. మిగతా రూ.45 వేలు బాకీ ఉన్నావన్నాడు. అందుకు సుబానీ తొమ్మిదేళ్లుగా పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నానని ప్రస్తుతం అంత చెల్లించుకోలేనని చెప్పడంతో ముందుగా రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత సొమ్ము ఇవ్వలేక బాధితుడు సుబానీ ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే రూ.20 వేలు కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో హనుమంతరావు తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కెమికల్ టెస్టుల్లో కూడా లంచం తీసుకు న్నట్లుగా నిరూపణ అయిందని, అతనిపై కేసు నమోదు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏలూరు, రాజమండ్రి ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణ, శ్రీనివాసు, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 12:22 AM