నరసాపురం పార్లమెంట్‌కు మేలు చేయడమే లక్ష్యం
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:32 AM
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైన జాతీయ రహదారులు, రైల్వేల ద్వారా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు సాధ్య మైనంత మేలు చేకూర్చడమే తన లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు.
కేంద్ర సహాయ మంత్రి వర్మ
భీమవరం టౌన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైన జాతీయ రహదారులు, రైల్వేల ద్వారా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు సాధ్య మైనంత మేలు చేకూర్చడమే తన లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. సోమ వారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకివీడు మండ లంలో రైతుల నుంచి నేషనల్ హైవే కోసం 28.95 ఎకరాలు సేకరించారని, వారికి ఆరేళ్ల తర్వాత మొత్తం రూ. 24.95 కోట్ల నష్టపరిహారం మంజూ రైందన్నారు. తొలివిడతగా రూ. 7.47 కోట్ల పరిహారం అందజేశామన్నారు. నేషనల్ హైవే 165లో రెండో దశలో 2 లైన్‌లుగా ఉన్న అజ్జమూ రు– దిగమర్రు మధ్య భీమవరం బైపాస్‌తో కలిపి రహదారిని 4 లైన్లుగా మార్చామని, త్వరలోనే రూ. 2వేల500 కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. గతి శక్తి పథకంలో భాగంగా లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు పనులు ప్రారంభ మైనట్లు వెల్లడించారు. నరసాపురం వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగించేం దుకు బైపాస్ కల త్వరలోనే సాకారమవుతుందని, మొగల్తూరు, సీతారామ పురం, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో భూములిచ్చిన 87 మందికి రూ.6.02 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే నరసాపురం నుంచి చెన్నైకు వందే భారత్ రైలు ప్రారంభమవుతుందన్నారు. అలాగే అత్తిలి, వీరవాసరం లాంటి రైల్వే స్టేషన్‌లో విశాఖ, నాగర్ సోల్, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 42 ఆర్వోబీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మంత్రి వర్మ చొరవతో రైతులకు పరిహారం చెల్లింపు జరగడం ఆనందంగా ఉందన్నారు. ఆరేళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న నేషనల్ హైవేకి భూములిచ్చిన ఆకివీడు తదితర గ్రామాల రైతులు పరిహారం ఇప్పించడంతో మంత్రి వర్మను ఘనంగా సత్కరించారు. అనం తరం రైతులకు పరిహారం అందించడానికి సహకరించిన నేషనల్ హైవే ఈఈ సంజీవరాయుడు తోపాటు ఇతర అధికారులను వర్మ సత్కరించారు. ఆర్డిఓ కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:32 AM