Whose are those two kilos? ఆ రెండు కిలోలు ఎవరికి?
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:55 PM
Whose are those two kilos? రేషన్ డీలర్లు బియ్యంలో ‘కోత’ పెడుతున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. దీనిపై లబ్ధిదారులు ఫిర్యాదులు చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే డీలర్లకు ఇచ్చే సరుకులోనూ ‘కోత’ పెడితే.. కార్డుదారులకు బియ్యం సక్రమంగా అందుతాయా? ఈ నేపథ్యంలో డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. 50 కిలోల బస్తాలో రెండు కిలోల వరకూ తరుగు కనిపిస్తోందని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ఇలా అయితే ఈ నెల రేషన్ విడిపించలేమని వారు చెబుతున్నారు.
ఆ రెండు కిలోలు ఎవరికి?
50 కిలోల బియ్యం బస్తాలో తరుగు
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
రేషన్ ఇవ్వలేమంటున్న డీలర్లు
అధికారులకు ఫిర్యాదుల వెల్లువ
రేషన్ డీలర్లు బియ్యంలో ‘కోత’ పెడుతున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. దీనిపై లబ్ధిదారులు ఫిర్యాదులు చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే డీలర్లకు ఇచ్చే సరుకులోనూ ‘కోత’ పెడితే.. కార్డుదారులకు బియ్యం సక్రమంగా అందుతాయా? ఈ నేపథ్యంలో డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. 50 కిలోల బస్తాలో రెండు కిలోల వరకూ తరుగు కనిపిస్తోందని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ఇలా అయితే ఈ నెల రేషన్ విడిపించలేమని వారు చెబుతున్నారు. ఎంఎల్‌ఎస్ గోదాముల వద్ద నుంచి వస్తున్న స్టాకు తూకంలో వ్యత్యాసం కనిపిస్తోందని, అన్ని బస్తాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 26న చీపురుపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్‌పై మెరకముడిదాం రేషన్ డీలర్లు ఫిర్యాదు కూడా చేశారు.
రాజాం, జూలై 27(ఆంధ్రజ్యోతి):
ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వస్తున్న బియ్యంలో వ్యత్యాసం కనిపిస్తుందో? లేక గోదాముల వద్ద గోల్‌మాల్‌నో జరుగుతుందో? కానీ.. ప్రతీ 50 కిలోల బస్తా వద్ద మాత్రం 2 నుంచి 3 కిలోల బియ్యం తరుగు వస్తోందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. గోనెసంచి బరువు 580 గ్రాముల వరకూ ఉంటుంది. దీంతో అదనంగా అరకిలో బియ్యం ఇవ్వాల్సింది పోయి.. ఇలా రెండు కిలోల బియ్యం తగ్గించి ఇస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతినెలా చివరి వారంలో రేషన్‌కు సంబంధించి డీడీలు తీస్తారు. తరుగు సమస్య తేల్చనిదే ఈ నెల రేషన్ ఇవ్వలేమని వారు చెబుతున్నారు.
క్వింటాళ్ల లెక్కతోనే ఇబ్బందులా?
జిల్లాలో కొన్ని ఎల్‌ఎంఎస్ గోదాముల నుంచి రేషన్ డిపోలకు వస్తున్న బస్తాల్లో 2 నుంచి 3 కిలోల తరుగు వస్తోంది. 50 కిలోలు చొప్పున బస్తాల్లో బియ్యం సరఫరా ఉంటుంది. గన్నీ సంచి బరువు 580 గ్రాములు. బియ్యం బరువు 49.420 కిలోలు ఉండాలి. మొత్తం 50 కిలోలకు తూకం వేసి రేషన్ డిపోలకు పంపిస్తుంటారు. అయితే కొన్ని డిపోల నుంచి వచ్చే బరువు కేవలం 47 కిలోలు మాత్రమే ఉంటోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో క్వింటాళ్ల లెక్క తూకం వేయడంతో సంచుల్లో కోత వస్తోంది. దాదాపు అన్ని గోదాముల్లోనూ ఇదే పరిస్థితి. అయితే ఈ బియ్యం తరుగు కోత ప్రభావం లేకుండా చూసుకునేందుకు కొందరు డీలర్లు వినియోగదారులకు తక్కువ బియ్యం తూస్తున్నారు. దీనివల్ల చివరకు ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. కొన్ని మండలాల్లో డీలర్లు ఫిర్యాదుచేస్తుండడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. గోదాముల వద్ద సిబ్బంది చేతవాటాన్ని కూడా గుర్తిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులున్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. వీరికి 1319.5 టన్నుల బియ్యం మాత్రమే అందుతోంది. 50 కిలోల వద్ద మూడు కిలోల వరకూ తరుగు వస్తుంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ఈ పరిస్థితి ఉంటే అసలు ఇలా తరుగు తీసిన బియ్యాన్ని ఏం చేస్తున్నారనేది ప్రశ్న. మే నెల 6న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్‌మిల్లులను అక్కడి అధికారులు ఆకస్మికంగా పరిశీలించగా 82.4 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి విజయనగరం పౌరసరఫరా గోదాముల నుంచి వచ్చిన సరుకుగా నిర్థారించారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్ల బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే గోదాముల నుంచి వచ్చిన బస్తాల సీల్ విప్పకుండానే తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఇదంతా ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద నుంచి తరలుతున్న బియ్యంగా తెలుస్తోంది. ఇప్పటికైనా దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం
బియ్యంలో తరుగు వస్తున్నట్టు రేషన్ డీలర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్ గోదాములపై నిఘా పెట్టాం. బియ్యంలో తరుగు వస్తే ఊరుకునేది లేదు. ఒక వేళ ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వస్తే తిప్పి పంపిస్తాం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టించడం నేరం. ఈ విషయంలో కఠినంగా ఉంటాం. కేసులు నమోదు చేస్తాం.
- మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి, విజయనగరం
--------------
Updated Date - Jul 28 , 2025 | 11:55 PM