శివారు భూములకు సాగునీరు అందేనా?
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:38 PM
ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. రైతన్న వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అయితే, సాగునీటి కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోయి అధ్వానంగా ఉన్నాయి.
- అధ్వానంగా వీఆర్‌ఎస్ కుడి, ఎడమ కాలువలు
- నిలిచిన ఆధునికీకరణ పనులు
మక్కువ, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. రైతన్న వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అయితే, సాగునీటి కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోయి అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది శివారు భూములకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. మండలంలోని శంబర గ్రామ సమీపంలోని వెంగళరాయ సాగర్(వీఆర్‌ఎస్) జలాశయం నుంచి మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల పరిధిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం వీఆర్‌ఎస్ కుడి, ఎడమ ప్రధాన కాలువల అభివృద్ధిని పట్టించుకోలేదు. జైకా నిధులు సుమారు రూ.62 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేసింది. ప్రధాన కాలువల్లో కొంతమేర లైనింగ్ ప్రక్రియ నిర్వహించారు. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు బిల్లులు అందజేయకపోవడంతో మధ్యలో పనులు ఆపేశారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాలువల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోయి సాగునీరు ప్రహహించని పరిస్థితి నెలకొంది. శంబర వద్ద గోముఖి ఆక్విడెక్ట్ కూలిపోయింది. చప్పబుచ్చింపేట సమీపంలో షట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనివల్ల సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో శివారు ప్రాంతాలైన కోన, గోపాలపురం, తూరుమామిడి, శాంతేశ్వరం గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు వెళ్లడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో వ్యర్థాలు, పిచ్చి మొక్కలను యంత్రాలతో తొలగించారు. అయితే, మరలా కాలువల్లో పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైనా జైకా నిధులతో ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
నిధులు వచ్చిన వెంటనే పనులు చేస్తాం
వెంగళరాయసాగర్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు 23 శాతం జరిగాయి. రూ.10 కోట్లతో చేసిన ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో వాటిని మధ్యలో ఆపివేశారు. నిధులు వచ్చిన వెంటనే వీఆర్‌ఎస్ కాలువల ఆధునికీకరణ పనులు నిర్వహిస్తాం.
-రాజశేఖర్, వీఆర్‌ఎస్ జేఈ
Updated Date - Jul 24 , 2025 | 11:38 PM