ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంచనాలకు మించి..

ABN, Publish Date - May 04 , 2025 | 12:37 AM

పశ్చిమ డెల్టాలో రబీ ధాన్యం అంచనాలను మించి పండింది. కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 60 బస్తాలకు పైగానే దిగుబడి వస్తోంది. కొనుగోళ్లు వేగవంతంగానే జరుగుతున్నాయి. సొమ్ములు అంతే త్వరగా రైతులు ఖాతాలో జమవుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా..

రబీలో పండిన ధాన్యం

సంచుల కొరతతోనే రైతులకు ఇక్కట్లు

జిల్లా లక్ష్యం ఆరు లక్షల మెట్రిక్‌ టన్నులు.. మరో లక్ష పెంచే అవకాశం.. ఇప్పటికి కొన్నది 4.45 లక్షల మెట్రిక్‌ టన్నులు

పశ్చిమ డెల్టాలో రబీ ధాన్యం అంచనాలను మించి పండింది. కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 60 బస్తాలకు పైగానే దిగుబడి వస్తోంది. కొనుగోళ్లు వేగవంతంగానే జరుగుతున్నాయి. సొమ్ములు అంతే త్వరగా రైతులు ఖాతాలో జమవుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. రైతులను కొన్ని సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని, అడపాదడపా మేఘాలు కమ్ముతున్నాయి. మరోవైపు కొన్ని మిల్లుల్లో నమోదులో జాప్యం జరుగుతోంది. ఇంకొన్నిచోట్ల సంచుల సమస్య తలెత్తుతోంది. దీనిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రబీలో జిల్లా నుంచి ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదికి అదనంగా మరో లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలుకు అధికారులు అనుమతి కోరారు. ఇప్పటి వరకు 47,761 మంది రైతుల నుంచి 4.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతు ఖాతాల్లో రూ.980 కోట్లు జమ చేశారు. రూ.48 కోట్లు మాత్రమే బకాయి ఉంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ సొమ్ము జమ కానుంది. ఈ విషయంలో రైతులు సంతృప్తితో ఉన్నారు. అయితే పాలకోడేరు, పెనుమంట్ర, తణుకు రూరల్‌ మండలా ల్లో సంచుల సమస్య తలెత్తింది. ప్రధానంగా కౌలు రైతులు సంచుల కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్యానికి మించి ధాన్యం దిగుబడులు రావడంతో ఇచ్చిన సంచులు సరిపోవడం లేదు.

జిల్లా అంచనా ఇదే

జిల్లాలో ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడానికి 1,48,69,583 సంచులు అవసరం కానున్నాయని ప్రాథమి కంగా అంచనా వేశారు. రైతు సేవా కేంద్రాల్లో 1,11,46,900 సంచులను సిద్ధంగా ఉంచారు. మరో 30 లక్షలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే సంచులకు ఇబ్బంది తప్పదంటూ రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే రెండు, మూడు మండలాల్లో సమస్య బహిర్గతమైంది. మరో మూడు రోజుల్లో అన్ని రైతు సేవా కేంద్రాలకు అదనపు సంచులను సరఫరా చేయనున్నట్టు జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గోనె సంచులపై ఆందోళన వద్దంటూ ప్రకటించారు.

సొంత సంచులు గోవిందా

గడచిన రబీలో అకాల వర్షాలు కురిశాయి. రైతులు సొంత సంచులు సమకూర్చుకోవాలని వ్యసాయ శాఖ అధికారులు సూచించారు. మిల్లులకు నేరుగా తరలించాలని నిబంధనలు సడలించారు. అప్పటి వరకు కాటా అయిన తర్వాతే మిల్లుల కు పంపేవారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడ్డారు. వర్షాల వల్ల వారం రోజులపాటు వెసులుబాటు ఇవ్వడంతో రైతులు సొంత సంచుల్లో ధానాన్ని తరలించారు. వాటిని రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయలేదు. దీంతో ఇప్పుడు రైతులు తిరిగి సంచులను పొందలేకపోయారు. నష్టాలను చవిచూశారు. ఇప్పుడు చిరిగిన సంచులు ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సొసైటీల వద్దే వేరు చేస్తున్నారు. మిల్లులకు తిరిగి పంపేస్తున్నారు. అయినా సరే సంచుల ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కౌలు రైతులు ఒకటి, రెండుచోట్ల రోడ్డెక్కారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సవ్యంగా పూర్తయ్యేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సంచుల కొరత లేకుండా అధిక దిగుబడులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు చేసినప్పుడే సక్రమంగా సేకరణ పూర్తవుతుంది.

సంచులు ఇప్పించండి మహాప్రభో

పాలకోడేరు, మే 3(ఆంధ్రజ్యోతి):ఆరుగాలం వరి పంటను పండించి కష్టించిన రైతన్నలకు గోనె సంచులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. పాలకోడేరు మండలంలోని అన్ని గ్రామాల్లోను దాళ్వా మాసూళ్లు చురుగ్గా సాగుతున్నాయి. రాత్రయితే చాలు మబ్బులు పట్టి గాలి, దుమ్ము రావడంతో రైతులు భయపడుతూనే ధాన్యాన్ని గట్టెక్కించే పనిలో పడ్డారు. అయితే రైతులకు ధాన్యం సంచుల కొరత రావడంతో దిమ్మల మీద, రహదారుల పక్కన ధాన్యాన్ని పోగు చేస్తున్నారు. మోగల్లు, పాలకోడేరు గ్రామాల్లో ఈ కొరత ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి త్వరితగతిన ధాన్యాన్ని పట్టుకునేందుకు సంచులను సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మండల వ్యవసాయాధికారి నారాయణరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా సంచులకు కొంత ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి, రెండు రోజుల్లో మండలానికి లక్షా 40 వేల సంచులు వస్తాయని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చెయ్యాలి : వైసీపీ

భీమవరం టౌన్‌, మే 3(ఆంధ్రజ్యోతి):ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా, రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైసీపీ నాయకులు శనివారం జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో పది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంటే.. ప్రభుత్వం కేవలం ఆరు లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలుకు నిర్ణయించడం దారుణమన్నారు. ఇప్పటికే ధాన్యంతో తేమ శాతం, ముక్క అవుతుందనే నెపంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడం దళారులు, రైస్‌ మిల్లర్లు అవకాశంగా తీసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని దీనికి కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పీవీఎల్‌ నర్సింహరాజు, గూడాల శ్రీహరిగోపాలరావు(గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో అలా..

ధాన్యం ఇక కొనలేం

లక్ష్యం పూర్తయ్యిందని ఏలూరు జిల్లాలో నిలిపివేసిన అధికారులు

ఇంకా రైతుల వద్ద లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం ఉందని అంచనా

కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్‌

మారుతున్న వాతావరణంతో బెంబేలు

బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లు అంతంతమాత్రమే

ఏలూరు సిటీ, మే 3(ఆంధ్రజ్యోతి):ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎలా అని ఏలూరు జిల్లాలో వరి పంట పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రబీలో 80 వేల ఎకరాల్లో వరి సాగు జరగ్గా 3.54 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడులు వస్తా యని అంచనా వేశారు. దిగుబడులు అధికంగా రావడం, బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్ళు అంతంత మాత్రంగానే ఉండడం, ప్రభుత్వం నిర్దేశించు కున్న లక్ష్యం 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల మాత్రమే ఉండ డంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు పండిం చిన ఽధాన్యం పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా రబీలో 45 నుంచి 50 బస్తాలు ధాన్యం దిగుబడులు వస్తాయి. అయితే ఈసారి 50 నుంచి 60 బస్తాల వరకు రావడంతో లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం మిగిలిపో యిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన ధాన్యం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో

నిడమర్రు/ఉంగుటూరు : ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో పండిన ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు గగ్గోలు పెడుతుండగా.. అధికారులు తమ టార్గెట్‌ పూర్తయ్యిందని చెబుతున్నారు. నిడమర్రు మండలంలో దాళ్వాలో 6,222 ఎకరాలు ఈక్రాప్‌ నమోదైంది. దీని ప్రకారం ప్రభుత్వం నుంచి 19,559 మెట్రిక్‌ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా నూరు శాతం పూర్తిచేశారు. పెదనిండ్రకొలను, భువ్వనపల్లి, బావాయిపాలెం, అడవికొలను తదితర మరో 1000 టన్నుల వరకు ధాన్యం రైతుల వద్ద ఉండిపోయింది. ఈ విషయమై వ్యవసాయశాఖాధికారిణి గీతాదేవిని సంప్రదించగా తమకు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ నూరు శాతం పూర్తయిందని, అదనంగా మరో వెయ్యి టన్నుల కొనుగోలుకు అనుమతి కోరామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. ఉంగుటూరు మండలంలో దాళ్వా పంట విస్తారంగా పండింది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 74 వేల మెట్రిక్‌ టన్నులు పూర్తవడంతో చిన్న, సన్న కారు రైతాంగం సంచుల కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండలంలో ఇంకా 23 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కల్లాల వద్ద నిల్వ ఉన్న విషయమై రైతు నాయకులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంబంధిత శాఖ మంత్రి ద్వారా కలెక్టర్‌, జేసీ దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. కాగా ప్రస్తుతం మూడు వేల టన్నుల ధాన్యాన్ని కొనేందుకు అంగీకరించినట్టు మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. కాగుపాడు, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, కాకర్లమూడి, బొమ్మిడి ఉప్పాకపాడు, రావులపర్రు తదితర గ్రామాల్లో రైతులు తమ ధాన్యం అమ్మేందుకు నిరీక్షిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించి రూ.80 నుంచి రూ.100ల వరకు తక్కువకు కొంటున్నారని రైతులు వాపోతున్నారు.కాగుపాడుకు చెందిన రైతులు దాసి రాజు, వైబోయిన ఆదినారాయణ తదితరులు తమ ధాన్యం అమ్మేందుకు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 04 , 2025 | 12:37 AM