Giriputras గిరిపుత్రుల దశ మారేనా?
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:35 PM
Will the Fate of Giriputras Change? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గిరిజన చిన్నారులు పాఠశాలలకు వెళ్లి ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.
పాఠశాలలకు పక్కా భవనాలు.. నిధులు మంజూరు
రేకులషెడ్లు, శిథిలావస్థ బడుల్లో చదువులకు స్వస్తి
గిరిజన విద్యార్థులకు తీరనున్న కష్టాలు
సీతంపేట రూరల్, జూన్17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గిరిజన చిన్నారులు పాఠశాలలకు వెళ్లి ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. శిథిలావస్థలో, రేకుల షెడ్డులో ఉన్న పాఠశాలల స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. మరో మూడు నెలల్లో వాటి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా కూటమి ప్రభుత్వ చొరవతో త్వరలోనే గిరిజన చిన్నారుల కష్టాలు తీరనున్నాయి.
ఇదీ పరిస్థితి..
మండలంలో 75 ఎంపీయూపీ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 2,200 మందికి పైగా గిరిజన చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 12 పాఠశాలలు శిఽథిలావస్థలో ఉండగా.. మరికొన్ని రేకులషెడ్డుల్లో నడుస్తున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యపై నిర్లక్ష్యం వహించింది. దీంతో గిరిజన విద్యార్థులు రేకులషెడ్డుల్లోనే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలైతే ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యనభ్యసించాల్సి వస్తోంది. వర్షాకాలంలో అయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చిన్నారులను పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే సమయంలో మన్యంలో డ్రాపౌట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది.
వైసీపీ హయాంలో..
గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద అర కొర నిధులు విడుదల చేయడంతో గిరిజన పాఠశాలల భవనాలు చాలా వరకు పునాది దశలోనే నిలిచిపోయాయి. దీంతో గిరిజన విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. చాలీచాలని ఇరుకు గదుల్లోనే చదువుకోవాల్సి వస్తోంది.
ఎస్‌ఎస్‌ఏ నిధులతో నిర్మాణాలు
సీతంపేట ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా శిఽథిలావస్థలో, రేకులషెడ్డుల్లో నడుస్తున్న పాఠశాలలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. పక్కా భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ(సమగ్ర శిక్షా అభియాన్)నిధులతో కొండాడ, రామానగరం, చిన్నపల్లంకి, కోపువలస, వలగెడ్డ, వెదురువలస, పొంజాడ గ్రామాల్లో పక్కా పాఠశాలల భవనాలు నిర్మించనున్నారు. రూ.13.05లక్షలతో ఒక్కో భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే కోపువలస గ్రామంలో పాఠశాల భవనం పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన భవన నిర్మాణాలను కూడా మూడు నెలల్లో పూర్తిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పల్లెపండుగ ద్వారా ఎంపీయూపీ, ఆశ్రమ పాఠశాలలు ప్రహరీల నిర్మాణాలు పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా పాఠశాల భవనాలు త్వరగా అందుబాటులోకి వస్తే గిరిజన విద్యార్థుల ఇబ్బందులు తప్పుతాయని ప్రజా సంఘాల నాయకులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఎంఈవో ఏమన్నారంటే...
‘సీతంపేట ఏజెన్సీలో శిఽథిలావస్థలో ఉన్న పాఠశాలల స్థానంలో పక్కా భవనాల కోసం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించాం. అప్పట్లో సకాలంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో పునాదుల స్థాయిలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. మరికొన్ని పాఠశాలలు రేకులషెడ్డుల్లో నడుస్తున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఇటువంటి పాఠశాలల స్థానంలో పక్కా భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. వాటి నిర్మాణాలు పూర్తయితే గిరిజన చిన్నారులకు ఇబ్బందులు తప్పుతాయి.’ అని ఎంఈవో ఆనందరావు తెలిపారు.
Updated Date - Jun 17 , 2025 | 11:35 PM