Will 19 Years of Waiting Pay Off? 19 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
ABN, Publish Date - May 15 , 2025 | 11:03 PM
Will 19 Years of Waiting Pay Off? జిల్లాలో కీలకమైన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తవడం లేదు. దీంతో ఎనిమిది పంచాయతీలు.. 36 గ్రామాల్లో వందలాది మంది ప్రజల కష్టాలు తీరడం లేదు. వారి నిరీక్షణ ఫలించడం లేదు. అత్యవసర సమయాల్లో ఆయా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం జరిగిన పనులు
20 శాతం నిర్మాణంపై దృష్టి సారించని వైసీపీ సర్కారు
ఇబ్బందుల్లో 36 గ్రామాల ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
జియ్యమ్మవలస, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలకమైన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తవడం లేదు. దీంతో ఎనిమిది పంచాయతీలు.. 36 గ్రామాల్లో వందలాది మంది ప్రజల కష్టాలు తీరడం లేదు. వారి నిరీక్షణ ఫలించడం లేదు. అత్యవసర సమయాల్లో ఆయా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే నగావళి నది దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. మండల కేంద్రం కొమరాడకు చేరుకోవాలంటే జియ్యమ్మవలస పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా సుమారు 75 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కొన్నేళ్లుగా ఆయా గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే 80 శాతం వరకూ పనులు పూర్తయిన తర్వాత.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. గత వైసీపీ సర్కారు 20 శాతం పనులను కూడా పూర్తిచేయించలేకపోయింది. దీంతో ఆయా గ్రామస్థులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి
కొమరాడ మండలంలో 31 పంచాయతీలు వాటి పరిధిలో 154 గ్రామాలు ఉన్నాయి. అయితే నాగావళి నది ఈ మండలాన్ని రెండుగా చీల్చేసింది. ఐదు సచివాలయాల పరిధిలో 8 పంచాయతీలు నాగావళి నదికి తూర్పు వైపు ఉంటే, మిగిలిన 15 సచివాలయాల పరిధిలో 23 పంచాయతీలు ఈ నదికి పడమర వైపు ఉన్నాయి. ఈ వైపే మండలానికి చెందిన పరిపాలన కార్యక్రమాలన్నీ ఉన్నాయి. దీంతో తూర్పు వైపు ఉన్న దళాయిపేట, గుణదతీలేసు, కెమిశీల, కొట్టు, మాదలింగి, తొడుము, పాలెం, వన్నాం పంచాయతీలు, వాటి పరిధిలో ఉన్న 36 గ్రామాల ప్రజలు, ఉద్యోగులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వర్షా కాలంలో మండల కేంద్రానికి రావాలంటే 50 నుంచి 75 కిలో మీటర్ల వరకు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. అత్యవసరమైతే ఇక అంతే సంగతులు. కొన్నిసార్లు మర పడవలపై ప్రాణాలకు తెగించి నదిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. పూర్ణపాడు - లాబేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పూర్తయితే దాదాపు 50 కిలో మీటర్ల ప్రయాణం తప్పుతుందని ఆయా గ్రామస్థులు చెబుతున్నారు.
నిధుల కేటాయింపు ఇలా..
- పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు 2006, సెప్టెంబరు 16న రూ. 3.20 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీని నిర్మాణ బాధ్యతను గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించారు. ఆ తరువాత ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖకు 2009, జూన్ 3న బాధ్యతలు అప్పగించారు. 2010, మార్చి 22న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగానికి పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- మార్కెట్లో రేట్లు పెరగడంతో 2011, ఏప్రిల్ 27న రూ.7 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. రాష్ట్రీయ శాం వికాశ్ యోజన (ఆర్‌ఎస్‌వీవై) నుంచి రూ. 3.50 కోట్లు, నాబార్డు నుంచి రూ. 3.50 కోట్లు కలిపి కొత్త రేట్లు ప్రకారం నిధులు మంజూరు చేశారు. విశాఖపట్టణానికి చెందిన ఎం/ఎస్ వెంకట పాండురంగ కనస్ట్రక్షన్‌కు పనుల బాధ్యత అప్పగించారు. కానీ సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.
- 2015, జనవరి 23న రూ. 9.98 కోట్లతో మళ్లీ కొత్త ఎస్టిమేట్లు వేయించారు. అదే ఏడాది మే 25న హైదరాబాద్‌కు చెందిన ఎం/ఎస్ ఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పనులు అప్పగించారు. 2017, మే 24 నాటికి పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత 2020, జూన్ 20 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని రివైజ్డ్ ఎడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ (ఆర్‌ఏఎస్) రూపంలో రూ. 14 కోట్లకు నిధులు పెంచారు. 2018 వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు.
- 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో గత ఐదేళ్లుగా పనులు సాగడం లేదు. దీని నిర్మాణంపై వైసీపీ పాలకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి.
ఇంతవరకు జరిగిన పనులు
- నాగావళి నదిపై 11 పిల్లర్లతో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఓపెన్ ఫౌండేషన్ ఏడో పిల్లర్ నుంచి 11వ పిల్లర్ వరకు శ్లాబ్ లెవెల్ పూర్తి చేశారు. ఒకటో స్తంభం వద్ద స్లాబ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో నిర్మాణం పూర్తి చేశారు. 2వ స్తంభం మాత్రం నదిలో ఉండడం వల్ల తరువాత పనులు చేపడతామని వదిలేశారు. రెండు అబుట్‌మెంట్లు, 12 స్లాబ్‌లలో ఏడు స్లాబ్‌లు పూర్తి చేశారు. అంటే లాబేసు వంతెన వైపు పనులు పూర్తవగా, పూర్ణపాడు వైపు 30 మీటర్ల వరకు ఎప్రోచ్‌వాల్స్ పూర్తి చేశారు. మిగిలిన పనులు ఇంకా చేయాల్సి ఉంది.
- దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన లేదు. కొద్ది రోజుల తరువాత పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త ఎస్టిమేట్లతో నిధులు మంజూరు చేస్తే తప్ప ఏమీ చేయలేమని మెయిల్ ద్వారా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ ఉన్నతాధికా రులకు తెలియజేశారు. దీంతో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కొత్త ఎస్టిమేట్లతో రూ. 15.80 కోట్లు కావాలని కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించారు.
-ఈనెల 13న ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సమావేశం నిర్వహించగా.. రూ. 14 కోట్లతోనే పనులు చేయాలని నిర్ణయించారు. గత కాంట్రాక్టర్ చేసిన పను లకు బిల్లులు చెల్లించి, కొత్త కాంట్రాక్టర్‌తో పనులు కొనసాగించాలని ఆదేశించారు. అయితే ఇంతవరకు రూ. 8 కోట్లతో పనులు జరిగాయని అధికారులు తెలిపారు. ఇంకా రూ.7 కోట్లు పనులు చేయాల్సి ఉందని పూర్తి నివేదికను అందించారు.
కచ్చితంగా పూర్తవుతుంది..
పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో కచ్చితంగా పూర్తవుతుంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లాను.
- తోయక జగదీశ్వరి, ప్రభుత్వ విప్, కురుపాం
=====================================
ప్రభుత్వం దృష్టిలో ఉంచాం
పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు సంబంధించి పూర్తి నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించాం. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.
- చంద్రశేఖర్, ఈఈ, పంచాయతీరాజ్ శాఖ, పార్వతీపురం మన్యం
Updated Date - May 15 , 2025 | 11:03 PM