విద్యాహక్కు చట్టం ఈసారైనా అమలయ్యేనా?
ABN, Publish Date - May 03 , 2025 | 11:55 PM
జిల్లాలో విద్యాహక్కు చట్టం -2009 సక్రమంగా అమలు కావడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లను కేటాయించాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. సాధారణ విద్యార్థులనే పేదలుగా చూపి గత కొంతకాలంగా యాజమాన్యాలు మభ్య పెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
విద్యాహక్కు చట్టం
ఈసారైనా అమలయ్యేనా?
ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందని ఉచిత విద్య
వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఇబ్బందులు
25 శాతం అడ్మిషన్లకు తాజాగా ప్రభుత్వ ఆదేశాలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ప్రస్తుత ప్రభుత్వంపైనే ఆశలు
రాజాం, మే3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాహక్కు చట్టం -2009 సక్రమంగా అమలు కావడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లను కేటాయించాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఇదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. సాధారణ విద్యార్థులనే పేదలుగా చూపి గత కొంతకాలంగా యాజమాన్యాలు మభ్య పెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఇది అమలవుతోంది. కానీ ఎక్కడా పేద విద్యార్థులకు సీట్లు కల్పించిన దాఖలాలు లేవు. అవి కేవలం పేపర్‌కు మాత్రమే పరిమితమన్న విమర్శలు ఉన్నాయి. చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రవేశాలు పొందవచ్చు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్, రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే జిల్లాలో చాలావరకూ సీబీఎస్‌ఈ పాఠశాలలు ఉచిత ప్రవేశాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విముఖత చూపినట్టు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉచిత ప్రవేశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 15 వరకూ కొనసాగనుంది. గత అనుభవాల దృష్ట్యా 25 శాతం అడ్మిషన్ల ప్రక్రియ పక్కాగా అమలుచేయాలని తేల్చిచెప్పడంం విశేషం. ప్రతి పాఠశాలల్లో అడ్మిషన్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలి. గడిచిన మూడేళ్లలో 2350 మందికి 25 శాతం చొప్పున సీట్లు ఇచ్చినట్టు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 4 వేల సీట్లు భర్తీ చేసే అవకాశం ఉంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా..
వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాహక్కు చట్టం నిర్వీర్యమైందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఉచిత అడ్మిషన్లకు సంబంధించి రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 ఫీజును ప్రభుత్వమే నేరుగా ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాలి. కానీ, గత ప్రభుత్వం అమ్మ ఒడితో మెలిక పెట్టింది. తల్లిదండ్రుల నుంచి ఫీజును తీసుకోవాలని ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలకు సూచించింది. నేరుగా యాజమాన్యాలకు ఈ డబ్బులు విడుదల చేయకపోవడంతో పథకం సక్రమంగా అమలుకాలేదు. పుస్తకాలతో పాటు యూనిఫాం సొంత డబ్బులతో కొనుగోలు చేయాలని.. అడ్మిషన్, పరీక్ష ఫీజులంటూ గుంజేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల బలవంతంగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేస్తే కానీ.. ఉచిత అడ్మిషన్లకు తల్లిదండ్రులు ఆసక్తి చూపే అవకాశం లేదు.
ఆరు అంచెల్లో వడబోత..
ఆరు అంచెల్లో నిర్ధారించిన తరువాత విద్యార్థులను అడ్మిషన్ల కోసం ఎంపిక చేయనున్నారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బీసీ మైనార్టీ, అగ్రకులాల్లో పేదలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, షెడ్యూల్ కులాలు వారికి 10 శాతం, ఎస్టీ పిల్లలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వారికి రూ.1.20 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంత కుటుంబాలకు రూ.1.44 లక్షలు మించకుండా వార్షికాదాయం ఉంటే 6 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పాఠశాలకు 3 కిలోమీటర్ల లోపల ఉండాలి. వివరాల కోసం మండల విద్యాశాఖ కార్యాలయాలకు సంప్రదించాల్సి ఉంటుంది.
పేద విద్యార్థుల కోసమే..
పేద విద్యార్థుల కోసమే ప్రభుత్వం విద్యాహక్కు చట్టం అమలు చేస్తోంది. ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. న్యాయస్థానం సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చి తరువాత ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్దం. అలా చేసిన యాజమాన్యాలపై చర్యలు తప్పవు. కచ్చితంగా అన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే.
- మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం
-------------
Updated Date - May 03 , 2025 | 11:55 PM