Will the Irregularities Be Exposed? అక్రమాల లెక్క తేలేనా?
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:14 AM
Will the Irregularities Be Exposed? పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని వెలుగు శాఖలో అక్రమాలపై చర్యలు కొరవడ్డాయి. మొత్తంగా ఎనిమిది క్టస్లర్లలో నిధులు స్వాహా అయినట్లు ఆరోపణలున్నా.. బాధ్యుల నుంచి రికవరీ చేయడం లేదు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
లబ్ధిదారులకు ‘ఉన్నతి’ రుణాల పంపిణీలో అవకతవకలు
కొందరు ఉద్యోగులు ఆ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు
కొన్నాళ్లుగా విచారణ పేరుతో కాలయాపన
రికవరీకి ఆదేశాలిచ్చినా అమలు చేయని వైనం
తాజాగా డీఆర్‌డీఏలో ఆ శిఖ విలీనం
ఇకనైనా చర్యలు ఉంటాయా?
పార్వతీపురం, జూన్19(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని వెలుగు శాఖలో అక్రమాలపై చర్యలు కొరవడ్డాయి. మొత్తంగా ఎనిమిది క్టస్లర్లలో నిధులు స్వాహా అయినట్లు ఆరోపణలున్నా.. బాధ్యుల నుంచి రికవరీ చేయడం లేదు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గతంలో ఉన్నతి పథకం ద్వారా సబ్ ప్లాన్ మండలాల పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘ సభ్యులకు రుణాలు మంజూరు చేశారు. అయితే కొంతమంది వీవోఏల ప్రతినిధులు సీసీలతో చేయికలిపి లబ్ధిదారులకు రుణాలు అందించకుండా నిధులను దారి మళ్లించారు. దీనిపై కొన్నాళ్లుగా విచారణ జరుగుతున్నా.. ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు. తాజాగా డీఆర్‌డీఏలో వెలుగు శాఖ విలీనం చేయడంతో అక్రమాల కథ కొలిక్కివచ్చేనా ? అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పక్కదారి పట్టిన సొమ్మును బాధ్యుల నుంచి రివకరీ చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘ సభ్యులు 8,236 మందికి రూ.31.84 కోట్లను గతంలో రుణాలుగా అందించారు. అయితే పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని కొన్ని మండలాల్లో లబ్ధిదారులకు ఈ రుణాలను అందించలేదు. నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతంలో కొన్ని క్లస్టర్లలో అధికారులు విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగుల నుంచి నిధుల రికవరీకి ఆదేశించినా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యల్లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని మండలాల్లో ...
- సాలూరు మండల పరిధిలో 692 మంది సభ్యులకు రూ.2.63 కోట్లును ఉన్నతి ద్వారా రుణాలుగా అందించారు. కానీ తోణాం, బాగువలస క్లస్టర్ పరిధిలో ఉన్నతి రుణాలు పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.పది లక్షలు పైబడి రుణాలు లబ్ధిదారులకు అందించలేదు. రికార్డుల్లో మాత్రం వారికి ఇచ్చినట్లుగా చూపించి నిధులు స్వాహా చేసినట్టు విమర్శలున్నాయి.
- జియ్యమ్మవలస మండలంలో 589 మంది సభ్యులకు రూ.2.25కోట్లు రుణాలుగా అందించారు. ఇందులో పీటీమండ, గౌరమ్మపేట క్లస్టర్ పరిధిలో కొంతమందికి రుణాలు ఇవ్వకుండా స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
- పార్వతీపురంలో 515 మంది సభ్యులకు రూ.2.34 కోట్లు రుణాలుగా అందించినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ ఈ మండలంలోని డోకిశిల క్లస్టర్ పరిధిలో సుమారు రూ. పది లక్షలు లబ్ధిదారులకు అందించలేదని తెలుస్తోంది.
- కొమరాడ మండలంలో 658 మంది సభ్యులకు రూ.2.33 కోట్లను రుణాలుగా అందించారు. అయితే పూడెసు పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
- గుమ్మలక్ష్మీపురం మండలంలో 827 మంది సభ్యులకు రూ.3.34 కోట్లను రుణాలుగా అందించారు. అయితే రాయగడ జమ్ము క్లస్టర్ పరిధిలో రూ. 23 లక్షలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ పూర్తి చేశారు. నిధులు స్వాహా చేసిన ఉద్యోగి నుంచి రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో సదరు ఉద్యోగి నుంచి రికవరీ జరగలేదు.
- మక్కువ మండలంలో 446 మంది సభ్యులకు రూ.1.67 కోట్లును రుణాలుగా అందించారు. దుగ్గేరు క్లస్టర్ పరిధిలో రూ.పది లక్షల పక్కదారి పట్టించినా ఇప్పటివరకు ఎటువంటి చర్యల్లేవు.
- కురుపాంలో 1096 మంది సభ్యులకు రూ.3.94 కోట్లు రుణాలుగా అందించారు. అయితే నీలకంఠాపురం, గుమ్మ, వలస బల్లేరు క్లస్టర్ల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులకు రుణాలు అందించకుండా కొంతమంది ఆ నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
- పాచిపెంట మండలంలో 721 మంది సభ్యులకు రూ. 2.49 కోట్లను రుణాలుగా అందించారు. కేరంగి, కోటికపెంట, వేటగానివలస క్లస్టర్ పరిధిలో లబ్ధిదారులకు రుణాలు అందించలేదు.
చర్యలు తప్పవు..
లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే చర్యలు తప్పవు. ప్రస్తుతం విశాఖలో ప్రధానమంత్రి మోదీ పర్యటన విధుల్లో ఉన్నా.
- సుధారాణి, పీడీ, డీఆర్‌డీఏ, పార్వతీపురం
Updated Date - Jun 20 , 2025 | 12:14 AM