రోడ్డెక్కిన మహిళలు
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:49 PM
గుక్కెడు నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.. తీవ్ర ఆవేదనతో మున్సిపల్ యంత్రాంగానికి శాపనార్థాలు పెట్టారు. వారం రోజులుగా నీటి సరఫరా లేకపోతే గొంతు తడిచేదెలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజాం రూరల్, జులై 6 (ఆంధ్రజ్యోతి): గుక్కెడు నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.. తీవ్ర ఆవేదనతో మున్సిపల్ యంత్రాంగానికి శాపనార్థాలు పెట్టారు. వారం రోజులుగా నీటి సరఫరా లేకపోతే గొంతు తడిచేదెలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దిగొచ్చేవరకూ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ రాజాం-బొబ్బిలి రోడ్డును ఆదివారం నిర్బంధించారు. సుమారు 500 మంది వరకూ రోడ్డుపై బైఠాయించారు. వారి ఆందోళనతో రోడ్డుపై ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలు తగ్గలేదు.
తాగునీరు సరఫరా కాక..
రాజాంలో నాలుగైదు రోజులుగా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. గడిచిన ఆర్నెళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా కమిషనర్ తాగునీటి సరఫరాకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది మహిళల ఆవేదన. విద్యుత్ సమస్య ఒకవైపు, ట్రాన్స్‌ఫార్మర్ తరచూ మొరాయించడం మరోవైపు, ఎప్పటికప్పుడు ప్రధాన పైప్‌లైన్లు బీటలు వారడం ఇంకోవైపు.. ఇలా రోజుకో కారణంతో రాజాం పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా కుళాయి నీటిపై ఆధారపడే బడుగు, బలహీనవర్గాల పరిస్థితి దయనీయంగా మారింది. విసిగి వేసారిపోయిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆదివారం ఉదయం అంతా కలిసి మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఫలితంగా సుమారు నాలుగు గంటల పాటు రాజాం-బొబ్బిలి రోడ్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండువైపులా సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే రేగిడి వద్ద పంపింగ్‌లో సమస్య పరిష్కారం కావడంతో వారంతా శాంతించి ఇంటిబాట పట్టారు. కాగా గుక్కెడు నీటి కోసం మహిళలు నాలుగు గంటలపాటు రోడ్డెక్కినా మున్సిపల్ కమిషనర్ గాని, సిబ్బంది గాని ఘటనాస్థలం వద్ద కనిపించకపోవడం కొసమెరుపు.
Updated Date - Jul 06 , 2025 | 11:49 PM