నిలిచిన ఏఎన్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:02 AM
ఉమ్మడి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాల యాల్లో గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు ఆదివారం జరిగిన సాధారణ బదిలీల కౌన్సెలింగ్ ఆధ్యంతం అవాం తరాలు, అభ్యంతరాల నడుమ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అర్ధాంతరంగా నిలిచిపోయింది.
నేటికి వాయిదా
ఏలూరు అర్బన్, జూలై 6(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాల యాల్లో గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు ఆదివారం జరిగిన సాధారణ బదిలీల కౌన్సెలింగ్ ఆధ్యంతం అవాం తరాలు, అభ్యంతరాల నడుమ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం వేదికగా జూమ్ విధానంలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. తొలుత ఏజెన్సీ మండలాల్లోని సచివాలయాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనే పలు అభ్యంత రాలు వ్యక్తంకాగా, ఆ తదుపరి మిగతా మండ లాల్లోని పీహెచ్‌సీల పరిధిలో సచివాలయాల ఏఎన్‌ఎంలకు కౌన్సెలింగ్ చేపట్టగా వెకెన్సీలు, ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద బదిలీలకు దరఖాస్తుచేసుకున్న వారికి స్థానాల కేటాయింపు విషయంలో ప్రతిష్టంభన ఎదురవడంతో కౌన్సెలింగ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, ఆ మేరకు పీహెచ్‌సీలకిచ్చిన జూమ్ కనెక్షన్లను నిలిపివేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వేచివున్న వైద్యాధికా రులు, ఏఎన్‌ఎంలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రభుత్వమిచ్చిన గడువుతేదీ ముగిసిన తర్వాత ప్రారంభమైన ఈ బదిలీల కౌన్సెలింగ్‌పై ముందునుంచీ పలు విమర్శలు తలెత్తాయి. బదిలీల కౌన్సెలింగ్‌ను చేపడుతున్నట్టు పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లకు ఆదివారం మధ్యాహ్నం 12గంటల తర్వాత సమాచారం పంపించిన అధికారులు, ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో వెకెన్సీల జాబితాలను వైద్యాధికారులకు సాయంత్రం ఐదు గంటల్లోపే ఇ–మెయిల్ చేస్తామని చెప్పి, రాత్రి 7.30 గంటలు దాటినా పంపకపోవడంతో పలుచోట్ల బదిలీ దరఖాస్తుదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సాయంత్రం కౌన్సెలింగ్ ప్రారంభంకాగా, ఉమ్మడి జిల్లాలోని 754 మంది ఏఎన్‌ఎంలు సంబంధిత పీహెచ్ సీలకు హాజరయ్యారు. పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్ల సమక్షంలో బదిలీలు జరిగేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీనియార్టీ జాబితాల ప్రకారం బదిలీలు జరగాల్సిఉండగా, ట్రైబల్ మండలాల ఏఎన్‌ఎంలకు కౌన్సెలింగ్ పూర్తయ్యే లోపే పలు సమస్యలు తలెత్తడంతో కొందరిని నిలిపివేసి, తదుపరి వారికి చేపట్టినట్టు తెలిసింది. మరోవైపు ఆయా పీహెచ్‌సీల పరిధిలోని సచివా లయాల్లో వెకెన్సీల వివరాలను ఖరారు చేసుకోవ డానికి కౌన్సెలింగ్ సమయంలో వైద్యాధికారులపై ఆధారపడాల్సి రావడాన్ని ముందస్తు ఏర్పాట్లు జరగలేదనడానికి నిదర్శనమని చెబుతున్నారు.
వాస్తవానికి ఉమ్మడి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంల వెకెన్సీల వివరా లను జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ అధికా రులనుంచి సేకరించి జాబితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే ఈ సమస్య తలెత్తేదికాదని పలువురు మెడికల్ ఆఫీసర్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న ఏఎన్‌ఎంలు ఐదేసిచొప్పున వెకెన్సీలకు ఐచ్ఛికాలివ్వగా, వాటిలో ఖాళీలు లేవనిచెబుతూ వేరే వాటిని ఎంచుకోవాలని సూచించిన అధికారులు ఆ మేరకు వెకెన్సీలను చూపించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జూమ్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్‌ను డీఎంహెచ్‌వో, ఏవోల సమక్షంలో కార్యాలయ సీసీ నిర్వహించడం వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ బదిలీలు గతనెల 30లోగా జరగాల్సిఉంది. తాజాగా ఉత్తర్వులను సవరించి ఈనెల 5లోగా బదిలీల కౌన్సెలింగ్‌ను పూర్తిచేయాలని జీఎస్‌డబ్యూఎస్ శాఖ రాష్ట్ర కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశా లు జారీ చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో సంబంధిత ఏఎన్‌ఎంల విభాగాన్ని పర్యవేక్షించే ఉద్యోగి సెలవు పెట్టడంతో కౌన్సెలింగ్‌ను ఆదివా రం నిర్వహించాల్సి వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏవో డాక్టర్ గంగాభవాని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహణను డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని పర్యవేక్షించారు.
బదిలీల వెకెన్సీల్లో పారదర్శకత లోపించ డం, సీనియార్టీ ఆర్డర్ ప్రకారం నిర్వహించ కుండా కొందరి విషయంలో జాప్యం చేయడం, తదితర అంశాల నేపథ్యంలో ఎవరికైనా బదిలీ ల్లో అన్యాయం జరిగితే సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారవేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయా లని ఏఎన్‌ఎంలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈలోగానే కౌన్సెలింగ్ సోమవారానికి వాయిదా పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1468 మంది గ్రామ/వార్డు సచివాలయాల ఏఎన్ ఎంల రిక్రూట్‌మెంట్ జరుగగా, వీరిలో 264 మందికి ఎంపీహెచ్‌ఏ(ఫిమేల్)గా ఇటీవలే పదోన్నతులిచ్చారు. వీరిని మినహాయించగా మిగతా 1204మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ పెట్టిన జాబితాలో 800మంది వివరాలు ఉండడం గమనార్హం. ప్రస్తుత స్థానాల్లో ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేస్తామని డీఎంహెచ్ వో కార్యాలయవర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Jul 07 , 2025 | 12:03 AM