August? ఆగస్టులోనైనా ఇస్తారా?
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:58 PM
Will It Be Given at Least in August? జిల్లాలో జీవిత భాగస్వామ్య (స్పౌజ్) పింఛన్ల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. వచ్చేనెలలో అయినా పంపిణీ చేస్తారో లేదోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1,521 మంది వితంతువులకు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేశారు. 2023, డిసెంబరు 1 నుంచి 2024, అక్టోబరు 31 మధ్య కాలంలో మృతి చెందిన లబ్ధిదారు జీవిత భాగస్వామిని స్పౌజ్ పింఛన్‌దారుగా గుర్తించారు. అయితే ఈ ఏడాది మే నెలలో వారికి పింఛన్ సొమ్ము పంపిణీ చేయాల్సి ఉన్నా.. నేటికీ అందకపోవడంతో వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గరుగుబిల్లి, జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీవిత భాగస్వామ్య (స్పౌజ్) పింఛన్ల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. వచ్చేనెలలో అయినా పంపిణీ చేస్తారో లేదోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1,521 మంది వితంతువులకు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేశారు. 2023, డిసెంబరు 1 నుంచి 2024, అక్టోబరు 31 మధ్య కాలంలో మృతి చెందిన లబ్ధిదారు జీవిత భాగస్వామిని స్పౌజ్ పింఛన్‌దారుగా గుర్తించారు. అయితే ఈ ఏడాది మే నెలలో వారికి పింఛన్ సొమ్ము పంపిణీ చేయాల్సి ఉన్నా.. నేటికీ అందకపోవడంతో వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆగస్టులోనైనా పింఛన్లు అందించేలా చూడాలని వారు కోరుతున్నారు. వాస్తవంగా జూలై నెలలో ఆ పింఛన్ అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు సచివాలయాల వారీగా నిధులు కేటాయించారు. అయితే జూలైలోనూ పంపిణీ కాకపోవడంతో 1,521 మందికి సంబంధించిన స్పౌజ్ పింఛన్ల నిధులు వెనక్కి మళ్లాయి. ఇదిలాఉండగా ఆగస్టు నెలకు సంబంధించి 1,38,769 మంది వివిధ రకాల సామాజిక పింఛన్ దారులకు ఎన్టీఆర్ భరోసా కింద రూ. 59.21కోట్లు కానున్నాయి. స్పౌజ్ పింఛన్లకు నిధులు కేటాయించలేదు. దీంతో వితంతువుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎం.సుధారాణిని వివరణ కోరగా.. ‘జీవిత భాగస్వామ్య పింఛన్లు పంపిణీకి ఎటువంటి ఆదేశాలు రాలేదు. జూలై నెలలో పంపిణీ చేయాల్సి ఉండగా మంజూరైన నిధులు వెనక్కి వెళ్లాయి. స్పౌజ్ పింఛన్లకు సంబంధించి అధికంగా వినతులు అందుతున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆగస్టు నెలకు సంబంధించి గతంలో మంజూరైన పాతవారికే పింఛన్లు అందిస్తాం. నూతనంగా మంజూరైన వితంతువులకు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే నగదు పంపిణీ చేస్తాం.’ అని తెలిపారు.
Updated Date - Jul 30 , 2025 | 11:59 PM