ఉపాధి పనులకు డబ్బులివ్వండి
ABN, Publish Date - May 19 , 2025 | 12:28 AM
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2014–19 మధ్య చేపట్టిన ఉపాధి పనులకు బిల్లు చెల్లించలేదు. చేపట్టిన పనులకు సొమ్ముకోసం కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.
ఏళ్ల తరబడి కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు
సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణాలు
చెల్లింపులు నిలిపివేసిన జగన్ సర్కార్
అప్పుల్లో కూరుకుపోయిన కాంట్రాక్టర్లు
తాడేపల్లిగూడెం రూరల్, మే 18(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2014–19 మధ్య చేపట్టిన ఉపాధి పనులకు బిల్లు చెల్లించలేదు. చేపట్టిన పనులకు సొమ్ముకోసం కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అప్పట్లో చేపట్టిన సీసీ రోడ్లు, కల్వర్టులు, గోకులం షెడ్ పనులకు సొమ్ము అందక కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నిఽధులు విడుదల చేయకపోగా చేసిన పనులపై వైసీసీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెండింగ్ పనులకు సంబం ధించిన నిధులు విడుదల చేస్తామని ప్రకటించడంతో కాంట్రాక్టర్లలో ఆశలు చిగు రించాయి. జిల్లాలో గత ప్రభుత్వంలో చేసిన ఉపాధి పనులకు సంబందించి రూ.298 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. జగన్ సర్కారుపై కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా రూ.34 లక్షలు దఫదఫాలుగా చెల్లించారు. ఇంకా రూ.2.64కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు.
అధికంగా కల్వర్టులే..
2014–19 సంవత్సరాల మధ్య ఉపాధి పనుల్లో వంతెనల పనులకు ఎక్కువ బకాయి చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 240 పనులకు సంబందించి రూ. 1.20 కోట్లు చెల్లించాల్సి ఉండగా తరువాత స్థానంలో గోకులం షెడ్‌లు 650 పనులకు రూ.80 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని పనులకు సొమ్ము చెల్లించాల్సి ఉంది. వీటిలో అధికంగా తాడేపల్లిగూడెం మండలానికే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మొత్తం రూ.2.68 కోట్లు కాగా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే కోటి రూపాయలకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది.
అప్పుల భారం
తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు గ్రామాల్లో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెట్‌తో పనులు చేశాం. రూ.40 లక్షలకు పనులు చేయగా ఒక్క పైసా కూడా రాలేదు. అప్పు తెచ్చి పనులు చేస్తే అప్పు కట్టడానికి ఐదేళ్లుగా మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి. బిల్లులు వస్తే అప్పు తీరుతుంది.
రెడ్డి రాము, దండగర్ర
మా గ్రామం కోసం పనులు చేశాం
అప్పట్లో గ్రామంలో పనులు చేసేందుకు బయటవారు రాకపోతే మా గ్రామం కోసం మేమే పనులు చేశాం. ఎంతో ఖర్చుచేశాం. ఆ బిల్లులు రాకపోగా తిరగడానికే చాలా ఖర్చయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో మాకు ఆ బిల్లులపై ఆశలు చిగురించాయి.
పాకనాటి సుబ్బారావు, కడియద్ద
త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం
ప్రభుత్వం గతంలో పనులు చేసి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలనే ఆదేశాలతో బకాయిలపై మొత్తం లెక్కలు వేశాం. ఆ పెండింగ్ బిల్లులు త్వరలోనే చెల్లించేలా ఉన్నతాధికారులు ఆదేశించారు.
కేసీహెచ్ అప్పారావు, డ్వామా పీడీ
Updated Date - May 19 , 2025 | 12:28 AM