Outer Ring Road ఔటర్ రింగు రోడ్డుకు మోక్షం కల్పిస్తారా?
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:34 PM
Will the Outer Ring Road be given salvation? జిల్లాకేంద్రవాసులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణం మీదుగా ఒడిశాకు భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు నరకం చూస్తున్నారు. తరచూ పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి
భారీ వాహనాల రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు
తరచూ ప్రమాదాలకు గురువుతున్న వాహనదారులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక కాగితాలకే పరిమితం
రాష్ట్ర ప్రభుత్వంపైనే జిల్లా కేంద్ర ప్రజల ఆశలు
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రవాసులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణం మీదుగా ఒడిశాకు భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు నరకం చూస్తున్నారు. తరచూ పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిపై దృష్టి సారించలేదు. దీంతో పట్టణవాసులు, వాహనదారులు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం వారంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకు న్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మోక్షం కల్పించి.. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
గత 35 ఏళ్ల కిందట అప్పటి జనాభాకు తగ్గట్టుగా పార్వతీపురం పట్టణం గుండా బైపాస్ రహదారిని నిర్మించారు. నాటి పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు భవిష్యత్ గురించి ఆలోచించలేదనేది వాస్తవం. గత పదేళ్లుగా చూసుకుంటే.. పట్టణ జనాభా(ప్రస్తుత జిల్లా కేంద్ర జనాభా) మూడింతలు పెరిగింది. 2012 జనాభా లెక్కల ప్రకారం 55వేల మంది పట్టణంలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా అయితే 80 వేలకు పైగానే జనాభా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా ఆసుపత్రికి వచ్చేవారితో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, పరిసర ప్రాంత గ్రామస్థులు, వ్యాపారులతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి పాతబస్టాండ్ జంక్షన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే..
జిల్లా కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే భారీ వాహనాలు జిల్లా కేంద్రం అవతల నుంచి ప్రయాణిస్తాయి. దీంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. పట్టణంలో పాదచారులు, వాహనచోదకుల రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయి. జిల్లా మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ముడి సరుకులు రవాణా పెరుగుతుంది. దీంతో పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకే కాకుండా ‘మన్యం’ చుట్టూ ఉన్న జిల్లాలకు ప్రయాణికులు, వాహనదారులు త్వరితగతిన చేరుకోవచ్చు.
గత టీడీపీ ప్రభుత్వ హయంలోనే అడుగులు
పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట గోరీల కూడలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తొలి అడుగు పడింది. కొమరాడ మండలం నందాపురం మీదుగా 37 ఏకరాలను భూమిని సేకరించేందుకు ఆర్‌అండ్‌బీ, రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. 2019లో సర్వే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. మొదటి విడతగా భూ సేకరణ, వివిధ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.68 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చారు. ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతులు రాలేదు
ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా రహదారుల మరమ్మతులపై దృష్టి సారించాం.
- ఎస్.రామచంద్రరావు, ఈఈ, ఆర్‌అండ్‌బీ, పార్వతీపురం మన్యం
Updated Date - Apr 08 , 2025 | 11:34 PM