Get Back on Track? ప్రజాపంపిణీ వ్యవస్థ గాడిలో పడేనా?
ABN, Publish Date - May 30 , 2025 | 11:30 PM
Will the Public Distribution System Get Back on Track? ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా డిపోల ద్వారా రేషన్ అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత వైసీపీ సర్కారు అమలులోకి తెచ్చిన ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల నుంచి కార్డుదారులకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా యాంత్రాంగం చర్యలు చేపడుతోంది. అయితే డిపో డీలర్లకే మళ్లీ సరుకుల పంపిణీ బాధ్యత అప్పగించడంపై సర్వత్రా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
కొంతమంది డీలర్ల తీరే ఇందుకు కారణం
గతంలో సమయపాలన పాటించక.. సక్రమంగా సరుకులు అందించని వైనం
అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్లకు గురైన వారెందరో..
కేసులు నమోదైనా మారని పరిస్థితి
ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లావాసుల విన్నపం
పార్వతీపురం, మే30 (ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా డిపోల ద్వారా రేషన్ అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత వైసీపీ సర్కారు అమలులోకి తెచ్చిన ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేసింది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల నుంచి కార్డుదారులకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా యాంత్రాంగం చర్యలు చేపడుతోంది. అయితే డిపో డీలర్లకే మళ్లీ సరుకుల పంపిణీ బాధ్యత అప్పగించడంపై సర్వత్రా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో కొంతమంది డీలర్లు కూడా పేదల బియ్యం పక్కదారి పట్టించిన విషయంలో సస్పెన్షన్లకు గురయ్యారు. వారిపై 6ఏ కేసులు నమోదు చేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మరికొందరు సమయ పాలన కూడా పాటించేవారు కాదు. సక్రమంగా రేషన్ డిపోలను తెరిచేవారు కాదు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు సరుకులు ఇవ్వాల్సి ఉన్నా.. కొంతమంది దానిని పాటించేవారు కాదు. దీంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. డిపోల ముందు పడిగాపులు కాసేవారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంది. సరుకుల సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, కార్డుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
6ఏ కేసులు నమోదైనా..
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసిన వారిపై 2022 నుంచి ఇప్పటివరకు 29 కేసులు నమోదు చేశారు. జిల్లా నుంచి ఒడిశా ప్రాంతంలో ఉన్న అలమండ, రాయగడ, సుంకి తదితర ప్రాంతాలకు పేదల బియ్యం ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. దాడుల్లో పట్టుబడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో ఈ దందా మరింత జోరుగా సాగింది. తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వెనక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 578 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,96,880 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో ఏఏవై కార్డులు 54,930 వరకూ ఉన్నాయి. ప్రతినెలా సుమారు 4,900 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి డీలరు తమ డిపో ద్వారా రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు అందించాలి. కార్డుదారులు తమకు అనుకూలంగా ఉన్న ఏ సమయంలోనైనా డిపోకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ డిపో డీలర్లు నిత్యావసర సరుకులు అందించాల్సి ఉంది.
డిపోల ద్వారా రేషన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ డిపోల ద్వారా కార్డుదారులకు సరుకుల సరఫరా జరగనుంది. ఇన్‌చార్జి డీఎస్‌వోగా డీఆర్‌వో హేమలతకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాం.
- శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం
Updated Date - May 30 , 2025 | 11:30 PM