జలమే దైవం!
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:51 AM
‘రాయలేలిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. సీమలో జలవనరులను పెంచి రైతాంగాన్ని ఆదుకుంటాం.
సీమను రతనాలసీమగా మారుస్తాం
పక్కాగా సూపర్-6 హామీల అమలు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
పండ్లతోటల పెంపకానికి సబ్సిడీలు
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
శ్రీశైలం నుంచి గేట్లెత్తి నీటి విడుదల
కృష్ణా జలాలకు జలహారతి
మల్లన్న సేవలో సీఎం
‘రాయలేలిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. సీమలో జలవనరులను పెంచి రైతాంగాన్ని ఆదుకుంటాం. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మల్లన్న స్వామి.. రెండు ప్రాణాధారమైన శ్రీశైలం జలాశయం. నీళ్లు ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జలం లేకపోతే కష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే జలమే దైవం..’
- సీఎం నారా చంద్రబాబు నాయుడు
నంద్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాయలసీమ అనేక సదుపాయాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. ప్రసుత్తం ఆహారపు అలవాట్లు మారాయని.. అందుకు తగినట్టుగా పండ్లకు డిమాండ్ పెరిగిందన్నా రు. ఆ దిశగా రాయలసీమలో గతంలో మాదిరిగా 90శాతం సబ్సిడీతో డ్రిప్ సదుపాయం కల్పించి పండ్ల తోటల పెంపకం పెంచుతామన్నారు. శ్రీశైలంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ముందుగా శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆయన సాక్షి గణపతిని దర్శించుకున్నారు. తర్వాత ప్రధాన ఆలయం వద్దకు సీఎం రాగానే అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీశైల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు సీఎంను ఘనంగా సత్కరించి, ఆలయ జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం జలాశయంలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు. అనంతరం శ్రీశైలం రిజర్వాయర్ నాలుగు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను దిగువన సాగర్‌కు విడుదల చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు సున్నిపెంటలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ స్థానికులు, రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గోదావరి జిలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. పోలవరం కుడి కాలువతోనే నేటికి సీమకు నీళ్లు వస్తున్నాయన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు 120 టీఎంసీలు వాడి.. ఆ మిగులు జలాలను సీమకు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏపీకి పోలవరం ఒక వరం అన్నారు. అంతేకాకుండా తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, నగరి, గాలేరు, హంద్రీ నివాల కింద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కులం, మతం, ప్రాంతం అడ్డు వస్తే ప్రజలకు ఎలాంటి మంచి జరగదన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలన్నారు. సున్నిపెంటకు రాగానే.. తల్లులు, చిన్న పిల్లలతో సహా విక్టరీ సింబల్ చూపిస్తుంటే తనకు ఎంతో సంతోషం వేసిందన్నారు. గత పాలకులు ఎవరైనా నవ్వితే తిట్టేవారు.. కొట్టేవారన్నారు. కానీ ఇప్పటి పాలకులు నవ్వించే వారని గుర్తు చేశారు.
ఫ భూగర్భ జలాలను పెంచుకుందాం
సంక్షేమం.. అభివృద్ధి దిశగా సాగాలంటే నీటి సంపద మరింత పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో సాగునీటి సంఘాలు, డ్వాక్రా, విద్యాకమిటీలను తానే తీసుకొచ్చానన్నారు. రాష్ట్రంలో 6,047 సాగునీటి సంఘాలు, 267 పంపిణీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలున్నాయన్నారు. ఈ కమిటీలతో త్వరలో అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేస్తామన్నారు. ఎక్కడిక్కడ భూగర్భ జలాలను సైతం పెంచుకునే విధంగా చైతన్య పరుస్తామన్నారు. రైతులకు పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపుసెట్లు కూడా అందజేస్తామన్నారు.
ఫ సూపర్-6 హామీలపై...
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.4వేలు పింఛన ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.వెయ్యి పెంచేందుకు ఐదేళ్లు సమయం తీసుకుందన్నారు. తల్లికి వందనం పథకం విజయవంతమైందన్నారు. ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ జమ చేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. అనేక మంది పేదల అకలి తీర్చడానికి 204 అన్నక్యాంటీన్లు పెట్టామన్నారు. భవిష్యతలో అన్ని దేవాలయాల్లోనూ నిత్య అన్నదాన సత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఫ సీఎం రాకతో సందడి
శ్రీశైలం జలాశయం నీటి విడుదల నేపఽథ్యంలో సీఎం చంద్రబాబు రాకతో.. శ్రీశైలంలో సందడి వాతావరణం నెలకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం పెద్దఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్ నుంచి ఆలయం.. జలాశయం వరకు జనాలు బారులుదీరారు. వృద్ధులు, మహిళలు, యువత సీఎం చంద్రబాబుకు అభివాదం చేశారు. ఇదిలా ఉండగా ముందుగా సీఎం సున్నిపెంటలో హెలిప్యాడ్ దిగగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
పటిష్ట బందోబస్తు
సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన విజయవంతమైంది. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3:25 గంటల వరకు సీఎం శ్రీశైలంలోనే ఉన్నారు. ఇదే క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3:40 గంటలకు సీఎం హెలిప్యాడ్ ద్వారా అమరావతికి వెళ్లారు. చంద్రబాబు వెంట రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు ఎనఎండీ ఫరూక్, బీసీ జనార్ధన రెడ్డి, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్త జయసూర్య, భూమా అఖిలప్రియ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:51 AM