కదలక తప్పదు!
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:59 PM
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయనుంది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది.
- ఐదేళ్లు సర్వీసు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు బదిలీ
- జిల్లాలో 3 వేల మందికిపైగా స్థానచలనం
- సొంత మండలాల్లో నో పోస్టింగ్
- ఈ నెల 30లోగా ప్రక్రియ పూర్తి
- మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
విజయనగరం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయనుంది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో 626 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో గ్రామ సచివాలయాలు 530, వార్డు సచివాలయాలు 96 ఉన్నాయి. వాటిలో 5,781 మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో మూడో వంతు ఉద్యోగులకు స్థానచలనం జరగనుంది. ఈ లెక్కన జిల్లాలో 3 వేల మంది సచివాలయ ఉద్యోగులకు బదిలీ కానుంది. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల బాధ్యతను మునిసిపల్ కమిషనర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీ బాధ్యతను ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి? ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు? సొంత మండలాల్లో పనిచేస్తున్నవారు ఎందరు? ఇలా అందరి సర్వీసులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల ఎంపిక సమయంలో జరిగిన విధంగానే.. ఇప్పుడు బదిలీల్లో కూడా ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండూ ఒకేసారి..
సచివాలయాల హేతుబద్ధీకరణతో పాటు బదిలీల ప్రక్రియ ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే జనాభాకు అనుగుణంగా సచివాలయాలకు కేటగిరీలను ఇచ్చారు. వీటి పరిధిలో ఆరుగురు నుంచి 8 మంది ఉద్యోగులు ఉంటారు. 31 మే 2025 నాటికి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగికి తప్పనిసరిగా బదిలీ జరగనుంది. జూలై 10లోగా హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరు. దంపతులిద్దరూ సచివాలయ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ, క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, న్యూరో సర్జరీ, కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు పొందిన వారు, 40 శాతానికి పైగా వైకల్యం పొందిన వారు, మానసిక దివ్యాంగులైన పిల్లలు ఉన్నవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లుగా పనిచేసిన వారికి మాత్రం బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా, బదిలీల నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం ఎగబడుతున్నారు. స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, నేతల సాయంతో ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. వారికి నచ్చిన చోటకు బదిలీ చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
పారదర్శకంగా బదిలీలు
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్గదర్శకాలు సైతం జారీచేసింది. ఈ నెల 30లోగా ప్రక్రియ పూర్తికానుంది. సొంత మండలాల్లో పోస్టింగులు ఉండవు. పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేస్తాం.
- రోజారాణి, జిల్లా ప్రత్యేకాధికారిణి, విజయనగరం
Updated Date - Jun 22 , 2025 | 11:59 PM