మామిడి తోటల్లో.. ముక్కలాట!
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:40 PM
పేకాట రాయుళ్లకు నూజివీడు నియోజకవర్గం స్వర్గధామంగా మారుతోంది. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లోని మామిడి తోటలు వేదికగా మారుతున్నాయి. మరోవైపు శిబిరాలపై పోలీసుల దాడులు జరగకుండా పకడ్బందీ చర్యలను నిర్వాహకులు చేపడుతున్నారు.
నూజివీడు నియోజకవర్గంలో జోరుగా పేకాట శిబిరాలు
ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు.. పేకాటరాయుళ్లకు సకల సౌకర్యాలు
పోలీసుల కన్నుగప్పి నిర్వహణ
తిరిగి తెరచుకోనున్న ‘మ్యాంగో హబ్’
(నూజివీడు, ఆంధ్రజ్యోతి) :
పేకాట రాయుళ్లకు నూజివీడు నియోజకవర్గం స్వర్గధామంగా మారుతోంది. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లోని మామిడి తోటలు వేదికగా మారుతున్నాయి. మరోవైపు శిబిరాలపై పోలీసుల దాడులు జరగకుండా పకడ్బందీ చర్యలను నిర్వాహకులు చేపడుతున్నారు.
పేకాట శిబిరాలకు నూజివీడు నియోజక వర్గం కేంద్రంగా మారిందనే విమర్శలు విన్పిస్తు న్నాయి. దీనికి మామిడి తోటలే వేదిక నిలుస్తు న్నాయి. ఒకే తోటలో వరుసగా శిబిరాలు నిర్వహిస్తే గ్రామాల్లో విస్తృత ప్రచారం జరిగే అవ కాశం ఉందని భావిస్తున్న నిర్వాహుకులు పేకాట శిబిరాలను రోజుకో తోటలోకి మారుస్తూ అక్కడకు వచ్చేవారికి కావాల్సిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
పోలీస్ నిఘా వ్యవస్థకు దీటుగా
పోలీసుల నిఘాను తలతన్నేలా తమకు అనుకూలంగా ఉండే వారితో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పోలీసుల దాడులను ముందుగానే తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్ల లో వచ్చే జూదరులకు ఒక ల్యాండ్ మార్క్ చూపుతూ అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో శిబిరాలకు తరలిస్తున్నట్టు సమాచారం. మరో వైపు అయా మార్గాల్లో తమ మనుష్యులను నిఘా ఉంచి పోలీసులు ఈ శిబిరాల వైపు వస్తున్నారని గుర్తిస్తే చాలు ఆ సమాచారం క్షణాల్లో తమకు చేరవేసేలా పకడ్బందీగా చర్య లు తీసుకుంటున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా శిబిరాల్లో కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
పక్క రాష్ట్రాల నుంచి బారులు..
పేకాట శిబిరాలు ఎక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియకుండా తోటల్లో శిబిరాలను మారుస్తున్న నిర్వాహకులు జూదరులకు మా త్రం సమాచారాన్ని లోకేషన్లతో సహా చేరవేస్తున్నారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి లోని వివిధ ప్రాంతాల నుంచే కాక ఉమ్మడి పశ్చిమ గోదావరి తదితర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి సైతం పేకాట రాయుళ్లు బారులు తీరుతున్నారు.
ఎంట్రీ ఫీజు రూ.2000..అన్నీ కాళ్ల వద్దకే..
ఎంట్రీ ఫీజు రూ.2000 కట్టి పేకాట శిబిరంలోకి వచ్చిన వారు ఏ అవసరానికి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తిరిగి రాత్రి 7గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు అన్ని సౌకర్యాలను నిర్వాహకులు సమకూరుస్తున్నారు. మద్యం, తాగునీరు, భోజనం తదితరాలను శిబిరాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు.
మ్యాంగో హబ్ తెరుచుకోనుందా..?
ఆగిరిపల్లి మండలం కేంద్రంగా కొన్నేళ్ల కిందట పేకాట తదితర జూదాల నిర్వహణ జోరుగా సాగిన మ్యాంగో హబ్ (అడివినెక్కలం–ఈదర మధ్య మామిడితోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భవనం)ను తిరిగి తెరిపించేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. గతంలో ఈ మ్యాంగో హబ్‌లో జోరుగా సాగుతున్న పేకాట నిర్వహణ, కోట్లాది రూపాయలు చేతుల మారుతున్న విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపడంతో మ్యాంగో హబ్ మూత పడింది. అయితే హబ్‌ను తిరిగి తెరిచేందుకు పేకాట రాయుళ్లు లాబీయింగ్ నడుపుతున్నట్టు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది.
Updated Date - Jun 22 , 2025 | 11:40 PM