రూ.ఐదు కోట్లకు టోపీ!
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:28 AM
తమ సామాజిక వర్గానికి చెందినవాడు, గ్రామంలో ఇల్లు ఉందని నమ్మి రూ.లక్షల్లో చీటీలు కట్టారు.
పేదలను నట్టేట ముంచిన వైనం
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
భీమవరం క్రైం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): తమ సామాజిక వర్గానికి చెందినవాడు, గ్రామంలో ఇల్లు ఉందని నమ్మి రూ.లక్షల్లో చీటీలు కట్టారు. కాయాకష్టం చేసి రాత్రనక, పగలనక కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి నెలకు రూ.5 వేలు, రూ.10 వేలు అతనికి జమ చేసేవారు. చీటీ మధ్యలో పాడుకుంటే చాలా నష్టం వస్తుందని అతను చెప్పిన మాయ మాటలను నమ్మి చీటీలు పాడకుండా చివరి వరకు ఉంచారు. తీరా చూస్తే మొత్తం కట్టిన సొమ్ముతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఉడాయించాడు. ఈ సంఘటన భీమవరం మండలం తోకతిప్పలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలివి.. గ్రామానికి చెందిన పొన్నాల వీరవెంకట రమణ అనే వ్యక్తి 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. దీంతో గ్రామస్థులంతా అతనిని నమ్మారు. కొన్నిసార్లు చిట్టీలు పాడుకుంటే నెల రోజుల్లో డబ్బులు సరిపెట్టేసేవాడు. అలా అందరికి నమ్మకస్తుడైపోయాడు. గ్రామస్థులే కాకుండా దూరప్రాంతాల్లోని వారి బంధువుల చేత కూడా చిట్టీలు వేయించారు. విశేషమేమిటంటే చిట్టీలు కట్టిన వారందరూ నిరుపేదలు. కనీసం కొందరికి ఇల్లు కూడా లేదు. ఆరు నెలల నుంచి గ్రామస్థులు కొంత మంది తాము కట్టిన చీటీ అయిపోయిందని, డబ్బులు ఇవ్వమని కోరడంతో నేను ఎక్కడికి వెళతాను, ఊరిలో మనిషినే కదా. ఇస్తానులే.. కంగారు పడకండి అంటూ నమ్మించాడు. అయితే నెల రోజుల క్రితం రాత్రికి రాత్రే భార్య, కుమా రుడు, కుమార్తెను తీసుకుని పరారయ్యాడు. ఎన్ని రోజులైనా వీర వెంకట రమణ గ్రామానికి రాకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. సామాన్లతో సహా వెళ్లిపోయినట్టు తెలిసి లబోదిబోమన్నారు. వారితోపాటుగా కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో కొన్ని గ్రామాలు, మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందినవారు చిట్టీలు వేశారు. సుమారు రూ.ఐదు కోట్లు వరకు సొమ్ములు రావాలని బాధితులు చెబుతున్నారు. ఇటీవల వీర వెంకట రమణ ఒక రొయ్యల షెడ్డులో పని చేస్తున్నాడని తెలుసుకుని గ్రామస్తులంతా అక్కడికి వెళ్లగా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇక అక్కడి నుంచి అతని ఆచూకీ లేదు. బాధితులంతా శనివారం భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ ఎస్‌ఐ ఐ.వీర్రాజుకు ఫిర్యాదును అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఎస్‌ఐ మాట్లాడుతూ పైఅధికారులతో మాట్లాడి చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఎంత సొమ్ములు ఇవ్వాలో ఒక పత్రంపై రాసి ఇవ్వాలని సూచించారు.
Updated Date - Jun 29 , 2025 | 12:28 AM