చింత తొలగేనా ?
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:38 AM
చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసే కాలువ. రూ.4,909 కోట్లు వ్యయంతో రెండు ఫేజ్‌లలో ఈ ఎత్తిపోతల పథకం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి.
పనులపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
సుప్రీం కోర్టు ఆదేశాలతో నిలిచిన పనులు
టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినా ముందుకు కదలని పనులు
నూజివీడు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసే కాలువ. రూ.4,909 కోట్లు వ్యయంతో రెండు ఫేజ్‌లలో ఈ ఎత్తిపోతల పథకం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం చేపట్టారని పేర్కొంటూ ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వట్టి వసంత కుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ 2022లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.72 కోట్లు జరిమానా విధించింది. దీనిపై అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా మూడు నెలల్లో జరిమానా చెల్లించడం లేదా పర్యావరణ అనుమతులు పొందాలని ఆదేశించింది. జగన్ ప్రభు త్వం కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో సుప్రీంకోర్టు చింతలపూడి పనులను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో చింతలపూడి పథకం పనులు అప్పటి నుంచి నిలిచిపోయాయి.
ప్రాధాన్యం ఇచ్చినా..!
2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒకటి. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఇప్పటికే ఈ పథకానికి రూ.2,500 కోట్లు వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. సుప్రీం కోర్టు విధించిన రూ.72 కోట్లు అపరాధ రుసుము ప్రభుత్వానికి ఒక లెక్క కాదు. ఈ పథకం ఆలస్యమయ్యే కొద్ది రైతులకు జరిగే నష్టాన్ని పరిశీలిస్తే చెల్లించాల్సిన అపరాధ రుసుము చాలా చిన్నది. రెండు జిల్లాల్లోని సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు తాగునీరును ఈ పథకం ద్వారా గోదావరి జలాలను అందించవచ్చు.
చాట్రాయి మండలంలో వేంపాడు సాగర్ కాలువలోకి ఈ చింతలపూడి కాలువ అనుసంధానం అవుతుంది. వేంపాడు ద్వారానే కింద మండలాలైన ముసునూరు, ఏలూరు జిల్లాలోని వట్లూరు వరకు ఈ గోదావరి జలాలు అందుతాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చింతలపూడి కాలువ పనులు వేగవంతం కావడంతో చాట్రాయి మండలంలో వేంపాడు సాగర్ కాలువపై కిందకి నీరు వెళ్లడానికి కోసం నిర్మించిన కట్ అండ్ కవర్‌ను తొలగించడంతో ఇప్పుడు సాగర్ నీరు ఈ రెండు మండలాలకు అందని పరిస్థితి. ఇటు సాగర్‌నీరు రాక అటు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అందని పరిస్థితి నెలకొంది.
అడ్డంకులు ఇవే..
ఈ పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన అపరాధ రుసుముతో పాటు ఫేజ్–1, ఫేజ్–2 లో రైతులకు నష్టపరిహారంగా చెల్లించాల్సింది కలిపి సుమారు రూ.175 కోట్లు ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ఉన్న జల్లేరు రిజర్వాయర్ కెపాసిటీని 8 నుంచి 16 టీఎంసీలకు పెంచడంతో కొంత భూభాగం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లడంతో ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. ఈ రిజర్వాయర్‌లో కొంత భూభాగం అటవీశాఖకు చెంది నది కావడంతో దానిని డీనోటిఫై చేయాల్సి ఉంది. ప్రభుత్వం శ్రద్ధ చూపితే త్వరితగతిన వీటిని పరిష్కరించవచ్చని ఆదిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:38 AM