భూముల రీసర్వేకు బ్రేక్
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:58 AM
భూముల విషయమై జాయింట్ ఎల్‌పీఎంల సమస్యలు పరిష్కరించాలనే ప్రభుత్వ ఆదేశాలతో రీ సర్వేకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
18,300 ఎకరాల పట్టా భూములకు సమస్య
రైతుల ఖాతాల సబ్ డివిజన్ చేయండి
అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు
కదులుతున్న రెవెన్యూ, సర్వే యంత్రాంగం
పూర్తి కావచ్చిన దశలో నిలిచిన రీసర్వే
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
భూముల విషయమై జాయింట్ ఎల్‌పీఎంల సమస్యలు పరిష్కరించాలనే ప్రభుత్వ ఆదేశాలతో రీ సర్వేకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తొలి విడతలో 24 గ్రామాల్లో 24,604 ఎకరాల భూముల రీ సర్వే పూర్తయ్యే దశకు చేరగా, రెండో దశలో 30 గ్రామాల్లో 36,540 ఎకరాల భూమికి రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ దశలో ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 18,300 ఎకరాల పట్టాభూములకు జాయింట్ ఎల్‌పీ ఎంలకు సబ్ డివిజన్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 800 ఎకరాల జెఎల్‌పీంల సమస్యను నివారించారు. మిగిలిన 17,500 ఎకరాలకు సబ్ డివిజన్ చేసి రైతు ల సమస్యలను చక్కబెట్టేందుకు ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్ విధించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో పురోగతిపై ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
భూ రక్షతోనే అసలు సమస్య
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూరక్ష పేరుతో రీ సర్వే చేశారు. అప్పట్లో సరైన విధానాలు పాటించక పోవడంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలె త్తాయి. భూ యజమానుల పేర్లు మారడం,హద్దులు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు కనిపించాయి కూడా. వీటిపై అప్పీల్ చేసుకునే అవకాశానికి గడువు ఇవ్వలేదు. ఇప్పటికి క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో ఇద్దరి నుంచి పదిమంది రైతులతో కలిసి జాయింట్ ఎల్‌పీఎం(జాయింట్ ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నెంబర్లు ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంలో కొంత పరిష్కారం
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో వేలల్లో అభ్యంతరాలు వచ్చాయి. ఇందు లో చాలావరకు పరిష్కరించినట్లు నివేదికలు రూ పొందించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పరిస్థితి లేదు. జాయింట్ ఎల్‌పీఎంల చిక్కులు తొలగకపోవ డమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీనికి సం బంధించిన వ్యవహారాల్లో భూములకు అప్పట్లో రిజిస్ర్టేషన్లు జరగలేదు. దీంతో సమస్యలు బయటకు రాలేదు. ప్రతీ రైతుకూ సర్వే నెంబర్ల స్ధానంలో ఎల్‌పీ ఎం నెంబర్లు కేటాయించడంతో ఏ భూమికి ఎవరు యజమాని, విస్తీర్ణం ఎంత? అనేది ప్రశ్నార్థకమైంది.
సబ్ డివిజన్ చేస్తేనే పరిష్కారం
జాయింట్ ఎల్‌పీఎంల చిక్కుల పరిష్కారానికి ముందుగా సబ్ డివిజన్ చేయాలి. తర్వాత ఎవరె వరికి ఎంత విస్తీర్ణం ఉందో తేటతెల్లం అవుతుంది. సాధా రణంగా సబ్ డివిజన్‌కు రూ500, యూజర్ ఛార్జీ తీసుకుంటారు. ఉచితంగా ఈ పనిచేయాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ ఎల్ పీఎం అర్జీలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయనేది తొలుత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచి ఆరా తీస్తున్నారు. దీంతో ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకేమైనా ఉంటే వాటికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తే ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతులకు పంట రుణాల మంజూరు సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:58 AM